ఇప్పుడు దేశ వ్యాప్తంగా అత్యంత చర్చనీయాంశమైన కేసు ఏదైనా ఉందా? అంటే అది రాజద్రోహమే. దేశ వ్యాప్తంగా పది వేల రాజద్రోహం కేసులు నమోదయ్యాయని ఓ అంచనా.
ఇందులో బీజేపీ పాలిత రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం నమోదు చేసినవి భారీ సంఖ్యలో ఉన్నాయి. రాజద్రోహం కేసుల సంగతి తేల్చేస్తామని ఇటీవల సర్వోన్నత న్యాయస్థానం కూడా స్పష్టం చేసింది.
ఈ నేపథ్యంలో ఓ ప్రముఖ సినీ నటిపై రాజద్రోహం కేసు నమోదు కావడం చర్చనీయాంశంగా మారింది. కేంద్ర పాలిత ప్రాంతమైన లక్షద్వీప్నకు చెందిన చిత్ర నిర్మాత, దర్శకురాలు, మోడల్, నటి అయిన ఆయిషా సుల్తానాపై లక్షద్వీప్ పోలీసులు రాజద్రోహం కేసు నమోదు చేశారు.
లక్షద్వీప్ బీజేపీ అధ్యక్షుడు సి అబ్దుల్ ఖదీర్ హాజి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అయిషా సుల్తానాపై పోలీసులు కేసు పెట్టడం విశేషం. ఇటీవల ఒక మళయాళం టీవీ చానల్ చర్చలో ఆయిషా సుల్తానా మాట్లాడుతూ లక్షద్వీప్ కొత్త లెఫ్టెనెంట్ గవర్నర్ ప్రఫుల్ పటేల్ కేంద్ర ప్రభుత్వం పంపించిన జీవా యుధంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఆయన రాక ముందు తమ దీవిలో ఒక్క కరోనా కేసు కూడా లేదన్నారు. ఇపుడు రోజూ వంద కరోనా కేసులు బయటపడ్డాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రఫుల్ పటేల్ తీసుకుంటున్న నిర్ణయాలను ఆమె ఖండించారు. ఇదే ఆయిషాపై రాజద్రోహం కేసుకు కారణమైంది.