ఎన్టీఆర్ ను పదవీచ్యుతుడ్ని చేసే ప్రక్రియ నుంచి ఈరోజు వరకు ఎక్కడా చంద్రబాబుకు అడ్డు తగల్లేదు బాలకృష్ణ. ఆయన వెన్నంటే ఉన్నారు. బాబు కూర్చోమంటే కూర్చున్నారు, నిలబడమంటే నిల్చున్నారు. అలా బాలయ్యను తన చుట్టూ తిప్పుకుంటున్నారు చంద్రబాబు. ఇది బహిరంగ రహస్యం. దీనిపై చర్చ కూడా అనవసరం.
అయితే ఈసారి మాత్రం బాలయ్య రివర్స్ అయ్యారు. తనను తాను రగులుతున్న అగ్నిపర్వతంతో పోల్చుకున్నారు. అది ఎప్పటికైనా బద్దలవుతుందంటూ చంద్రబాబుకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ఈ హెచ్చరికలన్నీ దేనికోసమో తెలుసా..? టీడీపీ పగ్గాల కోసం.
“తెలుగుదేశం పార్టీ పగ్గాలు చేపట్టడానికి వంద శాతం అర్హుడ్ని నేను. కానీ నేను అడగను, ఇప్పటివరకు అడగలేదు. ఇంకా టైమ్ ఉంది మనకి. ప్రస్తుతానికి వెయిటింగ్ లో ఉన్నాను. వేచిచూడ్డం అనేది రకరకాలుగా మలుపులు తీసుకుంటుంది. బహుశా నా వేచి చూడడం అనే ధోరణి ఒక్కసారిగా సముద్రంలో ఉన్న అగ్నిపర్వతంలా విస్పోటనం అవుతుందేమో.”
ఇలా టీడీపీ అధ్యక్ష పదవిపై తనదైన స్టయిల్ లో స్పందించారు బాలయ్య. మరోవైపు అల్లుడు లోకేష్ పోటీకొస్తే మాత్రం తను తప్పుకుంటానన్నట్టు మాట్లాడారు. తనకు బాధ్యతలు అప్పగించాలా లేక లోకేష్ కు పగ్గాలివ్వాలా అనే విషయానికొస్తే.. లోకేష్ కే ఎడ్జ్ ఎక్కువగా ఉందన్నారు. లోకేష్ అల్లాటప్పా వ్యక్తి కాదంటున్నారు బాలయ్య.
పార్టీ పగ్గాలు బాలయ్యకు అప్పగించినా, లోకేష్ కు ఇచ్చినా పార్టీ దుంపనాశనం అనే విషయం ప్రజలతో పాటు చంద్రబాబుకు కూడా తెలుసు. కానీ ఏం చేయలేని పరిస్థితి? ఈ గ్యాప్ లో బాలయ్య ఇలా మండే అగ్నిగోళం, రగిలే అగ్నిపర్వతం అంటూ డైలాగ్స్ చెబుతుంటారంతే.