Advertisement

Advertisement


Home > Politics - Opinion

'దూకుడు బ్రహ్మానందం'లా పవన్ కళ్యాణ్

'దూకుడు బ్రహ్మానందం'లా పవన్ కళ్యాణ్

"దూకుడు" సినిమాలో రియాలిటీ షో ట్రాక్ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఎవడికి వాడు పర్ఫామెన్స్ ఇస్తూ ప్రైజ్ మనీ కొట్టేయాలని చూసున్నారని బ్రహ్మానందం అనుకుంటూ ఉంటాడు. ఆఖరికి కోట క్యారెక్టర్ చనిపోయినప్పుడు కూడా శవంలా భలే యాక్ట్ చేస్తున్నాడు అనుకుంటాడు తప్ప రియాలిటీ తెలుసుకోడు. రియాలిటీ షో హెడ్ నాగార్జున దృష్టిలో పడడానికి బ్రహ్మానందం చేసే ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. 

ఇప్పుడు తెలుగు దేశం పార్టీ మొత్తం అలాంటి బ్రాహ్మానందాలతో నిండిపోయింది. ఎవరికి వాళ్లు పర్ఫామెన్స్ ఇరగదీసేస్తున్నారు. 

చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు సంఘీభావం తెలిపి గచ్చీబౌలీ స్టేడియం లో పర్ఫార్మెన్స్ ఇచ్చిన బ్యాచ్ ఒకటైతే, ఆయన బయటికొచ్చాక ఆయనని పరామర్శించే ఓదార్పు యాత్రలో భాగంగా డ్రామా పండిస్తున్నవాళ్లు అనేకమంది. 

కొంతమంది డైలాగ్స్ తో కన్నింగుగా, ఇంకొంతమంది కన్నీళ్లతో బాధగా, మరి కొంతమంది ఆవేశంతో విపరీతమైన కోపంగా, ఇంకొందరు బాబు విడుదలయ్యాడని పట్టరానంత సంతోషంగా, వేరే కొందరు పంచ్ డైలాగ్స్ తో బలుపుతో భయంకరంగా...ఇలా పిచ్చపిచ్చగా పర్ఫార్మెన్స్ ఇచ్చేస్తున్నారు. 

పట్టాభి చంద్రబాబు దగ్గరకెళ్లి కన్నీళ్లు పెట్టుకున్నాడు. రఘురామరాజు ఎప్పటిలాగా మైకు ముందు కూర్చుని కన్నింగ్ డైలాగ్స్ చెప్తూ తన ప్రతిభ చూపిస్తున్నాడు. మహాసేన రాజేష్ పట్టరానంత కోపంతో గచ్చిబౌలి వేదిక మీద ఎలా పర్ఫార్మెన్స్ ఇచ్చాడో చూసాం.

అదే వేదికమీద చంద్రబాబుని బాగా రిచ్ గా పరిచయం చేస్తూ "ఒకప్పుడు స్త్రీలు వరకట్నం ఇచ్చేవాళ్లు..చంద్రబాబు గారి దయ వల్ల ఇప్పుడు ఎదురు కట్నాలు పుచ్చుకుంటున్నారు" అంటూ విడ్డూరమైన లైన్ చెప్పిన ఒక స్త్రీమూర్తి కూడా బాబుగారి ఓదార్పు యాత్రకు వెళ్లి తన పర్ఫార్మెన్స్ తాను ఇచ్చింది.

కొలికిపూడి శ్రీనివాసరావైతే టీవీ డిబేట్లకి పరిమితం కాకుండా ఎఫ్.ఎన్.సి.సిలో చంద్రబాబు బెయిలుపై విడుదలైన ఆనందంలో ఏర్పాటు చేసిన సినీ నిర్మాతల పార్టీలకొచ్చి మరీ తన పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. 

"దూకుడు" సినిమాలో కనిపించని నాగార్జునని ఇంప్రెస్ చేయడం బ్రహ్మానందం టార్గెట్ అయితే, ఇక్కడ ఈ బ్రహ్మానందాల టార్గెట్ కనిపిస్తున్న చంద్రబాబు కళ్లల్లో పడడం, ఆయనని ఇంప్రెస్ చేయడం! 

వీళ్లంతా బలంగా నమ్మేది ఒక్కటే... తెదేపా కచ్చితంగా మళ్లీ పవర్లోకి వచ్చేస్తోందని... జనం తప్పు తెలుసుకున్నారని... మళ్లీ పువ్వుల్లోపెట్టి బాబుకి సీయంపదవి ఇవ్వబోతున్నారని.

గంతలు కట్టిన గుర్రానికి రోడ్డు తప్ప ఇంకేమీ కనిపించనట్టు, రంగు కళ్లద్దాలు పెట్టుకుని లోకం నిజంగా అదే రంగులో ఉందని భ్రమ చెందుతున్నట్టు, మూఢనమ్మకంలో కొట్టిమిట్టాడుతున్న మెదడు వాస్తవాన్ని విడిచి ఏదో ఊహించుకుంటున్నట్టు..ఈ వర్గమంతా భయంకరమైన భ్రమలో ఉన్నారు. 

తమ చుట్టూ ఉన్న జనం, తాము చదువుతున్న పత్రికలు, చూస్తున్న ఛానల్స్ చెప్పే విషయాలే రాష్త్రవ్యాప్తంగా ఉన్నాయని బలంగా నమ్ముతున్నారు. అసలు నిజమేంటో తెలుసుకునే న్యూట్రల్ మైండుని అస్సలు వాడడంలేదు.

చంద్రబాబు అరెష్టుపై పూర్తిగా సింపతీ వచ్చేసిందని మనసా-వాచా-కర్మణా నమ్మేస్తున్నారు.

"నిజానికి అంత లేదు!" అని ఎవరన్నా చెబితే వాళ్లని ఎగస్పార్టీవాళ్లుగా కొట్టి పారేస్తున్నారు తప్ప అసలా అర్గ్యుమెంట్ విందామన్న మనసు కూడా పెట్టట్లేదు. 

ఓటర్స్ అనేవాళ్లు రకరకాలుగా ఉంటారు. వారిలో చంద్రబాబు అభిమానులూ ఉంటారు, ద్వేషులూ ఉంటారు. అయితే ఎవరు ఎక్కువగా ఉన్నారనేది తెలుసుకోవాలంటే సమాజాన్ని కళ్లు తెరుచుకుని పరిశీలించాలి, చెవులు విప్పి వినాలి. 

అసలు "సింపతీ" అనేది ఒక ఉత్తుత్తి పదార్ధమనే విషయన్ని ముందుగా గ్రహించాలి. 2004 ఎన్నికలకి ముందు చంద్రబాబు మీద నక్సల్ దాడి జరిగినా ఆయన భయంకరంగా ఓడిపోయాడు. అప్పటి వరకు ఆయన అద్భుతమైన పాలన, అభివృద్ధి అందించాడని జనం నమ్మితే వై.ఎస్.ఆర్ ని ఎందుకు అంత మెజారిటీ ఇచ్చి ఎన్నుకున్నారు? "సింపతీ" ఎందుకు పనిచేయలేదు. 

పోనీ 2009లో అయినా కళ్లు తెరిచి "ఇవ్వక ఇవ్వక ఒక్క అవకాశమిచ్చాం..మళ్లీ బాబునే ఎన్నుకుందాం" అని ఓటర్స్ అనుకోలేదు కదా! అప్పుడు కూడా మళ్లీ వై.ఎస్.ఆరే నెగ్గారు. ఆ తర్వాత 2014లో రాష్ట్ర విభజన అనంతరం మళ్లీ బాబు సీయం అయ్యాడు. అప్పటి నుంచి తెలంగాణా పరిపాలనతో బాబుకి లింకులు తెగిపోయాయి. 

అయినప్పటికీ, కేవలం 2004 వరకు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు హైటెక్ సిటీని, ఔటర్ రింగ్ రోడ్డుని, మెట్రో రైలుని, ఫార్మా కంపెనీల్ని, ఐటీ కంపెనీల్ని హైద్రాబాదుకు తెచ్చి దీనిని మహానగరంగా తీర్చి దిద్దినట్టు తెగ అబద్ధాలు చెప్పి కుళ్లిపోయిన కాలీఫ్లవర్లు చెవుల్లో పెట్టే ప్రయత్నం చేసారు గచ్చీబౌలీ వేదిక మీద నుంచి చంద్రబాబు వర్గీయులు. అది జరిగి పది రోజులైనా అవ్వక ముందే రేవంత్ రెడ్డి వాళ్ల నెత్తి మీద పెద్ద బాంబు పెల్చాడు. 

"...హైటెక్ సిటీకి ఫౌండేషన్ వేసింది నేదురుమల్లి జనార్దన రెడ్డి. ఔటర్ రింగ్ రోడ్, మెట్రో, ఐటీ కంపెనీలు, ఎయిర్పోర్ట్, ఫార్మా కంపెనీలు అన్నీ హైదరాబాదుకి తెచ్చింది కాంగ్రెస్ పార్టీనే..." అంటూ మైకుపట్టుకుని కెమెరా ముందు చెప్పాడు. వై.ఎస్.ఆర్ పేరు చెప్పడానికి నోరు రాకపోయినా అవన్నీ జరిగింది ఆయన హయాములో అని అందరికీ తెలుసు. 

తమకు ఎంతో నమ్మకస్తుడు, చంద్రబాబుకి అనుంగు శిష్యుడు అనుకున్న రేవంత్ రెడ్డే హైద్రాబాదు నిర్మాణంలో చంద్రబాబు ఘనతేం లేదు అన్నట్టుగా చెప్పేస్తే చంద్రబాబు వర్గీయులు తలకాయలు ఎక్కడ పెట్టుకోవాలి? అయినా సరే ...వాళ్ల పగటికల వాళ్లదే. 

2009లో వై.ఎస్.ఆర్ ని జనం మళ్లీ ఎన్నుకోవడానికి గల కారణం ప్రముఖంగా అరోగ్యశ్రీ పథకం. ఆ స్థాయిలో ఏ ముఖ్యమంత్రి తమ ఆరోగ్యానికి విలువ ఇచ్చింది లేదని ప్రజలు అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు. తమకి కలలో కూడా సాధ్యపడని కార్పొరేట్ వైద్యం దొర్కుతున్నందుకు వై.ఎస్.ఆర్ ని ఇప్పటికీ దేవుడిగా చూస్తారు లబ్ధిపొందిన వాళ్లు. దాని తర్వాతే మిగిలిన పథకాలు ఏమిచ్చినా, ఏం చేసినా! 

ఇప్పుడు గ్రాస్ రూట్ లెవెల్లో జగన్ మోహన్ రెడ్డి పాలన గురించి జనాన్ని కదుపుతుంటే వాళ్లు చెప్పేది ఒక్కటే..."ఇన్నేసి లక్షల ఇళ్లు గతంలో పంచిన ఏ ముఖ్యమంత్రీ లేడు. ఇంతిలా ఆసుపత్రుల్ని అభివృద్ధి చేస్తూ జిల్లాకో మెడికల్ కాలేజీ పెడుతున్న నాయకుడు కూడా లేడు. ప్రభుత్వ బడుల్ని బాగుచేసి ఉన్నతమైన విద్య ఉచితంగా అందించాలనే ఆలోచన చేస్తున్న మంత్రి కూడా గతంలో కనపడలేదు. ఈ స్పీడు ఇలాగే కొనసాగాలంటే మరో సారి జగన్ మోహన్ రెడ్డినే ఎన్నుకోవాలి"- అని! 

మరి చంద్రబాబుని అరెష్టు చేయించడంపై అభిప్రాయమడిగితే..."వాళ్లూ వాళ్లూ రాజకీయంగా ఎలా కొట్టుకుంటే మాకెందుకు? మమ్మల్ని ఎవరు పట్టించుకుంటే వాళ్లని గెలిపిస్తాం" అంటున్నారు. 

బెజవాడలో ఒక ఆటో డ్రైవర్ ని అడిగితే ఇలా అన్నాడు- "నాకు రాజకీయాలు పెద్దగా తెలీదు. చంద్రబాబుని ఆ ముసలి వయసులో ఇబ్బంది పెట్టడం అయ్యో అనిపించేలాగే ఉంది. అలాగని అతన్ని మళ్లీ సీయం గా చూడాలనుకోవడం లేదు. మా నాయనమ్మ నుంచి, భార్య వరకు అందరూ జగన్ మోహన్ రెడ్డి వల్లే ఏదో ఒక లబ్ధి పొందారు. మా ఆవిడకి ఇల్లు కూడా వచ్చింది. అన్నీ ఇంటికే వస్తున్నాయి. పిలిస్తే పలికె వాలంటీరున్నాడు. కనుక బాబుగార్ని చూసి "అయ్యో" అనగలమే తప్ప ఓటు మాత్రం జగన్ కే వేస్తాం". 

ఇంత క్లారిటీగా ఉన్న జనమున్నారు. చంద్రబాబుపై సానుభూతి కలిగినా ఓటు వేయలేమని చెప్తున్నవాళ్లు కోకొల్లలు. ఈ ధీమాతోటే జగన్ మోహన్ రెడ్డి "వై నాట్ 175" నినాదం ఎత్తుకున్నారు. పోనీ అన్ని కాకపోయినా , ఎంత తగ్గుతాయని అనుకున్నా ఓటమి పాలయ్యే దృశ్యమే కనిపించడం లేదు వైకాపాకి.. క్షేత్రస్థాయిలో చూస్తుంటే. 

తెదేపా-జనసేన కలిస్తే వైకాపాకి ముప్పే అంటూ ఉండవల్లి నుంచి ఎందరో గతంలో అభిప్రాయాలు చెబుతూ వచ్చారు. ఇప్పుడు పరిస్థితి ఆ దిశగా కూడా పెద్ద ఆశాభావంగా లేదు. 

"ఇప్పటి సంక్షేమం కంటే ఏది ఎక్కువగా వస్తుందని ఆ కూటమిని ఎన్నుకోవాలి"? అనేది సగటు ఓటరు ప్రధాన ప్రశ్న. 

పైగా పవన్ కళ్యాణ్ పై కాపుల్లోనే చాలామందికి సానుకూలత లేదు. జనసేన నుంచి భంగపడి బయటికొచ్చిన పసుపులేటి సందీప్ వంటి వాళ్లే తమ నాయకుడు పార్టీని, కాపుల్ని తెదేపాకి తాకట్టు పట్టేసి వేశ్య టైపులో ఊడిగం చేస్తున్నాడని అనేస్తున్నారు. పోనీ కాపులంతా తమ వాడే అని ఐక్యమై ఎన్నుకున్నా ఎవరికి ఉపయోగమో వాళ్లకే అర్ధం కావడం లేదు. 

కాపుల్ని, బలిజల్ని పవన్ దగ్గరికి చేరకుండా నాదెళ్ల మనోహర్, లింగమనేని, రుక్మిణి ఫీల్డింగ్ చేస్తున్నారని...దీనికి ప్రధాన కారణం వీళ్లందరినీ నడిపేది చంద్రబాబే అని పసుపులేటి సందీప్ చెప్తున్నాడు. 

ఇతను గానీ, గతంలో రాజు రవితేజ గానీ చెప్పే మాటలు వింటుంటే అసలు పవన్ దేనికోసం పార్టీ పెట్టాడో అర్ధంకాదు. కనీస నామమాత్రపు నాయకత్వ లక్షణం కూడా లేకుండా ఉన్నవాడికి తెదేపా అంత సీన్ ఇస్తోందంటే ఎంత కరువులో ఉంటే ఆ పరిస్థితి వచ్చిందో అర్ధం చేసుకోవాలి. 

ఇదంతా ఒకెత్తైతే తాజాగా పవన్ కళ్యాణ్ ని భాజపా వాళ్లు తెలంగాణాలో తమ తరఫున 8 సీట్లు కేటాయించి పోటీ చేయమనడం అతి పెద్ద హైలైట్. ఆ స్థానాలు కూడా ఖమ్మం, వైరా, కొత్తగూడెం, అశ్వారావుపేట, తాండూర్, కోదాడ, నాగర్ కర్నూల్, కూకట్పల్లి. ఈ స్థానాల్లో గతంలో ఎప్పుడూ భాజపాకి తలెత్తుకునే స్థాయి ఓట్లు కూడా పడలేదు. మోడీ వేవ్ ఉన్నప్పుడే కూకట్పల్లిలో 11943 ఓట్లు పడ్డాయి భాజపాకి. తాండూరులో 10548, ఖమ్మంలో 2325, నాగర్ కర్నూల్ లో 3923..ఇదీ పరిస్థితి. మిగిలిన స్థానాల్లో ఎక్కడా రెండు వేల ఓట్లు కూడా పడలేదు. 

ఇప్పుడా స్థానాల్లో జనసేనని పోటీకి పెట్టడానికి కారణమేంటి? అతనెంత పోటుగాడో ప్రపంచానికి చాటటానికే కదా! నిజమే మరి.."నేను గెలవలేని చోట నువ్వు నిలబడి నెగ్గితేనే కదా మన పొత్తుకి ఒక అర్ధం! లేకపోతే నువ్వెందుకు నాకు?" అని అడగొచ్చు. 

ఈ స్థానాల్లో జనసేన ఎందుకు నెగ్గదో ఈజీగా చెప్పొచ్చు. ఫస్ట్ పాయింట్- అభ్యర్థులు ఎవరు?

జనసేన కండువా కప్పుకుని దిగేది ఆయా స్థానాల్లో తెదేపా టికెట్ ఆశించినవాళ్లే అవ్వాలి! లేకపోతే ఇప్పటికిప్పుడు పవన్ కి ఎవరు దొరుకుతారు పాపం!

మొన్నటి వరకు తెదేపా జెండాతో కనిపించిన అభ్యర్థి సడెన్ గా జనసేన కండువా కప్పుకుని పళ్లికిలిస్తూ జనం మధ్యకొచ్చి ఓటేయమని దండం పెడితే ఆ జనం ఏమనుకోవాలి?

తెదేపా మనిషే జనసేన పక్షాన పోటీ అనుకోవాలా? లేక భాజపా మనిషే జనసేన రంగులో ఉన్నాడని అర్ధం చేసుకోవాలా? లేక అచ్చంగా జనసేన మనిషే అనుకోవాలా? 

పోనీ మూడూ ఒకటే అనుకుని ఓటు వేసినా భాజపా తెలంగాణాలో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ఛాన్సుందా?

లేనప్పుడు ఈ ఊసరవెల్లి నాయకుడిని ఎన్నుకుని గెలిస్పిస్తే ఏం లాభం?

రేపు ఈ నియోజకవర్గానికి వచ్చే నిధులు కూడా రాకపోవచ్చు.

ఇలా ఆలోచించి ...అనసవసరంగా ఓటుని వేష్ట్ చేసేకంటే మళ్లీ భారాస కే ఓటేస్తే నయమనుకోవచ్చు. 

పైగా మొన్నామధ్య కూకట్పల్లిలో సర్వే చేస్తే అత్యధికంగా ప్రస్తుత భారాస ఎమ్మెల్యేనే మళ్లీ గెలిపించుకుంటామని చెప్పారు. లేదా ద్వితీయ ప్రత్యామ్నాయంగా కాంగ్రెసుకేస్తారేమో తప్ప జనసేనకి వేసే ఆలోచన సగటు ఓటరుకి రాదు. 

ఇదంతా జరిగాక డిసెంబర్ 3 న ఫలితాల రోజున జనసేన బలమెంతో ప్రపంచానికి తెలుస్తుంది. దాని ప్రభావం ఆంధ్రప్రదేశ్ రాజకీయంపై పడుతుంది. 

"ఇంతోటి దానికి నీతో పొత్తు పేరుతో అన్నేసి సీట్లు నీకివ్వడం మన కూటమికి దెబ్బవుతుంది. గెలిచాక నీకు కట్టబట్టాల్సింది ఏదో కట్టబెడతాను. ప్రస్తుతానికి ఈ 10 సీట్లు తీసుకుని నిలబడు చాలు" అని చంద్రబాబు పవన్ తో అనొచ్చు. 

ఇలా అనడానికే బహుశా జనసేన తెలంగాణాలో కంటెస్ట్ చేయడానికి బాబు ఎంకరేజ్ చేసుండొచ్చు. లేకపోతే భాజపా ఉచ్చులో పడొద్దని పవన్ని బాబు హెచ్చరించేవాడే!! 

అఫ్కోర్స్..బాబు ఎంకరేజ్ చేసినా చేయకపోయినా భాజపావాళ్లు ఆజ్ఞాపిస్తే వాళ్లు దూకమన్న చోటల్లా దూకడం తప్ప పవన్ కి వేరే చాన్స్ కూడా లేదిప్పుడు. ఎందుకంటే ఆంధ్రా ఎన్నికలు ఇంకా ఐదు నెలల తర్వాతున్నాయి. అప్పటి వరకు ప్రశాంతంగా ఉండాలంటే వాళ్లు చెప్పినట్టు చెయ్యాల్సిందే. 

ఇప్పటికే తమ అనుమతి లేకుండా తెదేపా-జనసేన పొత్తుని ప్రకటించినందుకు కేంద్ర భాజపా పవన్ పై కినుకతో ఉంది. అందుకే బహిరంగంగా అతని పరువు తీయడానికి తెలంగాణా ఎన్నికల్లోకి దింపింది. 

తన చుట్టూ ఏం జరుగుతోందో తెలియని అయోమయంలో ఉంటూనే తనకున్న మాస్ ఫాలోయింగ్ వల్లే అటు బాబు, ఇటు కేంద్ర భాజపా తనతో పొత్తు పెట్టుకున్నాయనే భ్రమలో బతుకుతున్నాడు పవన్ కళ్యాణ్.

అంటే తెదేపా వర్గీయులకంటే అతిపెద్ద "దూకుడు బ్రహ్మానందం" మన పవన్ బాబే!

తన పర్ఫార్మెన్స్ కూడా మామూలుగా ఇవ్వలేదు. అందరికంటే బెటర్ గా ఇచ్చాడనుకోవాలి. లేకపోతే చంద్రబాబుకి మద్దతుగా రోడ్డు మీద పొడుకోవడమేంటి? చంద్రబాబు అరెష్టవ్వగానే జైలు బయట హడావిడిగా పొత్తు ప్రకటనేవిటి? 

మొత్తానికి పవన్ కళ్యాణ్ ని అటు బీజేపీ ఇటు తెదేపా వెర్రిగొర్రెని చేస్తున్నాయి. ఈ ఎపిసోడ్లో మోసపోయేది, వంచనకు గురయ్యేది, విలువైన సమాయాన్ని వృధా చేసుకున్నామని తెలుసుకునేది జనసైనికులు మరియు ఇన్నేళ్లుగా పవన్ ని నమ్ముకున్న కాపు ఓటర్లు. 

- హరగోపాల్ సూరపనేని

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?