సెకెండ్ వేవ్ నుంచి ఇప్పుడిప్పుడే బయట పడుతున్నాం. అయితే థర్డ్ వేవ్ హెచ్చరికలు భయాందోళన కలిగిస్తున్నాయి. అలాగని సెకెండ్ వేవ్ పూర్తిగా వెళ్లిపోలేదు. ఇంకా రోజువారీ కేసులు 7-8వేలు ఏపీలో వస్తూనే ఉన్నాయి. మరీ ముఖ్యంగా మరణాలు తగ్గడం లేదు. మరోవైపు రికవరీ కేసులు అంతకంతకూ పెరుగుతుండటం ఊరటనిచ్చే విషయం.
ఈ నేపథ్యంలో థర్డ్ వేవ్‌పై ఇప్పటి నుంచే అప్రమత్తం అవుతున్నారు. యంగ్ హీరో నిఖిల్ సోషల్ మీడియా వేదికగా థర్డ్ వేవ్ నుంచి సురక్షితంగా బయటపడాలంటే ఏం చేయాలో ఓ వీడియో సందేశాన్ని ఇచ్చారు. ప్రధానంగా వ్యాక్సినే థర్డ్ వేవ్‌ను తరిమికొట్టడానికి మనకున్న ఏకైన ఆయుధమనే నినాదంతో ఆయన వీడియో విడుదల చేయడం విశేషం. నిఖిల్ ఏమన్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం.
‘చాలా నెలల తర్వాత ఇండియాలో లక్ష కంటే తక్కువ కరోనా కేసులు నమోదయ్యాయి. నిజంగా ఇది చాలా మరి పరిణామం. అలాగని ఎవ్వరూ రిలాక్స్ కావద్దు. అందరూ జాగ్రత్తలు పాటిస్తూనే ఉండాలి. సెకండ్ వేవ్ తర్వాత.. మళ్లీ థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉంది. ఈ థర్డ్ వేవ్ రాకుండా ఉండాలంటే మనకున్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్. దయచేసి అందరూ వ్యాక్సిన్ వేయించుకోండి.
కరోనా వైరస్ పై మనం చేసే పోరాటానికి మనకు ఉన్న ఏకైక ఆయుధం వ్యాక్సి నేషన్ మాత్రమే. మా వంతుగా ప్రతివారం ఒక గ్రామానికి వెళ్లి ఫ్రీ వ్యాక్సినేషన్ వేస్తున్నాం. అంతేకాకుండా ఎవరైతే వ్యాక్సినేషన్ వేయించుకోవాలి అనుకుంటున్నారో.. యాక్టర్ నిఖిల్ ఇన్‌స్టా అకౌంట్‌లో ట్యాగ్ చేస్తే మా టీమ్ వ్యాక్సిన్ వేయించడానికి ప్రయత్నిస్తుంది. జాగ్రత్తగా ఉండండి. స్టే హోమ్, స్టే స్టేఫ్’ అని నిఖిల్ చెప్పుకొచ్చారు.
కరోనా నుంచి కాపాడుకోవాలంటే వ్యాక్సినే ఏకైక ప్రత్యామ్నాయ మార్గమని అందరూ చెబుతున్నారు. మరీ ముఖ్యంగా ప్రతి పౌరుడికి వ్యాక్సిన్ వేసేందుకు ప్రధాని మోదీ ఇటీవల కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.
నిఖిల్ చెబుతున్నట్టు ప్రతి ఒక్క పౌరుడికి ప్రభుత్వాలు వ్యాక్సిన్ సమకూర్చగలిగితే అంతకు మించిన మంచి పని మరొకటి లేదు. కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా ఆచరణకు నోచుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.