తనను టీడీపీ కోవర్ట్ అని విమర్శించడంపై ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి తీవ్ర ఆవేదన చెందారు. ప్రభుత్వ వైఫల్యాలను విమర్శిస్తే టీడీపీ కోవర్ట్ అని ఏంటని ఆమె ప్రశ్నించడం చర్చనీయాంశమైంది.
ప్రత్యర్థి పార్టీ కాబట్టి వైసీపీ విమర్శల్ని పక్కన పెడదాం. మరి సొంత పార్టీకి చెందిన రాష్ట్ర నాయకుడు సుబ్బారెడ్డి చేసిన ఆరోపణపై ఏమంటారని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. అలాగే టీడీపీ రాజకీయ ప్రయోజనాల కోసం పురందేశ్వరి పని చేస్తున్నారనే కారణంతోనే సొంత పార్టీకి చెందిన నాయకులెవరూ ఆమెకు సహాయ నిరాకరణ చేస్తుండడాన్ని వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు.
మూడో ప్రత్యామ్నాయ శక్తిగా ఏపీలో ఎదగాలని నిజంగా పురందేశ్వరికి ఆలోచన వుంటే, అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీలను సమానంగా చూస్తూ, ఆ రెండు పార్టీల ప్రజా వ్యతిరేక విధానాలపై ఎందుకు ప్రశ్నించలేదని నెటిజన్లు నిలదీస్తున్నారు. ఏపీ బీజేపీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకూ ఒక్కసారైనా టీడీపీని ప్రశ్నించిన దాఖలాలు ఉన్నాయా? అని నెటిజన్లు నిలదీస్తున్నారు. శ్రీసత్యసాయి జిల్లాలో సోమవారం ఆమె పర్యటించారు.
ఈ సందర్భంగా పురందేశ్వరి మాట్లాడుతూ విధానాలపరమైన లోపాలను ఎత్తి చూపితే టీడీపీ కోవర్ట్ అని విమర్శిస్తే ఎలా అని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం పరిపాలనను ఏ మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యాల గురించి ప్రశ్నించకూడదా అని నిలదీశారు. ఏపీలో జనసేనతో పొత్తులో కొనసాగుతున్నామన్నారు. 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని ఆమె ప్రకటించారు. ఇదిలా వుండగా టీడీపీతో జనసేన పొత్తులో ఉన్న విషయాన్ని ప్రస్తావిస్తూ నెటిజన్లు తీవ్రస్థాయిలో చీవాట్లు పెడుతున్నారు.