హీరోయిజం పండాలంటే కేవలం యాక్షన్ ఉంటే సరిపోదు, ఎలివేషన్ కూడా కావాలి. కేజీఎఫ్ ఫ్రాంచైజీ అంత క్లిక్ అవ్వడానికి ప్రధాన కారణం ఎలివేషన్లే. అలా యాక్షన్, ఎలివేషన్ రెండింటినీ మిక్స్ చేస్తూ రిలీజ్ చేశారు ఈగల్ సినిమా టీజర్.
రవితేజకు యాక్షన్ కొత్తకాదు, ఎలివేషన్లు అంతకంటే కొత్తకాదు. కానీ ఈగల్ టీజర్ లో మాత్రం ఈ రెండూ కొత్తగా ఉన్నాయి. “లావాను కిందకు పిలవకు, ఊరు ఉండదు, నీ ఉనికి ఉండదు”. “అడవిలో ఉంటాడు, నీడై తిరుగుతుంటాడు, కనిపించదు కానీ వ్యాపించి ఉంటాడు” లాంటి డైలాగ్స్ హీరో క్యారెక్టరైజేషన్ ను చెబుతూనే, హీరోయిజంను చక్కగా ఎలివేట్ చేశాయి.
జనాలకు కట్టుకథ, ప్రభుత్వాలు కప్పిపెట్టిన కథ అంటూ ఈగిల్ సినిమా స్టోరీలైన్ కొత్తగా ఉండబోతోందనే విషయాన్ని చెప్పారు. అంతేకాదు.. డైలాగ్స్, సన్నివేశాలతో ఈ కథలో చాలా భాగం అటవీ నేపథ్యంలో సాగుతుందనే విషయాన్ని కూడా పరోక్షంగా వెల్లడించారు.
టీజర్ కాబట్టి పాత్రల పరిచయం, టోన్ వరకు మాత్రమే చూపించారు. రవితేజ తోపాటు, అనుపమ పరమేశ్వరన్, నవదీప్, అవసరాల శ్రీనివాస్, మధుబాల లాంటి కీలకమైన పాత్రలన్నింటినీ టీజర్ లో చూపించారు. టీజర్ లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్, నిర్మాణ విలువలు బాగున్నాయి.
టీజర్ రిలీజ్ సందర్భంగా మరోసారి విడుదల తేదీపై క్లారిటీ ఇచ్చింది పీపుల్ మీడియా. సంక్రాంతి కానుకగా జనవరి 13న ఈగల్ సినిమా థియేటర్లలోకి వస్తుందని ప్రకటించింది. మహేష్ నటిస్తున్న గుంటూరు కారం సినిమా విడుదలైన 24 గంటలకు ఈ సినిమా థియేటర్లలోకి వస్తుందన్నమాట.