ఏదైనా జరిగినప్పుడే ఎవరి తెలివి తేటలు ఏంటో బయటపడతాయి. నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు, సస్పెండైన జడ్జి రామకృష్ణ ఇద్దరిపై రాజద్రోహం నేరం కింద కేసు నమోదైంది. రామకృష్ణ కంటే రఘురామను ఆలస్యంగా అరెస్ట్ చేశారు. కానీ వేగంగా ఆయన బెయిల్ తెచ్చుకోగలిగారు. ఇదే రామకృష్ణ మాత్రం ఇంకా జైల్లోనే మగ్గాల్సి వస్తోంది. నిన్న బెయిల్ విచారణ సందర్భంగా న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో రామకృష్ణ బెయిల్‌పై ఎవరికి వారు ఓ అంచనాకు రావచ్చు.
కానీ రామకృష్ణతో పోల్చుకుంటే రఘురామకృష్ణంరాజు ఎంత లౌక్యుడో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. లౌక్యుడు ఆదర్శవాదని అంటారు. రామకృష్ణ, రఘురామకృష్ణం రాజు ఇద్దరి వెనుక ఎల్లో బ్యాచ్ ఉందని బలంగా ప్రచారం జరుగుతోంది. ఇద్దరికీ ఎన్టీఆర్ భవన్ లేదా ఎల్లో మీడియా కార్యాలయాల నుంచి స్క్రీప్ట్‌లు అందుతాయనే వాదన లేకపోలేదు. అయితే స్క్రిప్ట్‌లు చదవడంలో రఘురామకృష్ణంరాజు వ్యక్తిగతంగా జాగ్రత్తలు తీసుకున్నట్టుగా అర్థమవుతోంది.
ఇదే రామకృష్ణ విషయానికి వస్తే …ఏ మాత్రం ముందూవెనుకా ఆలోచించకుండా వారు పంపిన స్క్రిప్ట్‌ను యథాతధంగా చదివి అనవసరంగా చిక్కుల్లో ఇరుక్కున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఓ ఎల్లో చానల్ వేదికగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తల ఎగిరేసి నరుకుతాననే తీవ్ర వ్యాఖ్యలు ఆయన్ను జైలుపాలు చేశాయి.
ఏప్రిల్ 15న రాజద్రోహం నేరం కింద రామకృష్ణను పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిగింది. ఈ సందర్భంగా బెయిల్‌పై బయటికొస్తే పిటిషనర్‌కే ముప్పు వాటిల్లే అవకాశం ఉంది కదా అని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం.గంగారావు ప్రశ్నించడం గమనార్హం. పిటిషనర్ ఇదే విధంగా వ్యవహరిస్తే శాంతిభద్రతల సమస్య తలెత్తదా అని కూడా జడ్జి పిటిషనర్ తరపు న్యాయవాదిని ప్రశ్నించారు.
దీన్నిబట్టి రామకృష్ణ ఎంత అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ఆయన చుట్టూ ఉన్న వాళ్లపై రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యలు అవాంఛనీయమైనవే అయినప్పటికీ, రామకృష్ణతో పోల్చుకుంటే తీవ్రతలో ఎక్కువ తక్కువలు ఉన్నాయి. ఇదే బెయిల్ ఇవ్వడానికి కూడా హైకోర్టు ఆలోచిస్తున్నట్టు కనిపిస్తోంది. ఎవరి మెప్పుకోసమో రామకృష్ణ ముప్పు తెచ్చుకున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అందుకే ఎవరెన్ని చెప్పినా వినడంలో తప్పు లేదు. మంచీచెడుల విచక్షణ ఉండాలి. ఆ కోణంలో రామకృష్ణ ఆలోచించి మాట్లాడి ఉంటే ఈ రోజు ఇలాంటి కష్టాలు వచ్చేవి కాదు. పిటిషనర్ ఇదే విధంగా వ్యవహరిస్తే శాంతిభద్రతల సమస్య తలెత్తదా అని హైకోర్టు జడ్జి ప్రశ్నించగా … ఇదే రఘురామ విషయంలో మాత్రం ఆయన ఆరోగ్యాన్ని పరిగణలోకి తీసుకుని మానవీయ కోణంలో బెయిల్ ఇస్తున్నట్టు సుప్రీంకోర్టు పేర్కొనడం గమనార్హం. ఇదే రామకృష్ణ, రఘురామకృష్ణంరాజు మధ్య విచక్షణలో తేడా. అందుకే తెలివి ఒకరబ్బని సొత్తు కాదని పెద్దలు ఊరికే చెప్పలేదు.