ఓటరు కార్డుకు ఆధార్ అనుసంధానం తప్పనిసరి ఎంత మాత్రం కాదని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. దొంగ ఓట్ల కట్టడికి ఓటరు కార్డుకు ఆధార్ అనుసంధానం చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆగస్టు ఒకటి నుంచి ఓటరు కార్డుకు ఆధార్ అనుసంధానం ప్రక్రియ మొదలు కానుంది. అయితే ఆధార్ అనుసంధానంపై వ్యక్తిగత గోప్యతకు భంగం ఏర్పడుతుందని కొన్ని వర్గాల ప్రజల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది.
ఈ నేపథ్యంలో ఓటరు కార్డుకు ఆధార్ అనుసంధానంపై ఎన్నికల సంఘం స్పష్టత ఇచ్చింది. ఆధార్ అనుసంధానం స్వచ్ఛందమన్నారు. అంతే కానీ, తప్పని సరి కాదని ఎన్నికల అధికారులు స్పష్టం చేయడం గమనార్హం. ఓటు హక్కు వినియోగానికి ఆధార్ అనుసంధానానికి ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు.
అలాగే ఓటర్ల జాబితాలో మార్పుచేర్పులకు వచ్చే ఏడాది జనవరి 18 తుది గడువు అని పేర్కొన్నారు. ఈ తేదీలోపు 18 ఏళ్లు నిండిన వారు ఓటు నమోదు చేసుకోవచ్చు. ఇదిలా ఉండగా ఇక మీదట ఓటు నమోదు చేసుకునేందుకు ఏడాదిలో నాలుగు సార్లు అవకాశం కల్పించనున్నట్టు ఎన్నికల అధికారులు వెల్లడించారు. జనవరి, ఏప్రిల్, జూలై, అక్టోబర్ నెలల్లో ఓటు నమోదుకు అవకాశం కల్పించనున్నారు.
ఎవరైనా ఓటు లేని వారు, సమర్థవంతమైన పాలన, నాయకత్వం కోరుకునే వారు, సరైన అభ్యర్థిని ఎన్నుకోవాలని భావించేవాళ్లు ముందుగా చేయాల్సిన పని ఓటు నమోదు చేసుకోవడం. ఆ తర్వాతే ఏదైనా.
కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం ఆయా వ్యక్తుల చైతన్యంపై ఆధారపడి వుంటుంది. అలాగే ఓటరు కార్డుకు ఆధార్ అనుసంధానంపై భయపడాల్సిన పనిలేదు.