పిచ్చ కామెడీ.. టీడీపీలో ఆ ఎమ్మెల్యే?

తెంలగాణ టీడీపీలో ఎల్.రమణ వ్యవహారంలో మరో ఆసక్తికర చర్చను తీసుకొస్తున్నారు టీడీపీ నేతలు. చంద్రబాబే రమణను పక్కన పెట్టే ఏర్పాట్లు చేస్తున్నారని, ఈమధ్య కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క టీడీపీలో చేరేందుకు సుముఖంగా ఉన్నారని, ఆమెను…

తెంలగాణ టీడీపీలో ఎల్.రమణ వ్యవహారంలో మరో ఆసక్తికర చర్చను తీసుకొస్తున్నారు టీడీపీ నేతలు. చంద్రబాబే రమణను పక్కన పెట్టే ఏర్పాట్లు చేస్తున్నారని, ఈమధ్య కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క టీడీపీలో చేరేందుకు సుముఖంగా ఉన్నారని, ఆమెను తెలంగాణ టీడీపీకి అధ్యక్షురాలిగా చేసి రాజకీయం నడిపిస్తారని ఓ పుకారు షికారు చేస్తోంది. కొన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానెళ్లు కూడా దీన్ని హైలెట్ చేస్తున్నాయి.

ఎల్.రమణ అయినా.. ఇంకో నేత అయినా తెలంగాణలో టీడీపీకి జాకీలు వేయడం కష్టం. కనీసం చంద్రబాబుకి కూడా తెలంగాణ పార్టీపై దింపుడు కళ్లెం ఆశలు లేవు. అయినా కూడా ఏదో నామ్ కే వాస్తే పార్టీని నడిపిస్తున్నారు. తనని తాను టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా ప్రకటించుకునేందుకు పక్క రాష్ట్రంలో పార్టీ బతికుండేలా తాపత్రయ పడుతున్నారు. 

తెలంగాణలో టీడీపీ కోసం కష్టపడితే కనీసం నామినేటెడ్ పదవి కూడా దక్కదనే విషయం అందరికీ తెలుసు. అందుకే ఆ పార్టీ క్రేజ్ ని ఉపయోగించుకున్నంత కాలం ఉపయోగించుకుని సైకిల్ గుర్తుపై గెలిచి అందరూ పక్కకెళ్లిపోయారు. రాగాపోగా రమణ లాంటి బీసీ నేతలు ఇంకా నమ్మకంగా టీడీపీలోనే ఉన్నారు. ఇప్పుడు ఆయనకు కూడా టైమ్ వచ్చింది. టీఆర్ఎస్ ఎగరేసుకు పోతోంది.

అయితే దీన్ని టీడీపీ పరాభవంగా కాక, వ్యూహంగా చెప్పుకునేందుకు ఇష్టపడుతున్నారు ఆ పార్టీ నేతలు. ఇటీవల జరిగిన మహానాడులో రమణపై ఆరోపణలు వచ్చాయని, అందుకే తెలంగాణలో టీడీపీ కొత్త నాయకత్వం కోసం వెదుకుతోందని చెప్పుకొస్తున్నారు. 

ఈమధ్య తన తల్లి చికిత్స కోసం ఆస్పత్రికి వచ్చిన ఎమ్మెల్యే సీతక్కను చంద్రబాబు పరామర్శించిన ఫొటో దీనికి జతచేసి ఇదే నిజం అని భ్రమించేలా కట్టుకథలల్లుతున్నారు. సీతక్కను చంద్రబాబు పార్టీలో చేర్చుకుని ఆమెకు తెలంగాణ అధ్యక్ష పదవి ఇస్తారని, అక్కడ పార్టీకి జవసత్వాలు కూడగడతారని ఆ కథనం సారాంశం.

అసలు బుద్దున్న ఏ నాయకుడు టీడీపీలో చేరడు, అందులోనూ దాదాపుగా మునిగిపోయిన నావలా ఉన్న తెలంగాణ టీడీపీలో చేరరు గాక చేరరు. పైగా సీతక్క ఎమ్మెల్యే కూడా. టీడీపీలో చేరి సైకిల్ గుర్తుపై పోటీ చేస్తే ఆమె వచ్చే దఫా గెలుస్తారనే గ్యారెంటీ కూడా లేదు. మరి సీతక్క కాంగ్రెస్ ని వదిలి టీడీపీలో ఎందుకు చేరతారు. ఈ ప్రచారం పూర్తి కామెడీ వ్యవహారంలా మారిపోయింది.

ప్రధాన ప్రతిపక్ష హోదా ఉన్న ఏపీలోనే ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా చేజారిపోతున్నారు. వైసీపీ కండువా కప్పుకునే అవకాశం లేకపోయినా.. వారి మద్దతుదారులుగా ఉండేందుకు సైతం ఇష్టపడుతున్నారు. అలాంటి పార్టీలోకి కొత్తగా ఓ ఎమ్మెల్యే వస్తున్నారంటే కామెడీ కాక ఇంకేంటి..?