కులాన్ని దేబిరిస్తున్న ఈ విశ్వమానవుడు!

పవన్ కల్యాణ్ తనను తాను కాపు, బలిజ కులం ప్రతినిధిగా రాజకీయాల్లో ఆవిష్కరించుకోవడానికి, కాపు నేతగా దక్కగల కుల ఆదరణతో రాజకీయ సోపానాలు అధిరోహించడానికి అంతిమంగా డిసైడ్ అయ్యారు. కాపు కులం ఓట్లు గంపగుత్తగా…

పవన్ కల్యాణ్ తనను తాను కాపు, బలిజ కులం ప్రతినిధిగా రాజకీయాల్లో ఆవిష్కరించుకోవడానికి, కాపు నేతగా దక్కగల కుల ఆదరణతో రాజకీయ సోపానాలు అధిరోహించడానికి అంతిమంగా డిసైడ్ అయ్యారు. కాపు కులం ఓట్లు గంపగుత్తగా తన పార్టీకి కావాలని ఆయన అభిలషిస్తున్నారు. కాపు సామాజిక వర్గంలో ఉపకులాలతో సహా కలుపుకుంటే.. రాష్ట్రంలో బలమైన సామాజిక వర్గాల్లో  ఒకటనే సంగతి అందరికీ తెలిసిందే. ఆ కాపు కులం ఓట్లను నేరుగా అభ్యర్థించడానికి ఉండే మొహమాటాన్ని పవన్ కల్యాణ్ అధిగమించారు.. ‘‘కాపులారా.. నేను మీ వాడిని.. మీరందరూ నాకు ఓటు వేసి.. నన్ను కాపు కుల ప్రతినిధిగా ముఖ్యమంత్రిని చేయండి’’ అనే మాటలు ఆయన తన నోటితో చెప్పలేదు గానీ.. ఇంచుమించు ఆ మేరకు సంకేతాలు ఇచ్చారు. 

భీమవరం లో గతంలో ఎమ్మెల్యేగా పోటీచేసిన పవన్ కల్యాణ్ అప్పట్లో కూడా తన కులబలాన్ని నమ్ముకునే అక్కడ బరిలోకి దిగిన సంగతి అందరికీ తెలిసిందే. కులబలం దండిగానే ఉన్నప్పటికీ.. ఆయనను పెద్దగా పట్టించుకోకపోవడం వల్ల ఎమ్మెల్యేగా కూడా ఓడిపోయారు. అతే భీమవరంలో తాజాగా జనవాణి కార్యక్రమం నిర్వహించిన పవన్ కల్యాణ్.. కులం ప్రస్తావన తెచ్చి.. కులం ఓట్లు చాలా అవసరం అంటూ దేబిరించడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

ఆయన భీమవరంలో ఏమన్నారంటే.. ‘‘ఆంధ్రా భావం ఎలాగూలేదు. కనీసం కులభావంతో పనిచేయండి. ఓట్ల కోసం కులం కావాలి. గెలిచిన తర్వాత కులం అవసరం లేదు. ఈ మాటలు ఎంతో బాధతో చెబుతున్నా’’ అని అన్నారు. ఇదంతా కాపులు తనను గెలిపించాలని కోరడమే. 

ఇవాళ్టి రాజకీయాల్లో.. కులబలంతో నెగ్గాలని అనుకోవడం తప్పుకింద పరిగణించే వారు ఎవ్వరూ లేరు. ఎవ్వరైనా సరే కులాన్ని కూడగట్టుకోవాలనే అనుకుంటున్నారు. రాష్ట్రంలో రెండు ప్రధానమైన రెడ్డి, కమ్మ కులాలు.. అటు వైఎస్సార్ కాంగ్రెస్, ఇటు తెలుగుదేశం పార్టీలను తమవిగా చేసుకున్నట్టే వ్యవహరిస్తుంటాయి. తమ కాపు కులం కూడా పెద్దదే గనుక.. ఆ కులం ప్రతినిధిగా తాను కూడా సీఎం అయిపోవాలని పవన్ కల్యాణ్ కోరిక. కానీ పార్టీ రూపంలో కులాల గురించి తాను ప్రవచించే సిద్ధాంతాలు ఆదర్శాలు రంగరించినట్లుగా ఉంటాయి గనుక.. కులం పేరుతో ఓట్లు అడగాలంటే ఆయన మొన్నటిదాకా మొహమాటపడ్డారు. ఇప్పుడా మొహమాటం పక్కన పెట్టినట్టుంది.

పవన్ కల్యాణ్ ను కాపుకుల నాయకుడిగా ఎవరైనా అభివర్ణిస్తే.. ఆయన రెచ్చిపోతారు. అన్ని కులాల ఓట్లు కావాలని కోరుకోవడం రాజకీయాల్లో సహజమే గానీ.. దానికోసం ఆయన చెప్పే మాటలే చిత్రమైనవి. ‘‘నాకు కులం మతం లేవు.. నేను విశ్వమానవుడిని’’ అని పవన్ కల్యాణ్ చాలా నాటకీయంగా బహిరంగ వేదికల మీదినుంచి ప్రకటించుకున్న సందర్భాలున్నాయి. మతాంతర, దేశాంతర వివాహాలు కూడా చేసుకున్న పవన్ కల్యాణ్ ఆ రకంగా ‘విశ్వమానవుడు తాను’ అని భావిస్తున్నారేమో గానీ.. ఆయనను కాపు నాయకుడిగానే పలువురు చూస్తుంటారు. ఇన్నాళ్లకు పవన్ కల్యాణ్ ఈ ‘విశ్వమానవుడు’ అనే ముసుగువలన ప్రయోజనం లేదని గుర్తించినట్టుంది. అందుకే ఎన్నికల్లో గెలవాలంటే కులం అవసరం అంటూ.. తన కులం ఓట్లను దేబిరించే స్థితికి వచ్చారు. 

అధికార పార్టీలో ఉంటూ తనను విమర్శిస్తున్న కాపు నాయకుల గురించి పరోక్షంగా ప్రస్తావిస్తూ.. సొంత కులం వాళ్లను తిట్టడం కరెక్టు కాదు.. అని పవన్ కల్యాణ్ రోదించడం చాలా చీప్ గా ఉంది. రాజకీయాల్లో నాయకులు తాము ఉన్న పార్టీని మాట్లాడుతుంటారు. అంతే తప్ప కులాన్ని బట్టి కాదు. ‘‘తమ సొంత కులాన్ని తిడుతూ, వేరే వ్యక్తి ప్రాపకం కోసం పాకులాడుతున్నారు. ఒక్కడి కోసం తమ సొంత కులాలను కూడా తిడుతున్నారు’’ అంటూ తన మీద విమర్శలు చేస్తున్న వైసీపీ లోని కాపు నాయకుల గురించి ఆయన ఆవేదన వ్యక్తం చేయడం పవన్ కల్యాణ్ ను నవ్వులపాలు చేస్తోంది.