ఈ సందేహం సాధారణంగా తెలుగుదేశం పార్టీ నాయకులకు రావాలి, తమ్ముళ్ళకు రావాలి. కానీ టీడీపీ అనుకూల మీడియాకు మాత్రమే తరచూ వస్తోంది. ఆ మధ్యన విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిని ఇంటర్వ్యూ చేస్తున్నపుడు ఇదే ప్రశ్నను సదరు చానల్ అధినాయకుడు అడిగారు. దానికి ఆయన ఉన్నట్లే అనుకుంటున్నానని జవాబు ఇచ్చారు.
ఇపుడు చూస్తే విశాఖ జిల్లాకు చెందిన తెలుగు మహిళా ప్రెసిడెంట్ వంగలపూడి అనితను ఇంటర్వ్యూ చేస్తూ అదే చానల్ ఇదే ప్రశ్నను మరోమారు అడిగింది. ఇంతకీ గంటా శ్రీనివాసరావు మీ పార్టీలో ఉన్నట్లేనా అని. దానికి ఆమె జవాబు ఉన్నారనే అనుకుంటున్నాను అని.
ఆ మధ్య దాకా ఆయన పెద్దగా యాక్టివ్ గా లేరు కదా. ఇపుడిపుడే మళ్లీ కనిపిస్తున్నారు కదా అని కూడా ఆమెను ప్రశ్నించారు. ఇంతకీ గంటా విషయంలో ఎల్లో మీడియాకు అంతగా నమ్మకం లేదా అని అనుకుంటున్నారు. గంటా శ్రీనివాసరావు అయితే తాను టీడీపీలోనే ఉంటున్నట్లుగా సంకేతాలు ఇచ్చారు.
వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తుందని కూడా చెబుతున్నారు. అయితే ఆయన తరచుగా హైదరాబాద్ లోనే కనిపిస్తున్నారు. ఆయన ఇంకా స్పీడ్ పెంచలేదు అన్న మాట ఉంది. ఇక ఆయన వైసీపీ జనసేనలలో ఏదో దానిలోకి వెళ్తారని ఆ మధ్య దాకా ఊహాగానాలు వినిపించాయి. కానీ ఇపుడు అదేమీ లేదని అంటున్నారు.
అయినా గంటా టీడీపీలో ఉన్నట్లా లేనట్లా అన్న డౌట్లు టీడీపీ అధినాయకత్వం కంటే బలమైన మద్దతుగా నిలిచే ఎల్లో మీడియాకు రావడమే ఇక్కడ విశేషం. ఇలా తరచూ డౌట్లు పెట్టి మరీ ఆయన్ని చివరికి టీడీపీలో ఉంచుతారా లేదా అన్నదే ఆయన అనుచరులకు పట్టుకుంటున్న సందేహం అని అంటున్నారు.