జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మూడవ విడత వారాహి రధయాత్ర ఈ నెల 10 నుంచి విశాఖలో మొదలుకానుంది. ఈ నెల 19 వరకూ పది రోజుల పాటు ఈ యాత్ర సాగనుంది. తొలి సభను విశాఖ సిటీ నడిబొడ్డు అయిన జగదాంబ జంక్షన్లో ఏర్పాటు చేశారు. ఈ సభతో విశాఖలో పవన్ వారాహి ముందుకు కదలనుంది.
వారాహి యాత్రకు పోలీసులు షరతులతో కూడిన అనుమతులు మంజూరు చేశారు. కేవలం జగదాంబ జంక్షన్ లో మాత్రమే సభ జరుపుకోవాలని జనసేన నేతలకు సూచించారు. ర్యాలీలను పూర్తిగా నిషేధించారు. పవన్ వారాహి వాహనం చుట్టూ ఇతర వాహనాలు ర్యాలీగా వెళ్ళేందుకు అనుమతులకు నో చెప్పేసారు.
పవన్ సభ సందర్భంగా చుట్టు పక్కల భవనాలు ఇతర నిర్మాణాలలో ఉన్న వాటిని కార్యకర్తలు అభిమానులు ఎక్కి ప్రమాదాలు కొని తెచ్చుకోకుండా తగిన చర్యలు జనసేన నేతలే తీసుకోవాలని పోలీసులు స్పష్టం చేశారు. కండిషన్లు ఉల్లంగిస్తే మాత్రం అనుమతులు తీసుకున్న వారిదే బాధ్యత అని పోలీసులు స్పష్టం చేశారు.
జగదాంబ సెంటర్ లో రాజకీయ సభలు నిర్వహించడం చాలా ఆరుదు. అప్పట్లో ఎన్టీయార్ నిర్వహించేవారు. ఆ తరువాత చంద్రబాబు వంటి వారు కూడా పెద్దగా ఈ జంక్షన్ ని వాడుకోలేదు. జగన్ సైతం సిటీలో రద్దీగా ఉండే ఈ ప్రాంతాన్ని వదిలి వేరే చోటనే సభలు చేపట్టేవారు.
పవన్ కళ్యాణ్ కోసం జనసేన నాయకులు ఈ సెంటర్ ని ఎంచుకున్నారు. ప్రతీ రోజూ రద్దీగా ఉండే ఈ జంక్షన్ సాయంత్రం అయితే చాలు రష్ కి మారు పేరుగా ఉంటుంది. పవన్ కళ్యాణ్ సభ అంటే ఎలా ఉంటుందో చెప్పాల్సింది లేదు. జగదాంబ జంక్షన్ లో పవన్ తన సినిమా సుస్వాగతం షూటింగ్ జరుపుకున్నారు. ఇపుడు రాజకీయ నేతగా మారి అదే జంక్షన్ నుంచి సభ నిర్వహిచడం ఒక విశేషంగానే చూడాలని అంటున్నారు.