పోలవరం ప్రాజెక్ట్: ఏది నిజం..? ఎంత నిజం..?

పోలవరం ప్రాజెక్ట్ పై జరిగిన సమీక్షలో కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి పంకజ్ కుమార్ ఏపీ ప్రభుత్వానికి చీవాట్లు పెట్టారనేది ఆంధ్రజ్యోతి కథనం. సాక్షి మాత్రం పోలవరం ప్రాజెక్ట్ పనులపై ప్రభుత్వాన్ని, కాంట్రాక్ట్ కంపెనీ…

పోలవరం ప్రాజెక్ట్ పై జరిగిన సమీక్షలో కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి పంకజ్ కుమార్ ఏపీ ప్రభుత్వానికి చీవాట్లు పెట్టారనేది ఆంధ్రజ్యోతి కథనం. సాక్షి మాత్రం పోలవరం ప్రాజెక్ట్ పనులపై ప్రభుత్వాన్ని, కాంట్రాక్ట్ కంపెనీ పనితీరుని కేంద్రం ప్రశంసించిందని చెప్పుకొచ్చింది. 

ఇక ఈనాడు మధ్యేమార్గంగా పనుల వేగం పెంచాలని కేంద్రం సూచించిందని, నిధులివ్వాలంటూ రాష్ట్రం పట్టుబట్టిందని రాసుకొచ్చింది. సీఎం జగన్ ఢిల్లీ పర్యటనలో ఉన్న సందర్భంలో అధికారులు జరిపిన ఈ సమీక్ష ఆసక్తికరంగా మారింది.

ఇంతకీ కేంద్రం రాష్ట్రానికి చీవాట్లు పెట్టిందా..? ప్రశంసించిందా..?

పోలవరం ప్రాజెక్ట్ లో కాంట్రాక్ట్ వర్క్ మొత్తం 76.29శాతం పూర్తయింది. పునరావాసానికి సంబంధించి భూసేకరణ, నిర్వాసితుల తరలింపు పనులు 20.19శాతం మాత్రమే పూర్తయ్యాయి. వెరసి ప్రాజెక్ట్ మొత్తం పనులు 41.10 శాతం పూర్తయ్యాయని తెలిపారు ఏపీ అధికారులు. అయితే పచ్చపాత మీడియా మాత్రం పోలవరం పునరావాస పనుల్నే హైలెట్ చేస్తూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించింది. 20.19శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయని, కేంద్రం అసంతృప్తి వ్యక్తం చేసినట్టు చెప్పుకొచ్చారు.

వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుగా ప్రాజెక్ట్ నిర్మాణంపై దృష్టిపెట్టింది. వర్షాకాలం వచ్చేలోపే పనులు పూర్తి చేయాలని ఆలోచించింది. అటు పునరావాసం విషయంలో కేంద్రం ఇచ్చిన ప్యాకేజీ ఇంకా పూర్తి స్థాయిలో రాష్ట్రానికి అందలేదు. సవరించిన అంచనాలకు ఆమోద ముద్ర వేస్తేనే పనులు ముందుకు జరుగుతాయి. జులైలోగా నిర్వాసితుల కాలనీలు పూర్తి చేసి గృహప్రవేశాలు చేయించాలని కృతనిశ్చయంతో ఉంది రాష్ట్ర ప్రభుత్వం. మరి కేంద్ర సహకారం లేకుండా ఈ పనులెలా ముందుకు సాగుతాయి. పదే పదే కొర్రీలతో వెనకకు లాగుతుంటే పోలవరం ముందుకెళా వెళ్తుంది.

ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన 1300కోట్ల రూపాయలు ఇప్పించాలని, డీపీఆర్2 పెట్టుబడులకు అనుమతులివ్వాలని రాష్ట్ర అధికారులు కేంద్రానికి విన్నవించారు. అదే సమయంలో కేంద్రం మాత్రం పనుల వేగాన్ని పెంచాలని సూచించింది. సవరణ అంచనాలకు ఆమోదం రావాలంటే కేంద్ర మంత్రి మండలి ఆమోదం ఉండాలని స్పష్టం చేశారు జలశక్తి శాఖ అధికారులు. ఈ నేపథ్యంలో చర్చల్లో పురోగతి ఎంతనేది ఇప్పుడు తేలాల్సి ఉంది. పోలవరం ఆలస్యం అయితే దానికి రాష్ట్ర ప్రభుత్వానిది ఏమాత్రం బాధ్యత కాదని, కేంద్రం ఆలస్యంగా తీసుకుంటున్న నిర్ణయాలేనని మరోసారి స్పష్టమైంది.

ఇలాంటి టైమ్ లో చంద్రబాబు, అతడి అనుచరగణం, అనుచర మీడియా చేస్తున్న విమర్శల్లో, విశ్లేషణల్లో ఏమాత్రం లాజిక్ లేదు. చంద్రబాబు హయాంలో పోలవరం పనులు ఎంత మేర జరిగాయి, జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత మేరకు పూర్తయ్యాయనే విషయాల్ని ఇప్పటికే ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా వెల్లడించింది. కేంద్ర జలవనరుల శాఖ కూడా దాదాపు ఇదే విషయాన్ని గతంలో స్పష్టంచేసింది.

అయినప్పటికీ బాబు మీడియా పోలవరం ప్రాజెక్టు పురోగతిని పట్టించుకోకుండా.. పునరావస పనులు ఏ మేరకు జరిగాయనే అంశాన్ని హైలెట్ చేస్తూ కథనాలు వండివారుస్తోంది. పోనీ.. ఈ కోణంలో చూసుకున్నా బాబు హయాం కంటే జగన్ పాలనలో పునరావాసం ప్యాకేజీ అమలు భేషుగ్గా జరుగుతోంది. ఈ విషయాన్ని మాత్రం వాళ్లు ఒప్పుకోరు. 

పచ్చ మీడియా చెబుతున్నట్టు ప్రభుత్వాన్ని కేంద్రం ప్రశంసించలేదనే అనుకుందాం. కానీ చీవాట్లు పెట్టడానికి ఆస్కారం ఎక్కడుంది. ఈ విషయాన్ని ఎల్లో మీడియా దృష్టిలో పెట్టుకుంటే మంచిది.