అమలాపురంలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇంటర్‌నెట్ బంద్ చేశారు. ఈ మేరకు పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి లోక్‌సభ నియోజకవర్గాన్ని జిల్లా కేంద్రం చేస్తానని హామీ ఇచ్చారు. హామీని నిలబెట్టుకునే క్రమంలో ముందడుగు వేశారు. ఈ నేపథ్యంలో కోనసీమ జిల్లాను ఏర్పాటు చేశారు.
ఇటీవల కోనసీమకు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు డిమాండ్ చేశాయి. ఇందుకోసం ర్యాలీలు, సమావేశాలు నిర్వహించాయి. ప్రజల ఆకాంక్షలను పరిగణలోకి తీసుకున్న జగన్ ప్రభుత్వం అందుకు తగ్గట్టుగానే అంబేద్కర్ కోనసీమ జిల్లాగా ప్రకటించింది. ఏవైనా అభ్యంతరాలంటే తెలియజేయాలని నెల రోజుల సమయాన్ని కూడా ఇచ్చింది.
అంబేద్కర్ పేరు పెట్టగానే, అంత వరకూ ఆయనపై ప్రేమ ఒలకబోసిన కొన్ని రాజకీయ పార్టీలు యూటర్న్ తీసుకున్నాయి. అంబేద్కర్ పేరు తొలగించాలంటే ఉద్యమానికి శ్రీకారం చుట్టాయి. అది కాస్త అమలాపురంలో తీవ్ర విధ్వంసానికి దారి తీసింది. ఈ నేపథ్యంలో అమలాపురంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు.
రకరకాల తప్పుడు ప్రచారానికి వేదికగా సోషల్ మీడియాను దుర్వినియోగం చేసుకుంటారనే ఆలోచనతో ప్రభుత్వం ముందస్తుగా ఇంటర్‌నెట్‌ను కట్ చేసింది. అన్ని రకాల కంపెనీల ఇంటర్‌నెట్ సేవల్ని నిలిపివేసేలా పోలీస్ అధికారులు చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం అమలాపురంలో ప్రశాంత వాతావరణం నెలకుంది. పరిస్థితి పూర్తి అదుపులోకి వచ్చేంత వరకూ ఇంటర్‌నెట్ సేవలు నిలిపేసే అవకాశాలున్నాయి.