బ్లాక్‌మెయిల్‌తో టీడీపీ, వైసీపీల లొంగుబాటు

బీజేపీకి మ‌ద్ద‌తుగా నిలుస్తున్న ఏపీ అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీలు వైసీపీ, టీడీపీల‌పై సీపీఐ జాతీయ కార్య‌ద‌ర్శి కె.నారాయ‌ణ ఘాటు ఆరోప‌ణ‌లు చేశారు. తిరుప‌తిలో ఆయ‌న సోమ‌వారం మీడియాతో మాట్లాడారు.  Advertisement ఏపీలో ఈ ఇంటి…

బీజేపీకి మ‌ద్ద‌తుగా నిలుస్తున్న ఏపీ అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీలు వైసీపీ, టీడీపీల‌పై సీపీఐ జాతీయ కార్య‌ద‌ర్శి కె.నారాయ‌ణ ఘాటు ఆరోప‌ణ‌లు చేశారు. తిరుప‌తిలో ఆయ‌న సోమ‌వారం మీడియాతో మాట్లాడారు. 

ఏపీలో ఈ ఇంటి మీద కాకి ఆ ఇంటి మీద వాల‌ని పార్టీలు రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో మాత్రం ఎన్డీఏ అభ్య‌ర్థి ద్రౌప‌ది ముర్మును బ‌ల‌ప‌రుస్తున్నార‌న్నారు. ఏపీకి కేంద్రం ఏమంత పొడిచేసింద‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. విభ‌జ‌న చ‌ట్టాల్లోనివి కూడా అమ‌లు చేయ‌ని ప‌రిస్థితిలో కేంద్రం వుంద‌న్నారు.

ఈ నేప‌థ్యంలో ఏపీకి కేంద్రం ఏం చేసింద‌ని వైసీపీ, టీడీపీలు రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో ఎన్‌డీఏ అభ్య‌ర్థి ద్రౌప‌ది ముర్ముకు మ‌ద్ద‌తు తెలిపాయ‌ని ప్ర‌శ్నించారు. ఏపీలో అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీలు రెండూ ఒకేలా వ్య‌వ‌హ‌రిస్తున్నాయ‌ని మండిప‌డ్డారు. రాజ‌కీయంగా ఎందుకు వ్య‌తిరేకించ‌లేద‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. బ్లాక్ మెయిల్‌కు పాల్ప‌డుతూ వైసీపీ, టీడీపీల‌ను బీజేపీ లొంగ‌దీసుకుందని తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. 

నిన్న‌గాక మొన్న మ‌హారాష్ట్ర‌లో శివ‌సేన ప్ర‌భుత్వాన్ని ప‌డ‌గొట్టింది బీజేపీ వాళ్లే అని విమ‌ర్శించారు. దుర్మార్గంగా త‌న ప్ర‌భుత్వాన్ని ప‌డ‌గొట్టిన‌ప్ప‌టికీ ఉద్ధ‌వ్‌ఠాక్రే చివ‌రికి బీజేపీ బ‌ల‌ప‌రిచిన అభ్య‌ర్థికే ఓట్లు వేస్తున్నార‌ని త‌ప్పు ప‌ట్టారు. కేంద్రంలో బీజేపీ ఎంత భ‌యంక‌రంగా వ్య‌వ‌హ‌రిస్తూ పార్టీల‌ను లొంగ‌దీసుకుంటుందో తాజా ఉదాహ‌ర‌ణ మ‌హారాష్ట్ర ఉదంత‌మే నిద‌ర్శ‌న‌మ‌న్నారు.

ప‌శ్చిమ‌బెంగాల్‌లో తృణ‌మూల్ కాంగ్రెస్‌ను ఇబ్బంది పెట్టిన గ‌వ‌ర్న‌ర్ జ‌గ‌దీప్ ధ‌న్క‌ర్‌ను ఉప‌రాష్ట్ర‌ప‌తి చేయ‌నున్నార‌ని మండి ప‌డ్డారు. అలాగే ఉప‌రాష్ట్ర‌ప‌తిగా ప‌ద‌వీ విర‌మ‌ణ చేయ‌నున్న వెంక‌య్య‌నాయుడిని ఆయ‌న విడిచిపెట్ట‌లేదు. గంగ‌మ్మ‌ను అలంకరించి ఊరి బయట వదిలేసిన మాదిరిగా ఆయ‌న్ను కూడా అలా చేస్తున్నార‌ని సంచ‌ల‌న కామెంట్ చేశారు.

స్వతంత్ర వ్యక్తిత్వం ఉన్న వెంకయ్య నోరు నొక్కే పని చేశారని బీజేపీపై నారాయ‌ణ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వైసీపీని గ‌ద్దె దించాల్సిందే అంటూ జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ చాలా ప‌వ‌ర్‌ఫుల్‌గా స్టేట్‌మెంట్స్ ఇస్తున్నార‌న్నారు. అంత వ‌ర‌కూ ఎవ‌రైనా ఆహ్వానించాల్సిందే అన్నారు. కానీ పవన్ కల్యాణ్ ఓ మందుపాత‌ర అని ఘాటు ఆరోప‌ణ చేశారు. అది ఎక్కడ పేలుతుందో, ఎవ‌రి మీద పేలుతుందో తెలిసి చావ‌డం లేద‌న్నారు. స‌క్ర‌మంగా పేలితే మంచిదే అని, లేక‌పోతే రాష్ట్రానికి న‌ష్ట‌మ‌న్నారు. ప‌వ‌న్‌క‌ల్యాణ్ న‌మ్మ‌కం లేకుండా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్నారు.

అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ వేదికపైకి అల్లూరి సీతారామరాజుగా నటించిన కృష్ణను, కాకుండా చిరంజీవిని ఎక్కించటం సరికాదని నారాయణ అన్నారు. వ‌ర్షాలు లేన‌ప్పుడు గోదావ‌రి, కృష్ణా జలాల విష‌య‌మై ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మ‌ధ్య వివాదాలు త‌లెత్తుతున్నాయ‌న్నారు. వ‌ర్షాలు ప‌డిన‌ప్పుడు మాత్రంఎలాంటి వివాదాలు వుండ‌వ‌న్నారు. మ‌న చేతుల్లో ఉండి కూడా ప‌రిష్క‌రించలేక పోతున్నామ‌న్నారు.