చంద్ర‌బాబుపై హ‌త్యాయ‌త్నం కేసు!

చిత్తూరు జిల్లాలో చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న పోలీసుల కేసుల వ‌ర‌కూ దారి తీసింది. ఇప్ప‌టికే పుంగ‌నూరు ఎపిసోడ్ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ, టీడీపీ మ‌ధ్య రాజ‌కీయ వేడిని ర‌గిల్చింది. పుంగ‌నూరులో విధ్వంసానికి కార‌ణ‌మైన టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌పై…

చిత్తూరు జిల్లాలో చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న పోలీసుల కేసుల వ‌ర‌కూ దారి తీసింది. ఇప్ప‌టికే పుంగ‌నూరు ఎపిసోడ్ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ, టీడీపీ మ‌ధ్య రాజ‌కీయ వేడిని ర‌గిల్చింది. పుంగ‌నూరులో విధ్వంసానికి కార‌ణ‌మైన టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌పై పెద్ద సంఖ్య‌లో కేసులు న‌మోద‌య్యాయి. ఇప్ప‌టికే ప‌లువురిని అరెస్ట్ చేశారు. మరి కొంద‌రి కోసం పోలీసులు వేట సాగిస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో తాజాగా తంబ‌ళ్ల‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం ముదివేడు పోలీస్‌స్టేష‌న్‌లో వైసీపీ నాయ‌కుడు ఉమాప‌తిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు చంద్ర‌బాబుతో పాటు ప‌లువురు ముఖ్య నాయ‌కుల‌పై కేసులు న‌మోదు కావ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

అన్న‌మ‌య్య జిల్లా తంబ‌ళ్ల‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం అంగ‌ళ్లులో జ‌రిగిన ఘ‌ట‌న‌కు సంబంధించి ఎ1గా చంద్ర‌బాబు, ఎ2గా మాజీ మంత్రి దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావు, ఎ3గా మాజీ మంత్రి అమ‌ర్నాథ్‌రెడ్డి, ఎ4గా పీలేరు టీడీపీ ఇన్‌చార్జ్ న‌ల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి, అలాగే తెలుగు యువ‌త రాష్ట్ర అధ్య‌క్షుడు శ్రీ‌రామ్ చిన్న‌బాబు, రాజంపేట పార్ల‌మెంట్ ఇన్‌చార్జ్ గంట న‌ర‌హ‌రి త‌దిత‌రుల‌పై కేసు న‌మోదు చేయ‌డంపై టీడీపీ తీవ్ర ఆగ్ర‌హం ప్ర‌ద‌ర్శిస్తోంది. వీరిపై హత్యాయ‌త్నం కేసు న‌మోదు కావ‌డం గ‌మ‌నార్హం.

మార‌ణాయుధాలతో తిరుగుతూ ప్ర‌జ‌ల‌కు భ‌య‌భ్రాంతుల‌కు గురి చేశార‌నే ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసిన‌ట్టు పోలీసులు తెలిపారు. ఇప్ప‌టికే పుంగ‌నూరు ఎపిసోడ్ అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీల మ‌ధ్య ఉద్రిక్త‌త‌ల‌ను పెంచుతోంది. త‌న‌తో పాటు టీడీపీ నేత‌ల‌పై హ‌త్యాయ‌త్నం కేసులు న‌మోదు చేయ‌డాన్ని చంద్ర‌బాబు త‌ప్పు ప‌ట్టారు. త‌న‌పై దాడి చేసేందుకు వైసీపీ కుట్ర‌లు ప‌న్నింద‌ని ఆయ‌న ఆరోపించారు. తిరిగి త‌మ‌పైన్నే కేసులు న‌మోదు చేయ‌డం ఏంట‌ని ఆయ‌న నిల‌దీశారు.