ఎన్డీఏ ఉప రాష్ట్రపతి అభ్యర్థి జగదీప్ ధన్కర్ను సమర్థించడానికి ఏపీ అధికార, ప్రతిపక్ష పార్టీలకు ఓ సాకు కావాలి. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు వైసీపీ, టీడీపీ రెండు పార్టీలు మద్దతు పలికాయి. ద్రౌపది ముర్ము గిరిజన మహిళ కావడంతో వైసీపీ, టీడీపీలకు కలిసొచ్చింది. తాము అణగారిన వర్గాలకు పెద్దపీట వేస్తున్నామని, సామాజిక కోణంలో ద్రౌపది ముర్ముకు మద్దతు పలికామని వైసీపీ, టీడీపీ వేర్వేరుగా అయినా, ఒకే మాట చెప్పాయి.
ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నిక వంతు వచ్చింది. ఎన్డీఏ కూటమి తరపున పశ్చిమబెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్కర్ను బరిలో నిలిపేందుకు బీజేపీ నిర్ణయించింది. ఈయన రాజస్థాన్‌కు చెందిన రాజకీయ నాయకుడు, సీనియర్ న్యాయవాది. అన్నింటికి మించి జాట్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి.
విపక్షాల అభ్యర్థిని ఇంకా నిర్ణయించలేదు. ఇదిలా వుండగా వైసీపీ, టీడీపీ ఎన్డీఏ కూటమిలో లేవు. పైగా ఏపీలో ఈ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయంగా తాము 2024లో అధికారంలోకి వస్తామని బీజేపీ చెబుతోంది. వైసీపీ, టీడీపీలపై ఏపీ బీజేపీ తీవ్ర విమర్శలు చేస్తోంది. అయినప్పటికీ బీజేపీ తానా అంటే తందానా అనేందుకు ఏపీ అధికార, ప్రతిపక్ష పార్టీలు సిద్ధంగా వుంటాయి.
మంచీచెడులతో సంబంధం లేకుండా బీజేపీ తీసుకొచ్చే ప్రతి బిల్లుకు లోక్‌సభ, రాజ్యసభల్లో వైసీపీ, టీడీపీ మద్దతు ఇస్తూ వస్తున్నాయి. ప్రధాని మోదీ, కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌షాలతో పెట్టుకుంటే ఏమవుతుందోననే భయం ఆ రెండు పార్టీలను వెంటాడుతోంది. వైసీపీ, టీడీపీ నేతల భయాన్ని పసిగట్టిన బీజేపీ నేతలు…. జగన్, చంద్రబాబులను ఓ ఆట ఆడుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో ఎన్డీఏ కూటమిలో లేనప్పటికీ, అనధికార మిత్రపక్షాలుగా వైసీపీ, టీడీపీ కొనసాగుతున్నాయి. ఏపీ ప్రయోజనా లను కేంద్ర ప్రభుత్వం తుంగలో తొక్కినా, తొక్కుతున్నా వైసీపీ, టీడీపీలకు మాత్రం పట్టవు. సొంత ప్రయోజనాలే తప్ప, రాష్ట్ర ప్రయోజనాలను పట్టించుకోని పార్టీలుగా వైసీపీ, టీడీపీ నిస్సిగ్గుగా బీజేపీకి మద్దతు పలుకుతూ వస్తున్నాయి. ఇందులో భాగంగా ఉపరాష్ట్రపతి అభ్యర్థికి కూడా అడగకుండానే మద్దతు ఇవ్వడంలో వైసీపీ, టీడీపీ పోటీ పడతాయని ఆంధ్రప్రదేశ్‌లో ఏ చిన్న పిల్లాడిని అడిగినా చెబుతాడు.
జగదీప్ ధన్కర్ రైతు కావడం వల్లే మద్దతు ఇచ్చామని వైసీపీ, టీడీపీ చెబుతాయా? లేక న్యాయ నిపుణుడనో, గతంలో రోజూ నాలుగైదు కిలోమీటర్లు కాలి నడకన వెళ్లి చదువుకున్నాడనో, గవర్నర్‌గా పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీతో నిత్యం గొడవ పడుతుండేవాడనో, జాట్ సామాజిక వర్గమనో, బీజేపీ నాయకుడనో….ఏమని చెప్పి సమర్థించుకుంటారో వైసీపీ, టీడీపీ నాయకులకే తెలియాలి.
బహుశా ఏపీ రాజకీయ చరిత్రలో ఇలాంటి పాలకప్రతిపక్ష పార్టీల ధోరణలను గతంలో ఎవరూ చూసి వుండరేమో! ఆ అదృష్టం మనకు కలుగుతోంది. కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీ ప్రభుత్వ చల్లని చూపు కోసం, ఆ పారటీ నిలబెట్టే అభ్యర్థికి మద్దతు ఇస్తున్నారనేది వాస్తవం. అయితే జనం వెర్రోళ్లనుకుని ఏవేవో జిమ్మిక్కులు చేస్తున్న వైసీపీ, టీడీపీ నేతలను చూస్తే జాలి పడడం తప్ప చేయగలిగేదేముంది?