హైద‌రాబాద్ ప‌రిశోధ‌న భ‌లేభ‌లే

మాటే మంత్ర‌మంటారు. కొంద‌రి ఓదార్పు మాట‌లు రోగికి ఎంతో ఊర‌ట‌నిస్తాయి. జ‌బ్బును న‌యం చేయ‌డానికి మందు కంటే మాట‌లే బాగా ప‌ని చేస్తాయి. ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రోఎంటరాలజీ(ఏఐజీ)’ వైద్య నిపుణులు డాక్టర్‌ డి.నాగేశ్వరరెడ్డి…

మాటే మంత్ర‌మంటారు. కొంద‌రి ఓదార్పు మాట‌లు రోగికి ఎంతో ఊర‌ట‌నిస్తాయి. జ‌బ్బును న‌యం చేయ‌డానికి మందు కంటే మాట‌లే బాగా ప‌ని చేస్తాయి. ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రోఎంటరాలజీ(ఏఐజీ)’ వైద్య నిపుణులు డాక్టర్‌ డి.నాగేశ్వరరెడ్డి గ‌త కొంత కాలంగా క‌రోనా వైద్యానికి చేస్తున్న సూచ‌న‌లు ఎంతో భ‌రోసా ఇస్తున్నాయి. ఎప్ప‌టిక‌ప్పుడు ఆయ‌న వెల్ల‌డిస్తున్న విషయాలు క‌రోనా బాధితుల‌కు ఓ మంత్రంలా ప‌నిచేస్తున్నాయి. మే ఆఖ‌రుకు క‌రోనా త‌గ్గుముఖం ప‌డుతుంద‌ని ఆయ‌న శాస్త్రీయంగా వెల్ల‌డించారు.

దీంతో మ‌రో వారం ప‌ది రోజులు జాగ్ర‌త్త‌గా ఉంటే చాలు, క‌రోనా గండం నుంచి గ‌ట్టెక్క వ‌చ్చ‌ని ప్ర‌జ‌లు మాన‌సికంగా సంసిద్ధులయ్యారు. అందుకు త‌గ్గ‌ట్టు ఎవ‌రికి వారు త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో కోవిడ్ త‌గ్గిన వారికి ఒక్క‌డోసు చాలు అని చెప్ప‌డం ద్వారా ఆయ‌న మ‌రింత బ‌లాన్ని ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు. ఒక్క డోసు సంగ‌తేమో గానీ, ఆయ‌న నుంచి వ‌చ్చే ఒక్కో మాట కోవిడ్‌ను పార‌దోల‌డానికి ఉప‌యోగ‌డ‌ప‌తుంద‌ని చెప్ప‌డంలో అతిశ‌యోక్తి లేదు.

కొవిడ్‌ బారిన పడి తగ్గిన వారికి ఒక్క టీకా డోసే మంచి ఫలితమిస్తోంద‌ని, వైరస్‌ బారినపడిన నెల రోజుల తర్వాత ఒక డోసు పొంద డం ద్వారా వీరిలో గణనీయంగా యాంటీబాడీలు వృద్ధి చెందినట్లుగా వైద్య నిపుణులు గుర్తించారు. యాంటీబాడీలు మూడింతలు అధికంగా ఉన్నట్టు తేల్చారు. అదే వైరస్‌ బారినపడని వ్యక్తుల్లో ఒక డోసు పొందిన తర్వాత యాంటీబాడీల వృద్ధి సాధారణంగా ఉన్న‌ట్టు గుర్తించారు. 

ఈ కీల‌క ప‌రిణామాల‌పై హైదరాబాద్‌లోని ‘ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రోఎంటరాలజీ(ఏఐజీ)’ వైద్య నిపుణులు డాక్టర్‌ డి.నాగేశ్వరరెడ్డి, డాక్టర్‌ ఎం.శశికళ, డాక్టర్‌ జే.శశిధర్‌, డాక్టర్‌ జి.దీపిక, డాక్టర్‌ వి. రవికాంత్‌, డాక్టర్‌ వి.వెంకట కృష్ణ, డాక్టర్‌ వై.సాధన, డాక్టర్‌ కె.ప్రగతి సంయుక్తంగా పరిశోధన నిర్వహించారు.

ఈ పరిశోధన పత్రం ‘ఇంటర్నేషనల్‌ జర్నల్‌ ఆఫ్‌ ఇన్‌ఫెక్షియస్‌ డిసీజెస్‌’లో అనే ప్ర‌సిద్ధ వైద్య ప‌త్రిక‌లో ప్రచురితమైంది. వ్యాక్సిన్‌కు సంబంధించి పలు సందేహాలకు ఈ అధ్యయనంలో వైద్య నిపుణులు సమాధానమిచ్చారు. త‌మ ప‌రిశోధ‌న‌లో క‌రోనా బారిన ప‌డ్డ‌వారిని, సాధార‌ణ ప్ర‌జ‌ల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్నారు. వారికి వివిధ వ‌య‌సుల వారీగా ఒక డోసు టీకాను ఇచ్చి అధ్య‌య‌నం చేశారు.

క‌రోనా బారిన ప‌డి కోలుకున్న వారిలో, సాధార‌ణ వ్య‌క్తుల్లో కంటే యాంటీబాడీలు బాగా వృద్ధి చెంద‌డాన్ని గుర్తించారు. కొవిడ్‌ యాంటీబాడీలు వృద్ధి చెందాయా? లేదా అనేది తెలుసుకోవడానికి ‘న్యూట్రలైజింగ్‌ యాంటీబాడీస్‌ ఎస్‌1 ఎస్‌2’ అనే పరీక్ష చేస్తారు. ఫలితాల్లో యాంటీబాడీల వాల్యూ 150 దాటితే రక్షణగా ఉంటుందని అర్థమ‌ని వైద్య నిపుణులు తెలిపారు. కొవిడ్‌ సోకకుండా ఒక డోసు టీకా పొందిన వారిలో వాల్యూ సుమారు 150 వరకూ పెరిగింది. అదే వైరస్‌ సోకి తగ్గాక వ్యాక్సిన్‌ తీసుకుంటే 450 కంటే ఎక్కువగా ఉన్నట్లు నిపుణులు గుర్తించారు.  

ఈ సంద‌ర్భంగా డాక్ట‌ర్ నాగేశ్వ‌ర‌రెడ్డి కీల‌క వివ‌రాలు వెల్ల‌డించారు. క‌రోనా సోకిన వారెవ‌రైనా నెల రోజుల త‌ర్వాత టీకా తీసుకోవచ్చన్నారు. అలాంటి వారికి ఒక్క డోసుతోనే యాంటీబాడీలు బాగా వృద్ధి చెందుతాయ‌న్నారు. రెండోది అవసరం లేదని చెప్ప‌డం విశేషం. ప్రభుత్వానికి టీకాలపై ఖర్చు కూడా తగ్గుతుంద‌న్నారు. ఇలాంటి వారికి ఏడాది పాటు రక్షణ ఉంటుందనే అంచ నాల నేపథ్యంలో బూస్టర్‌ డోసును ఏడాది తర్వాత ఇవ్వొచ్చ‌న్నారు.

ఈ అధ్యయన అంశాలను భారతీయ వైద్య పరిశోధన మండలికి(ఐసీఎంఆర్‌కు) కూడా పంపించిన‌ట్టు ఆయ‌న తెలిపారు. డాక్ట‌ర్ నాగేశ్వ‌ర‌రెడ్డి తాజాగా వెల్ల‌డించిన ప‌రిశోధ‌న వివ‌రాల‌ను కేంద్ర ప్ర‌భుత్వం ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని కేంద్ర ప్ర‌భుత్వం వ్యాక్సినేష‌న్‌పై మ‌రింత స‌మ‌ర్థ‌వంతంగా ముందుకెళ్లొచ్చ‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.