అల్లోపతితో పాటు వైద్యులపై అవాకులు చెవాకులు పేలిన యోగా గురు బాబా రాందేవ్ ఒక్కసారిగా యూటర్న్ తీసుకున్నారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ దెబ్బకు ఆయన దిగొచ్చారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని రోజుల క్రితం వ్యాక్సిన్ సమర్థత, అల్లోపతి వైద్యులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు.
కోవిడ్ వ్యాక్సిన్ వల్ల ఎలాంటి ఉపయోగం లేదని, టీకాలు తీసుకున్న తర్వాత కూడా వేలాది మంది వైద్యులు మరణించారని ఘాటు విమర్శలు చేసి వివాదాన్ని క్రియేట్ చేశారు. దీంతో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) సీరియస్‌గా స్పందించింది.
రాందేవ్‌పై పరువు నష్టం దావా కూడా వేసింది.అలాగే రాందేవ్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి, ప్రధానికి ఐఎంఏ లేఖ రాసింది. ఐఎంఏ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు విచారణ చేపట్టి వచ్చే నెల 13వ తేదీకి వాయిదా వేసింది. మరో వైపు రాందేవ్‌పై చర్యలు తీసుకోవాల్సిందిగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) కు ఐఎంఏ నిన్న లేఖ రాసింది. ఈ నేపథ్యంలో రాందేవ్ తన అభిప్రాయాలకు భిన్నంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
వైద్యులు దేవుని దూతల్లాంటి వారని ఆయన ప్రశంసించడం విశేషం. అంతేకాదు, తన పోరాటం వైద్యులపై కాదు, మాదకద్రవ్యాల మాఫియాకు వ్యతిరేకంగా అని ఆయన ప్రకటించారు. అలాగే వ్యాక్సిన్ వేస్ట్ అని మాట్లాడిన పెద్ద మనిషి… త్వరలోనే తాను కూడా కరోనా వ్యాక్సిన్ తీసుకుంటానని ప్రకటించి తన అభిప్రాయాలను మార్చుకున్నట్టు చెప్పకనే చెప్పారు. శస్త్రచికిత్సలు, అత్యవసర పరిస్థితుల్లో అల్లోపతి విధానం ఉత్తమమైందని ఆయన చెప్పుకొచ్చారు. తాను భారతీయ వైద్యవ్యవస్థని ద్వేషించడం లేదని స్పష్టం చేశారు.
ప్రాణాంతక ఇతర వ్యాధులు, తీర్చలేని రుగ్మతలు పురాతన పద్ధతుల ద్వారా నయం చేయవచ్చని ఆయుర్వేదంలో ఉన్నట్టు రాందేవ్ గుర్తు చేశారు. మందులు, చికిత్సల పేరుతో ప్రజలను దోపీడీ చేయకూడదని ఆయన కోరారు. ప్రతి పౌరుడికి ఉచితంగా టీకాలు వేసేలా మోదీ గొప్ప ప్రకటన చేశారని ప్రశంసలతో ముంచెత్తారు. ప్రతి ఒక్కరూ టీకాలు వేయించుకోవాలని ఆయన కోరడం గమనార్హం. దేవునికైనా దెబ్బే గురువు అంటే ఇదేనేమో! అల్లోపతి వైద్యంతో పాటు వైద్యులపై నోరు పారేసుకుని , ఇప్పుడు యూటర్న్ తీసుకోవడం ఆయనకే చెల్లింది.