రాష్ట్రపతి అభ్యర్థి నామినేషన్‌కు ఇచ్చిన ప్రాధాన్యం …ఉపరాష్ట్రపతి వరకూ వచ్చే సరికి అసలు కనిపించలేదు. ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక మొదలుకుని, ఇతరత్రా విషయాల్లో బీజేపీ ఎందుకని మిగిలిన పార్టీలను పెద్దగా కలుపుకొని పోనట్టే కనిపిస్తోంది. రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్మును ఎంపిక చేసే సమయంలో… వైసీపీ లాంటి ఎన్డీఏ కూటమిలో లేని ప్రాంతీయ పార్టీలతో సైతం చర్చించింది.
ఇదే ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపికకు వచ్చే సరికి అలాంటి చొరవ చూపలేదు. బీజేపీ పార్లమెంటరీ కమిటీ సమావేశమై పశ్చిమబెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్కర్ను ఎంపిక చేసింది. రైతు బిడ్డ అయిన జగదీప్ అభ్యర్థిత్వానికి మద్దతు పలకాలని మాత్రమే బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా కోరారు. ప్రత్యేకంగా ఏ ఒక్క పార్టీని మద్దతు కోరినట్టు వార్తలు రాలేదు. ఇవాళ ఉపరాష్ట్రపతి అభ్యర్థి జగదీప్ నామినేషన్ వేశారు.
ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్‌షా, రాజ్‌నాథ్‌సింగ్, నితిన్ గడ్కరీ తదితరులు హాజరయ్యారు. మిగిలిన పార్టీల నేతలున్నట్టు కనిపించలేదు. ఇదే ద్రౌపది ముర్ము నామినేషన్‌కు ఏపీ నుంచి వైసీపీ పార్లమెంట్ సభ్యులు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి హాజరయ్యారు.
తమిళనాడు నుంచి అన్నాడీఎంకే నేతలు కూడా వెళ్లారు. ఇవాళ ఉపరాష్ట్రపతి నామినేషన్‌కు మాత్రం బీజేపీ మినహా మిగిలిన నేతల పేర్లు తెరపైకి రాలేదు. బహుశా రాష్ట్రపతి ఎన్నికల కారణమా లేక అంతగా ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదని బీజేపీ భావించిందా? అనేది ఆ పార్టీ నేతలకే తెలియాలి.