ఐపీఎస్ అధికారి పీవీ సునీల్‌కుమార్ రాజకీయంగా కొందరి టార్గెట్ అయ్యారు. దీని వల్ల నష్టం ఎవరికి? ఇప్పుడిదే ప్రధాన ప్రశ్న. మరోవైపు సునీల్‌కుమార్‌కు మద్దతుగా దళిత సామాజిక వర్గ మేధావులు, విద్యావంతులు సోషల్ మీడియా వేదికగా ‘ఐ స్టాండ్ విత్ పీవీ సునీల్‌కుమార్, ఐపీఎస్’ అనే నినాదంతో సంఘీభావ ఉద్యమం స్టార్ట్ చేశారు. నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు అరెస్ట్ , అనంతర రాజకీయ పరిణామాల నేపథ్యంలో ప్రధానంగా సునీల్‌కుమార్‌ను కొందరు ఉద్దేశ పూర్వకంగానే టార్గెట్ చేస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రధానంగా ఆయన కుటుంబ వ్యవహారాలను కూడా నిస్సిగ్గుగా, నిర్లజ్జగా కొందరు టీడీపీ నేతలు మీడియా ముందు మాట్లాడ్డం తీవ్ర విమర్శలకు దారి తీసింది. తాజాగా సునీల్‌కుమార్‌ను ఆంధ్రప్రదేశ్ సీఐడీ అదనపు డీజీ ఉద్యోగం నుంచి డిస్మిస్ చేయాలనే ఫిర్యాదు వెనుక ఎవరెవరు ఉన్నారో తెలుసుకోలేని అజ్ఞానంలో ఏపీ సమాజం లేదు. మరీ ముఖ్యంగా దళిత సామాజిక వర్గం.
పీవీ సునీల్‌కుమార్ దళిత హిందువు కోటాలో ఉద్యోగం పొంది… క్రైస్తవునిగా మారినందున తక్షణమే ఉద్యోగం నుంచి తొలగించా లని మహారాష్ట్ర లీగల్ అబ్జర్వేటరీ (ఎల్‌ఆర్‌వో) కన్వీనర్ వినయ్ జోషి కేంద్రాన్ని కోరడం వెనుక ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదని ఎవరైనా అంటే, అంతకంటే మూర్ఖత్వం మరొకటి లేదు.
ఇటీవల మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా పీవీ సునీల్‌కుమార్‌ను డిస్మిస్ చేయాలనే డిమాండ్ వెనుక పక్కాగా పచ్చ బ్యాచ్ ఉందని జగమెరిగిన సత్యం. అసలు మహారాష్ట్ర లీగల్ అబ్జర్వేటరీ కన్వీనర్‌కు సునీల్ మతం, ఉద్యోగంతో సంబంధం ఏంటి?
మతం మారిన వారికి కులం ద్వారా వచ్చే రిజర్వేషన్ వర్తించదని… ఒక కులం రిజర్వేషన్‌తో ఉద్యోగం పొందిన తర్వాత, మతం మారినా కొలువు నుంచి తొలగించాలని ఇటీవల మద్రాసు హైకోర్టు తీర్పు చెప్పడం తెలిసిందే. దీన్ని ఆయుధంగా తీసుకుని సునీల్‌కుమార్ ఉద్యోగాన్ని ఊడగొట్టే ప్రయత్నాలు తీవ్రతరం అయ్యాయి.
సునీల్ కుమార్ కూడా దళితుడి కోటాలో ఉద్యోగం పొంది… ఆ తర్వాత మతం మారారని జోషి ప్రధాన ఆరోపణ. కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌కుమార్ భల్లాకు రాసిన ఐదు పేజీల లేఖలో మద్రాస్ హైకోర్టు తాజా తీర్పు, తొలగింపుతో పాటు ఆయన హిందూ వ్యతిరేక ప్రచారం చేస్తున్నారనే అభియో గాలు మోపారు. అంబేడ్కర్ ఇండియా మిషన్ పేరిట ఆయన కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు.
ఫిర్యాదుదారుడు పేర్కొన్నట్టు సునీల్‌కుమార్ కేవలం ఉద్యోగి మాత్రమే కాదు. ఆయనలో ఓ ఉద్యమకారుడు, ఉత్తమ కథా రచయిత కూడా దాగి ఉన్నారు. దళితుల అభ్యున్నతికి ఆయన చాపకిందు నీరులా క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. పీవీ సునీల్‌కుమార్ కథలు చదివిన వారెవరైనా ఆయనలోని సామాజిక కోణాన్ని గుర్తిస్తారు. వినయ్ జోషి ఆపాదించిన వాటికి విరుద్ధంగా సునీల్‌కుమార్ చిత్తశుద్ధితో ఉద్యమిస్తున్నారు. ఆయన్ని దగ్గరగా చూసిన వారెవరికైనా ఈ విషయం అర్థమవుతుంది. అయితే సామాజిక వర్గాన్ని చైతన్యపరచడానికి, హిందుత్వంపై వ్యతిరేకత పెంచడానికి తేడా తెలియని అజ్ఞానులకు సునీల్ ఆశయాలు అర్థం కావు.
రఘురామకృష్ణంరాజు చేష్టల వెనుక టీడీపీ ఉందని అందరికీ తెలుసు. దళితులు, క్రిస్టియన్లు, ముస్లింలతో పాటు రెడ్లపై రఘురామకృష్ణంరాజు తిట్ల పురాణం వల్ల ఆయా సామాజిక వర్గాలు రగిలిపోతున్నాయి. ప్రస్తుతం వైఎస్ జగన్‌ను టార్గెట్ చేసే క్రమంలో పీవీ సునీల్‌కుమార్‌ను తెరపైకి తెచ్చారు. సునీల్ వివాహ బంధంలో తలెత్తిన గొడవలను బజారుకీడ్చి సునీల్‌కు మార్‌తో పాటు ఆయన్ని అభిమానించే దళితుల ఆగ్రహానికి గురి అవుతున్నారు. ఈ వాస్తవాన్ని టీడీపీ గ్రహించినట్టు లేదు. పీవీ సునీల్‌కుమార్‌పై ప్రతి విమర్శకు భవిష్యత్‌లో టీడీపీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది.
ఎందుకంటే సునీల్ కేవలం సీఐడీ చీఫ్ మాత్రమే కాదు, ఆయన ప్రాపంచిక దృక్పథం అంతకు మించింది. సునీల్‌పై అవాకులు చెవాకులు పేలుతున్న వారెవరైనా అంతిమంగా, చంద్రబాబే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే చంద్రబాబు దళిత, మైనార్టీ వర్గాల వ్యతిరేకిగా కావాల్సినంత వ్యతిరేకత సంపాదించుకున్నారు. దాన్ని తగ్గించుకోడానికి బదులు, మరింత మూటకట్టుకోవడం బాబుకే చెల్లింది.