తెలంగాణలో ఈడీ సోదాలు కలకలం రేపుతున్నాయి. కేసు నమోదైన ఏడాదికో, రెండేళ్లకో ఈడీ, సీబీఐ సోదాలు చేస్తుండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు ఇంట్లో శుక్రవారం ఈడీ సోదాలు చేయడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
నామా నాగేశ్వరరావు గతంలో టీడీపీ హయాంలో ఎంపీగా ఉన్నాడు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో టీడీపీకి భవిష్యత్ లేదని గ్రహించి అధికార టీఆర్ఎస్‌లో చేరి అధినేత కేసీఆర్‌కు ఆప్తుడయ్యారు.
నామా నాగేశ్వరరావు రాజకీయ నాయకుడు కావడం కంటే ముందు ఆయన వ్యాపారవేత్త. ఆయనకు పలు కంపెనీలున్నాయి. ఇక ఈడీ సోదాల విషయానికి వస్తే… రాంచీ ఎక్స్‌ప్రెస్ వే లిమిటెడ్ ప్రాజెక్ట్‌లో నిధుల మళ్లింపుపై ఈడీ రంగంలోకి దిగింది. ఈ ప్రాజెక్ట్ కోసం మధుకాన్ కంపెనీ రూ.1100 కోట్లు లోన్ తీసుకుంది. ఇందులో రూ.264 కోట్లు పక్క దారి పట్టినట్టు అభియోగం.
నిధుల గోల్‌మాల్‌పై 2019లో నామాపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఆ తర్వాత ఏడాదికి అంటే 2020లో సీబీఐ చార్జీ షీట్ ఫైల్ చేసింది. ఈ కేసులో మధుకాన్ ఇన్ఫ్రా, మధుకాన్ ప్రాకెక్ట్, మధుకాన్ టోల్ వే, ఆడిటర్లను నిందితులుగా సీబీఐ చేర్చింది.
ఈ నేపథ్యంలో నామా ఇంటితో పాటు ఖమ్మం, హైదరాబాద్ కార్యాలయాల్లోనూ ఒకే సమయంలో ఈడీ సోదాలు చేపట్టింది. నామా నాగేశ్వరరావుతో పాటు రాంచి ఎక్స్‌ప్రెస్ వే సీఎండీ కె. శ్రీనివాసరావు, కంపెనీ డైరెక్టర్లు సీతయ్య, పృధ్వీ తేజల ఇళ్లలో ఈడీ సోదాలు నిర్వహిస్తుండడం గమనార్హం. ఈడీ అధికారులు మీడియాతో మాట్లాడితే పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.