ఆంధ్రప్రదేశులో రెండు పార్టీలు రెండు కులాల్ని పోలరైజ్ చేసుకుని ఉనికి చాటుకుంటున్నాయి. తెదేపా అంటే కమ్మవర్గం, జనసేన అంటే కాపువర్గం అని బ్రాండింగ్ పడిపోయింది. ఆయా పార్టీల్లో ఇతర కులస్థులున్నా ముఖచిత్రం మాత్రం అదే. అదే వైసీపీ విషయానికొస్తే దానిని రెడ్ల పార్టీ అన్నా కూడా, అటు మైనారిటీలు, దళితులు కూడా తమ పార్టీగా భావిస్తారు. ఇది అందరికీ తెలిసిన సత్యమే. అందుకే 2019లో వైసీపీ అంతటి ఘనవిజయం సాధించింది.
నిన్నటి వరకూ జనసేన కూడా దళితుల పక్షాన ఉన్నట్టుగా భ్రమింపజేయగలిగింది. కోనసీమకి అంబేద్కర్ పేరు పెట్టాలని జనసేన బ్యానర్స్ తో ఆ మధ్యన ర్యాలీలు కూడా చేసారు. కానీ ఈ రోజు జరిగిన సంఘటన అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది.
కోనసీమ ఒక్కసారిగా ఉద్రిక్త కాశ్మీర్ ని తలపించే విధంగా మారిపోయింది. రాళ్లు రువ్వుతున్న వేలాది మంది ఆందోళనకారులు, దగ్ధమౌతున్న మంత్రి ఇల్లు, మంటల్లో ఆహుతౌతున్న ఎమ్మెల్యే ఇల్లు, తగలబడుతున్న బస్సులు, తలలు పగిలిన 20 మందికి పైగా పోలీసు సిబ్బంది. అసలేమిటిదంతా? ఎందుకు జరుగుతోందో అర్థం కాని పరిస్థితి నెలకొంది.
కాస్త తేరుకుని పరిశీలించాక మీడియాకి కూడా అర్థమయిందేంటే కోనసీమ ప్రాంతంలోని శెట్టి బలిజలకి, కాపులకి తమ జిల్లాకి దళితుడైన అంబేద్కర్ పేరు పెట్టడం ఇష్టం లేదు. వీరిలో కొంతమంది జనసేన వర్గంలో ఉండొచ్చు లేకపోవచ్చు..కానీ కాపు వర్గం కాబట్టి జనసేనకి చెందిన వారే అని జనం అనుకుంటున్నారు.
వారంతా కలిసి వేలాదిమందిగా రోడ్లమీదకొచ్చి ఇంతటి విధ్వంసం చేసేసారు.
జపాన్ లో భూకంపం వచ్చినా జగన్ మోహన్ రెడ్డి హస్తముందని ఇల్యూజన్ వ్యాధితో బాధపడే పచ్చ చానల్స్ కొంతమందిని కూర్చోబెట్టి ఇదంతా వైసీపీ దర్శకత్వంలో జరుగుతోందని, సానుభూతి కోసం పోలీసులు తమ తలలు తామే కొట్టేసుకున్నారని, దళిత వ్యతిరేక వాతావరణం సృష్టించి దానిని తెదేపా మీదా తోసే కుట్రలో భాగమే ఇదంతా అని రెచ్చిపోయారు.
దానికి ప్రతిగా వైసీపీ వాళ్లు కూడా దీని వెనుక ఎప్పటిలాగే తెదేపా హస్తముందని తిరగబడ్డారు.
ఇప్పటి వరకు లభించిన సమాచారాన్ని బట్టి అసలీ గొడవంతా నాన్ పొలిటికల్. ఇది కులాల మధ్యలో చిచ్చు. ఆ చిచ్చుని పెద్దది చేసి అసాంఘికంగా మార్చిన వర్గం కాపు వర్గానికి చెందినవారు. దీనివల్ల అతి పెద్ద నష్టం జనసేనకే.
కాపులు చెసిన గొడవకాబట్టి ఇది జనసేన ప్రేరేపతం అనే భావన కలగడం సహజం. అంటే జనసేన దళిత వ్యతిరేక పార్టీ అనే సంకేతాలు సర్వత్రా వ్యాపించడం కూడా అంతే సహజం.
రాష్ట్రం మొత్తంలో జీవచ్ఛవంలా ఉన్న జనసేనకి కొద్దో గొప్పో చిటికిన వేలునైనా లేపగలిగే ఓపిక ఒక్క తూగో జిల్లాల్లోనే (కోనసీమ, రాజమండ్రి, కాకినాడ) ఉంది. ఆ వేలు మీద కూడా బండేసి బాదేసారు కోనసీమ కాపు ఉద్యమకారులు.
ఈ సంఘటనతో జనసేన పని పూర్తిగా అయిపోయింది. ఐసీయూలో ఉన్న పార్టీకి వెంటిలేటర్ తొలగించి పాడెక్కెంచేసారు ఆందోళనకారులు. ఇప్పుడీ పార్టీతో తెదేపా పొత్తంటే ఇంకది శవంతో సంసారంలాగానే ఉంటుంది. కాలం, ఖర్మం కలిసిరాకపోవడమంటే ఇదే.
హరగోపాల్ సూరపనేని