కాంగ్రెస్ పార్టీలో సంక్షోభం రోజురోజుకూ పెరుగుతోంది. కరోనా కట్టడిలో కేంద్రంలో బీజేపీ విఫలమైందని పెద్ద ఎత్తున ప్రచారమవుతున్నప్పటికీ, దాన్ని రాజకీయంగా సొమ్ము చేసుకునే పరిస్థితుల్లో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ లేకపోవడం అత్యంత విచారకరం. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్‌గాంధీకి అత్యంత సన్నిహితుడైన జితిన్ ప్రసాద బీజేపీలో చేరడం రాజకీయంగా ఆ పార్టీలో ఓ కుదుపనే చెప్పాలి.
ఈ నేపథ్యంలో నిరసన గళాలు ఒక్కొక్కటిగా వినపడుతున్నాయి. కాంగ్రెస్‌కు భారీ శస్త్ర చికిత్స అవసరమని, కేవలం వారసత్వం, గత చరిత్రపై ఆధారపడకూడదని ఆ పార్టీ సీనియర్ నేత ఎం వీరప్ప మొయిలీ అన్నారు. బాధ్యతలను అప్పగించేటపుడు సైద్ధాంతిక నిబద్ధతగల నేతలకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. జితిన్ సైద్ధాంతిక నిబద్ధత మొదటి నుంచి అనుమానాస్పదంగానే ఉండేదని ఆయన చెప్పుకొచ్చారు.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ మరో సీనియర్ నేత కపిల్ సిబల్ తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ పార్టీతోనే తాము ఉంటామని, ఒకవేళ అక్కర్లేదు వెళ్లిపొమ్మని పార్టీ చెప్తే.. వెళ్లిపోతామని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లో బీజేపీలో మాత్రం చేర బోనని స్పష్టం చేశారు. తాను పుట్టినప్పటి నుంచి ఆ పార్టీకి వ్యతిరేకమని కపిల్ సిబాల్ పేర్కొన్నారు. బీజేపీలో చేరడమంటే తాను చచ్చిపోయినట్లే లెక్క అని తీవ్ర స్వరంతో అన్నారు. తన శవం కూడా బీజేపీలో చేరదని తెగేసి చెప్పారు.
బీజేపీలో జితిన్ ప్రసాద చేరికపై కపిల్ సిబల్ స్పందిస్తూ… ఇప్పుడు నడుస్తున్న రాజకీయాలకు ఓ సిద్ధాంతమంటూ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో సంస్కరణలకు సమయం ఆసన్నమైందని, సీనియర్ల మాటల్ని నాయకత్వం ఇకనైనా వినాలని కపిల్ విజ్ఞప్తి చేశారు. పార్టీలోని సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదన్నారు. అవి పరిష్కారం అయ్యే వరకు వేలేత్తి చూపుతూనే ఉంటామన్నారు.