మోదీ సర్కార్‌పై అవిశ్వాస తీర్మాన చర్చలో భాగంగా కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్‌గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిజాయతీగా తనలోని అహంకారం గురించి ఆయన బయట పెట్టుకున్నారు. భారత్ జోడో యాత్ర పేరుతో ఆయన మొదట విడత పాదయాత్ర చేసిన సంగతి తెలిసిందే. ఆ యాత్ర తనలో తీసుకొచ్చిన మార్పు గురించి ఆయన అత్యున్నత చట్ట సభ వేదికగా పంచుకోవడం విశేషం.
మణిపూర్‌లో అమానవీయ ఘటనల గురించి ప్రస్తావిస్తూ కేంద్ర సర్కార్‌ను తీవ్రస్థాయిలో ఆయన విమర్శించారు. తన ప్రసంగానికి భయపడొద్దని ఆయన బీజేపీ ఎంపీలకు సూచించారు. భారత్ జోడో యాత్ర మొదలు పెడుతున్నప్పుడు చాలా మంది ఎందుకు చేస్తున్నావని ప్రశ్నించారని గుర్తు చేశారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర చేయడం వెనుక లక్ష్యం ఏంటని తన ప్రశ్నించారన్నారు. భారత దేశాన్ని అర్థం చేసుకునేందుకు, అలాగే ప్రజలను కలిసేందుకు పాదయాత్ర చేయాలని అనుకున్నాననే సమాధానం ఇచ్చానన్నారు. ఇంకా తన పాదయాత్ర పూర్తి కాలేదన్నారు. రానున్న రోజుల్లో కూడా పాదయాత్ర కొనసాగుతుందన్నారు.
భారత్ జోడో యాత్రకు ముందు తనలో అహంకారం వుండేదన్నారు. పాదయాత్ర చేస్తున్న క్రమంలో తనలోని అహంకారం పూర్తిగా పోయిందని ఆయన అన్నారు. తాను నమ్మిన సత్యం కోసం జైలుకు వెళ్లడానికి కూడా సిద్ధంగా ఉన్నట్టు రాహుల్ తెలిపారు. అదానీ అంశంపై తాను మాట్లాడనని, బీజేపీ ఎంపీలు భయపడాల్సిన అవసరం లేదని రాహుల్ చురకలు అంటించారు. ప్రసంగంలో ఒకటి, రెండు తూటాలు పేలుతాయని రాహుల్ అనడంతో బీజేపీ ఎంపీలు అడ్డుకున్నారు.
ఇవాళ తాను హృదయంతో మాట్లాడుతున్నానని భావోద్వేగాన్ని ఆయన పండించారు. అందువల్ల బీజేపీ ఎంపీలు భయపడాల్సిన అవసరం రాదని దెప్పి పొడిచారు. తన లోక్‌సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించినందుకు ముందుగా ధన్యవాదాలు తెలిపారు. రాహుల్ ప్రసంగానికి బీజేపీ ఎంపీలతో సహా స్పీకర్ కూడా అడ్డు తగులుతున్నారని విపక్ష ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే గందరగోళ పరిస్థితుల మధ్యే రాహుల్ ప్రసంగించారు. అయినప్పటికీ పదేపదే అడ్డు తగులుతుండడంతో ఆయన సభ నుంచి వెళ్లిపోయారు.