Advertisement

Advertisement


Home > Politics - Analysis

టీడీపీ మళ్ళీ వైసీపీ రూట్లోనే వెళుతుందా ...?

టీడీపీ మళ్ళీ వైసీపీ రూట్లోనే వెళుతుందా ...?

టీడీపీ మళ్ళీ వైసీపీ రూట్లోనే వెళ్లడమేమిటి? ఆ రెండు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది కదా. ఈ రెండు పార్టీలు ఏ విషయంలో ఇంతకుముందు ఒకే దారిలో వెళ్లాయి? అప్పుడే మర్చిపోయారా? తాజాగా ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపదికి ముందుగా వైసీపీ మద్దతు ప్రకటించగా తరువాత టీడీపీ కూడా అదే పని చేసిన సంగతి తెలిసిందే కదా. 

ఇప్పుడిక ఉప రాష్ట్రపతి వంతు వచ్చింది. ఎన్డీయే తన అభ్యర్థిగా పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్ కర్ పేరును ప్రకటించేసింది. అలా ప్రకటించడమే ఆలస్యం వైసీపీ జీ హుజూర్ అంటూ మద్దతు ప్రకటించింది. కేంద్రం ఏపీకి అంత అన్యాయం చేస్తున్నా ముఖ్యమంత్రి జగన్ కేంద్రం ఏం చెప్పినా జీ హుజూర్ అంటారు. కేంద్ర అడక్కుండానే మద్దతు ఇస్తారు. సమర్థిస్తారు.

ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు ఇస్తున్నట్లు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి వెంటనే ట్వీట్ చేశారు. జగన్ అనుమతి లేకుండా ఆయన ఈ పని చేయరు కదా. ఎన్డీఏ తరఫున ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికైన జగ్‌దీప్ ధన్‌కర్‌కు విజయసాయి రెడ్డి అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఆయన హిందీలో ట్వీట్ చేశారు. 

జగ్‌దీప్ ధన్‌కర్‌ను రైతు పుత్రుడిగా అభివర్ణించారు. ఎన్డీఏ అభ్యర్థిగా ఎన్నిక కావడం సంతోషాన్ని ఇస్తోందని వ్యాఖ్యానించారు. ఉప రాష్ట్రపతిగా దేశానికి ఎనలేని సేవలను అందిస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. దేశ గౌరవాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తారని అన్నారు. వైసీపీ తన పని తాను చేసింది. ఇక మిగిలింది టీడీపీ వంతు. ఎన్డీఏ నుంచి జగ్‌దీప్ ధన్‌కర్ అభ్యర్థిత్వం ఖరారు కాగా.. ప్రతిపక్ష యూపీఏ సంకీర్ణ కూటమి తమ అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది.

రేపో, మాపో యూపీఏ ప్రతిపాదిత ఉప రాష్ట్రపతి అభ్యర్థి పేరు తెర మీదకి వచ్చే అవకాశాలు లేకపోలేదు. జగ్‌‌దీప్ ధన్‌కర్ అభ్యర్థిత్వాన్ని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వాగతించినట్టే. ఆగస్టు 6వ తేదీన నిర్వహించబోయే ఎన్నికల్లో ఆయనకే ఓటు వేయడం కూడా దాదాపుగా ఖాయమైనట్టే. ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు ఇచ్చినట్లే ఉప రాష్ట్రపతి అభ్యర్థికి కూడా టీడీపీ మద్దతు ఇస్తుండవచ్చు. 

సాధారణంగా అయితే తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతాపార్టీ మధ్య ఉప్పు నిప్పు అనే పరిస్థితి ఉంది. కేంద్రంలోని నేతలకన్నా రాష్ట్రంలోని నేతలే ఎక్కువగా టీడీపీని వ్యతిరేకిస్తున్నట్లు వారి ప్రకటనలను బట్టి ప్రజలకు స్పష్టమవుతోంది. రాబోయే ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకొని ఎన్నికలకు వెళ్లాలనే యోచనలో ఉన్న చంద్రబాబుకు అటువంటి అవకాశం ఇవ్వకుండా ఇక్కడి నేతలే మోకాలడ్డుతున్నారంటూ తెలుగుదేశం పార్టీ వర్గాలు మండిపడుతున్నాయి.

ఈ నేపథ్యంలో ఒక కేంద్ర మంత్రి చొరవ తీసుకున్నారు. ఇరు పార్టీలను ఒకే వేదికపైకి రప్పించారు.ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము ఏపీ పర్యటన సందర్భంగా తెలుగుదేశం పార్టీ నేతలను కలిసే షెడ్యూల్ లేకపోయినప్పటికీ సదరు కేంద్ర మంత్రి చొరవ తీసుకొని ఏర్పాట్లు చేశారు. ఈ విషయం చివరి వరకు వైసీపీకి కూడా తెలవదు. టీడీపీ నేతలను కూడా కలవాలంటూ అమిత్ షా ఢిల్లీ నుంచి గట్టిగా చెప్పడంతో షెడ్యూల్ ఖరారైంది. 

రాష్ట్రపతి ఎన్నికల్లో టీడీపీ ఓట్ల శాతం తక్కువైనప్పటికీ మర్యాదపూర్వకంగా ముర్ము కలిసి టీడీపీ మద్దతు కోరారు. ఆల్రెడీ అంతకుముందే ముర్ముకు మద్దతు ఇవ్వాలని టీడీపీ నిర్ణయించింది. రెండు పార్టీల మధ్య పొత్తు లేకపోయినప్పటికీ ఎన్నికల్లో తనకు అడ్డంకులు సృష్టించకుండా ఉంటే చాలనేది చంద్రబాబు భావన. బీజేపీ తటస్థంగా ఉంటుందా? లేదంటే జగన్ కు లోపాయికారీగా ఏదైనా సహకారం అందిస్తుందా? అనే చిక్కుముడి ఇప్పటికీ వీడటంలేదు.

బీజేపీ తన రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని వ్యవహరిస్తుంది. కానీ చంద్రబాబు తనతో పొత్తు లేకపోయినా పర్వాలేదు.. అడ్డంకులు మాత్రం సృష్టించవద్దు అని సదరు కేంద్ర మంత్రిని కోరుతున్నారు. ఆయన ద్వారా కేంద్రం తనకు వ్యతిరేకంగా లేకుండా చూడాలని బాబు ప్రయత్నిస్తున్నారు. 

గతంలో చంద్రబాబునాయుడిద్వారా లబ్ధిపొందిన సదరు కేంద్ర మంత్రి బీజేపీ టీడీపీతో కలిసివెళ్లడమే మేలనే విషయాన్ని ఇప్పటికే అధిష్టానానికి చేరవేసినట్లు సమాచారం. ఈ ఏడాదిలో గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలు ఉండటంతో వాటిపై దృష్టి సారించిన బీజేపీ పెద్దలు ప్రస్తుతానికి ఔనానికానీ, కాదనికానీ సమాధానమివ్వలేదని టీడీపీ వర్గాలు వెల్లడించాయి. 

మరోవైపు కేంద్రంలో అవసరమైన సందర్భంలో వైసీపీ ఎన్డీయేకి మద్దతు తెలుపుతూ స్నేహహస్తాన్ని అందిస్తోంది. రాష్ట్రంలో వైసీపీ, టీడీపీ మధ్య హోరాహోరీ పోరు నడుస్తున్న నేపథ్యంలో బీజేపీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఉత్కంఠగా మారింది. అయితే బీజేపీతో పొత్తు ఆలోచనలో ఉన్న చంద్రబాబు ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థికి కూడా మద్దతు ఇస్తారని అనుకోవచ్చు. 

ఒకప్పుడు ఇతర ప్రతిపక్షాలతో కలిసి జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన చంద్రబాబు ఇప్పుడు మాత్రం మరోసారి అధికారంలోకి రావడం మీదనే దృష్టి పెట్టారు. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?