నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు నుంచి లేఖ రావడంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జన్మ ధన్యం అయిందని సోషల్ మీడియాలో సరదా కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇటీవల ఏపీ సీఐడీ అధికారులు అరెస్ట్ చేయడం, అనంతరం సుప్రీంకోర్టు నుంచి బెయిల్ పొంది, విడుదలైన రఘురామకృష్ణంరాజు వరుస ప్రేమ లేఖలు రాస్తున్న సంగతి తెలిసిందే. అయితే రఘురామ నుంచి లేఖలు పొందని ఏకైక ముఖ్య రాజకీయ వేత్త ఎవరైనా ఉన్నారా? అంటే …ఏపీ సీఎం జగన్ పేరు మాత్రమే వినిపిస్తుంది.
తనను కస్టడీలో విడతల వారీగా సీఐడీ సిబ్బంది చితక్కొట్టారని, దేశంలో ఇంత వరకూ ఏ ఎంపీని ఇలా కొట్టలేదని రఘురామకృష్ణంరాజు గగ్గోలు పెడుతూ దేశంలోని ముఖ్యమంత్రులందరికీ లేఖలు రాసిన సంగతి తెలిసిందే. అలాగే తనపై రాజద్రోహం కేసు నమోదు చేయడం అన్యాయమని, దీనికి వ్యతిరేకంగా తాను పార్లమెంట్‌లో మాట్లాడ్తానని, మద్దతు ఇవ్వాలని ముఖ్యమంత్రులకు లేఖలు రాశారు. ఆయన గవర్నర్లకు కూడా లేఖలు రాయడాన్ని గుర్తించుకోవాలి.
ఇటీవల కాలంలో రఘురామకృష్ణంరాజు లేఖలు, ఫిర్యాదులు చేయడంలో చాలా బిజీ అయ్యారు. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం, తమ పార్టీ అధినేత వైఎస్ జగన్‌కు లేఖ రాయడం ప్రాధాన్యం సంతరించుకుంది. రఘురామ నుంచి లేఖ పొందే అదృష్టం జగన్‌కు దక్కిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చినట్టుగా వృద్ధాప్య పింఛన్ పెంపు హామీని నిలబెట్టుకోవాలని ఆయన జగన్‌ను కోరారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఏడాదికి పెన్షన్ రూ. 250 పెంచాలని లేఖలో కోరారు. ఈ నెల నుంచి రూ.2,750కి పెంచి అందజేయాలని రఘురామ డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో వైసీపీ ప్రభుత్వం వృద్ధాప్య పింఛన్‌ను రూ.2 వేల నుంచి రూ.3 వేలకు పెంచుతామని హామీ ఇచ్చినట్టు రఘురామ గుర్తు చేశారు. ఈ హామీకి ప్రజల నుంచి పూర్తి మద్దతు ఉన్నట్టు ఆయన గుర్తు చేశారు.
ఇంతకూ తనను వైసీపీ తరపున మాత్రమే ప్రజలు గెలిపించారని రఘురామ మరిచిపోయినట్టున్నారే అనే వ్యంగ్య కామెంట్స్ సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతున్నాయి. ఆ విషయాన్ని ఆయన గుర్తెరిగి ఎంపీ పదవికి రాజీనామా చేసి, రాజకీయాల్లో విలువలు పాటించాలని కొందరు నెటిజన్లు హితవు చెప్పడం విశేషం.