వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల రాజకీయంగా తీవ్ర ఒత్తిడిలో ఉన్నారా? అంటే… ఔననే సమాధానం వస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరి నుంచి తప్పుకుని, కాంగ్రెస్‌కు బేషరతుగా ఆమె మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా పాలేరు నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ నాయకుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో వైఎస్సార్ కుటుంబానికి వున్న సాన్నిహిత్యం రీత్యా ఆమె పోటీ నుంచి తప్పుకున్నారు.
కాంగ్రెస్‌కు షర్మిల మద్దతుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దివంగత వైఎస్సార్ పేరును ఎఫ్ఐఆర్లో చేర్చడం, అలాగే ఆయన తనయుడు వైఎస్ జగన్‌ను అక్రమాస్తుల కేసులో ఇరికించిందని కారణంతో కాంగ్రెస్‌పై ఆయన అభిమానులు ఆగ్రహంగా ఉన్నారు. అలాంటి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడం ఏంటని షర్మిలను ప్రశ్నించే గొంతుకలు చాలానే ఉన్నాయి. ఇందుకు ఆమె వైపు నుంచి సమాధానం ఏంటో విన్నాం.
కనీసం కాంగ్రెస్ పార్టీతో అయినా ఆమె సఖ్యతగా వుంటారని భావించిన వారికి షర్మిల షాక్ ఇచ్చారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై సంచలన కామెంట్స్ చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. రేవంత్‌రెడ్డి దొంగే అని న్యాయ స్థానమే చెప్పిందని ఆమె చెప్పుకొచ్చారు. అంతేకాదు, రేవంత్‌రెడ్డికి రేటెంతరెడ్డి అని పేరు పెట్టింది తాను కాదని ఆమె వ్యంగ్యంగా అన్నారు. ఈ దొంగలు సీట్లు అమ్ముకుంటున్నారని ఆరోపిస్తున్న వాళ్లు వేరే వాళ్లున్నారని పరోక్షంగా రేవంత్‌రెడ్డిపై విమర్శలు గుప్పించారు.
అన్ని పార్టీల్లో దొంగలుంటారని ఆమె చెప్పారు. కానీ ఆ దొంగలు ముఖ్యమంత్రులు కాకూడదని పరోక్షంగా రేవంత్‌రెడ్డి సీఎం కాకూడదని షర్మిల తన అంతరంగాన్ని బయటపెట్టారు. తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం కాకుండా అడ్డుకున్నది రేవంత్‌రెడ్డి అని, అందుకే ఆయనపై ఆమెకు కోపమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాంగ్రెస్‌కు మద్దతు పలికిన షర్మిలను కనీసం ఆ పార్టీకి చెందిన ఒక్క నాయకుడు కూడా వెళ్లి మర్యాదపూర్వకంగా కలవక పోవడం వెనుక రేవంత్‌రెడ్డే ఉన్నారనే ప్రచారం జరుగుతోంది.
అయితే కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చి, తిరిగి ఆ పార్టీ అధ్యక్షుడిపై ఘాటు ఆరోపణలు చేయడం అంటే, ఆమె రాజకీయంగా తీవ్ర ఒత్తిడిలా ఉన్నారా? అనే చర్చకు తెరలేచింది. అలాంటప్పుడు షర్మిల కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చి ప్రయోజనం ఏంటనే ప్రశ్న ఉత్పన్నమైంది. ఇంతకంటే మౌనం పాటించి వుంటే బాగుండేదని పలువురు అంటున్నారు. షర్మిల ఆవేశాన్ని అణచుకోలేకే రేవంత్‌రెడ్డిపై విరుచుకు పడ్డారని చెప్పొచ్చు.