వైసీపీ సర్కార్ లో ఒక నిర్ణయం తీసుకుంటే వెనకకు మళ్ళడం సాధారణంగా ఉండదు అని అంటారు. అందునా అతి కీలకమైన నిర్ణయం ఒకటి అలా ఉండిపోయింది. అదే మూడు రాజధానులు. దీని మీద హై కోర్టు ఫైనల్ తీర్పు అయితే ఇచ్చేసింది. కానీ ఆశలు ఇంకా వైసీపీ నేతలలో అలా మిగిలే ఉన్నాయి.
అయితే హై కోర్టు తీర్పు మీద సుప్రీం కోర్టుకు వెళ్ళి మూడు రాజధానులకు అనుకూలంగా తీర్పు వచ్చేలా చూసుకోవాలి. ప్రభుత్వం అయితే ఇప్పటిదాకా అప్పీల్ కి వెళ్లలేదు. కానీ గత కొన్ని రోజులుగా మళ్ళీ మూడు రాజధానుల విషయం మీద చర్చ జోరుగానే సాగుతోంది. ఆగస్ట్ తరువాత ఏపీలో కీలకమైన పరిణామాలే జరుగుతాయని అంటున్నారు.
అందుకే మంత్రి గుడివాడ అమరనాధ్ అయితే మరో రెండు మూడు నెలలలో మూడు రాజధానులకు సంబంధించి బిల్లుని అసెంబ్లీలో ప్రవేశపెడతామని చెప్పుకొచ్చారు. ఈ నెలలో శాసనసభ వర్షకాకాల సమావేశాలు ఉన్నాయి. అంటే బహుశా వింటర్ సెషన్ లో కానీ దాని కంటే ముందు ప్రత్యేక సమావేశాలు నిర్వహించి కానీ మూడు రాజధానుల బిల్లు సభలో మళ్ళీ ప్రవేశపెడతారు అన్న మాట.
దానికంటే ముందు న్యాయ అడ్డంకులు దాటేందుకు కూడా ప్రభుత్వం సుప్రీం కోర్టు తలుపు తడుతుందేమో చూడాలి. లేకపోతే కేంద్రం మీద వత్తిడి చేసి పార్లమెంట్ లో ఏమైనా రాజధానుల బిల్లులో సవరణలు తెస్తారమో ఆలోచించాలి. గుడివాడ మాత్రం ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా విశాఖ పరిపాలనారాజధాని కాకుండా మానదు అని చెబుతున్నారు.
పెట్టుబడులు ఏపీలో పెట్టాలనుకునే వారు విశాఖ వైపే చూస్తున్నారు అని కూడా ఆయన అంటున్నారు. విశాఖకు రాజధాని హోదా ఉందని, అది తమ ప్రభుత్వ హయాంలోనే సాకారం అవుతుందని కూడా కడు నిబ్బరంగా మంత్రి గారు చెబుతున్నారు అంటే కాస్తా ఆలోచించాల్సిందే.