పాదయాత్ర తనలో అహంకారాన్ని మాయం చేసిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశం అయ్యాయి. ఉమ్మడి, విభజిత ఆంధ్రప్రదేశ్‌లో పాదయాత్ర చేసిన నాయకులున్నారు.
వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని తెచ్చి పెట్టింది. తనలో పాదయాత్ర ఎంతో మార్పు తీసుకొచ్చిందని పలు సందర్భాల్లో ఆయన గొప్పగా చెప్పారు. పాదయాత్ర ఆయనలో సానుకూల మార్పు తీసుకొచ్చిందనేందుకు ఎన్నైనా ఉదాహరణలు చెప్పుకోవచ్చు.
వైఎస్సార్ సంక్షేమంతో పాటు సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, అభివృద్ధి పనులకు పెద్దపీట వేశారు. అందుకే రెండో దఫా కూడా ఆయన అధికారంలోకి రాగలిగారు. వైఎస్సార్ మరణానంతరం ఏపీలో చోటు చేసుకున్న రాజకీయ సంక్షోభ పరిస్థితుల్లో చంద్రబాబు కూడా పాదయాత్ర చేశారు. ఏపీ విభజన తర్వాత 2014లో ఆయన అధికారంలోకి రాగలిగారు. ఇందుకు జనసేన, బీజేపీతో పొత్తు కలిసొచ్చింది.
చంద్రబాబులో పాదయాత్ర తీసుకొచ్చిన మార్పు శూన్యమని చెప్పొచ్చు. ప్రతిదీ తన గొప్పే అని చెప్పుకోవడం ఆయనకు బలహీనతగా మారింది. హైదరాబాద్‌ను నిర్మించింది తానే అని బాబు చెప్పుకుంటున్నారంటే, ఆయన మానసిక పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. కనీసం టీడీపీ ప్రభుత్వం అని కూడా ఆయన అనరు. నేను….అని మాత్రమే చెప్పుకుంటున్నారంటే, ఆయనలో అహంకారం ఏ స్థాయిలో వుందో అంచనా వేసుకోవచ్చు.
ఇటీవల చిత్తూరు ఎస్పీ రిషాంత్‌రెడ్డిని హెచ్చరిస్తూ… నీలాంటోళ్లు నా దగ్గర ఎంతో మంది పని చేశారని హేళనగా మాట్లాడారు. ఏ అధికారి అయినా ప్రభుత్వంలో పని చేస్తారే తప్ప, వ్యక్తిగతంగా కాదని చంద్రబాబుకు తెలియదా? అయినా తానేదో గొప్పవాడని, ఇతరులంతా సేవకులనే భావన చంద్రబాబులో వుంది. నాయీ బ్రాహ్మణులను నడిరోడ్డుపై తోకలు కత్తిరిస్తాననే హెచ్చరికలు బాబు అహంకారానికి నిదర్శనం. ఇలా చంద్రబాబు అహంకారం గురించి కథకథలుగా చెప్పుకోవచ్చు. బాబు చేతిలో అధికారం వుంటే, ఆయనకు కళ్లు ఉండాల్సిన చోట ఉండవని అంటుంటారు.
ఇక వైఎస్ జగన్ విషయానికి వస్తే… సుదీర్ఘ పాదయాత్ర చేసిన ఘనత దక్కించుకున్నారు. సీఎం కావాలనే తన స్వప్నాన్ని సాకారం చేసుకున్నారు. వైఎస్ జగన్ తక్కువగా మాట్లాడ్డం వల్ల ఆయన అజ్ఞానం, అహంకారం బయటపడే అవకాశాలు తక్కువే. కానీ ఆయన చర్యలు మాత్రం అహంకారపూరితంగా వుంటున్నాయి. ఈ అహంకారమే సొంతవాళ్లను కూడా దూరం చేసింది. ఇంతకంటే ఆయనకు జరగాల్సిన నష్టం ఏముంటుంది? తన చిన్నాన్న వైఎస్ వివేకా హత్య కేసు విచారణలో కూడా జగన్ అహంకారమే సీబీఐ దర్యాప్తునకు దారి తీసిందనే అభిప్రాయం లేకపోలేదు.
టీడీపీ యువ కిశోరం నారా లోకేశ్ ప్రస్తుతం యువగళం పేరుతో జనంలో తిరుగుతున్నారు. ప్రస్తుతం గుంటూరు జిల్లాలో ఆయన పాదయాత్ర సాగుతోంది. యువగళం పాదయాత్ర లోకేశ్‌లో మానసికంగా ఎలాంటి మార్పు తీసుకురాలేదు. ఫిజికల్‌గా కొంచెం తగ్గినట్టు కనిపిస్తోంది. పాదయాద్రలో నిత్యం అనేక రకాల మనుషులతో మాట్లాడ్డం వల్ల జీవితం అంటే ఏంటో బాగా తెలుసుకునే అవకాశం ఉంటుంది.
మంగళగిరిలో ఓటమి, రానున్న ఎన్నికల్లో తన నాయకత్వ సమర్థతను నిరూపించుకోవాల్సిన కీలక సమయంలో లోకేశ్ పాదయాత్రలో ఎంతో నేర్చుకోవాల్సి వుంది. అయితే పాదయాత్రలో లోకేశ్ నోరు పారేసుకోవడం చూస్తే, ఇతను ఎప్పటికీ మారడనే అభిప్రాయం బలపడుతోంది. కనీస సంస్కారం లేకుండా సీఎం జగన్‌పై ఇష్టానుసారం మాట్లాడ్డం విమర్శలకు దారి తీస్తోంది. నిన్నమొన్నటి వరకూ తన తండ్రి నేతృత్వంలోని ప్రభుత్వమే పాలించిందనే వాస్తవాన్ని విస్మరించారు.
ఇప్పుడు మరోసారి అధికారం ఇస్తే, ఆంధ్రప్రదేశ్ రూపు రేఖలు మారుస్తానని లోకేశ్ హామీలు గుప్పిస్తుంటే, నవ్వాలో ఏడ్వాలో జనానికి అర్థం కావడం లేదు. రాహుల్‌గాంధీపై పప్పు అనే ముద్ర ఉన్నప్పటికీ, ఇవాళ లోక్‌సభలో ఆయన మాట్లాడిన తీరు ప్రశంసలు అందుకుంటోంది. పాదయాత్ర తనలోని అహంకారాన్ని చంపేసిందని రాహుల్ చెప్పడం ఆయన సంస్కారానికి, నిజాయతీకి నిదర్శనమని పలువురు అంటున్నారు.
ఈ మాత్రం సంస్కారం మన నాయకుల నుంచి ఆశించడం అంటే అత్యాశే అవుతుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. వైఎస్సార్ మినహా ఏపీ నాయకుల్లో పాదయాత్రలు వారిలో మరింత అహంకారాన్ని పెంచాయనే అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి.