నన్ను చూసి పిక్చర్ ను సూపర్ హిట్ చేయండి!

'నన్ను చూసి, నా సినిమా ను సూపర్ డూపర్ హిట్ చేయండి. డైరెక్టర్ ఎవరు, స్టోరీ ఏంటి, హీరోయిన్ ఎవరు, బ్రహ్మానందం ఉన్నాడా లేడా, మరి ప్రకాష్ రాజో, మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు, పాటలు…

'నన్ను చూసి, నా సినిమా ను సూపర్ డూపర్ హిట్ చేయండి. డైరెక్టర్ ఎవరు, స్టోరీ ఏంటి, హీరోయిన్ ఎవరు, బ్రహ్మానందం ఉన్నాడా లేడా, మరి ప్రకాష్ రాజో, మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు, పాటలు ఉన్నాయా, ఎవర్రాశారు, సిరివెన్నెల సీతారామ శాస్త్రి లేరుగా, మరి ఎవరితో రాయించారు??

ఇలాటి ప్రశ్నలు అడక్కండి. నా మీద నమ్మకం ఉంచండి. నేనే హీరో ని. సినిమా కు తండోపతండాలుగా విరగబడి రండి….'అంటూ ఏ సినిమా హీరో అయినా అంటే….ఇల్లెక్కి కూస్తే…..ఆయన కు ఏదో తేడా చేసిందనుకోవాలి.

రెండు వారాలు ఆడి అవతలకు పోయే సినిమాకే రెండొందల మంది టెక్నీషియన్లు, రచయితలు, డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయిదారు నెలల పాటు కుస్తీ పట్లు పడుతుంటారు. అయినా, కొలిక్కి రాదు. తీరా తీశాక, సినిమా హిట్టో… ఫట్టో తెలియదు. 

తెలిస్తే, అజ్ఞాతవాసి సినిమా ఎందుకు ఫట్టు అయినట్టు? దానికేమి తక్కువయినట్టు? హీరో తక్కువా? డైరెక్టర్ తక్కువా? హీరోయిన్ తక్కువా? కధ తక్కువా? మరి ఎందుకు ఢమాల్ అన్నది? పోనీ, అజ్ఞాత వాసి కాకపోతే 'ఆచార్య' ఎందుకు పేలి పోయినట్టు? ఏమి తక్కువైంది? చిరంజీవిని మించిన మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరో తెలుగులో ఎవరైనా ఉన్నారా? 

మూగవాడితో మాటలు చెప్పించగల కొరటాల శివకు డైరెక్షన్ కుదరక ఆచార్య తన్నేసిందా? చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబు రామ్ చరణ్, ఇతర మెగా కాంపౌండ్ హీరోల అభిమానులు తలా ఓ సారి చూసినా, 'ఆచార్య' సూపర్ డూపర్ హిట్ అయ్యేదిగా! అయినా… సూపర్, డూపర్ ప్లాప్ అయిందంటే వాళ్ళు…., ఆ సినిమా ఆడే హాలు ముందునుంచి కూడా వెళ్ళలేదు అనేగా!

దీనినిబట్టి, ఎవరికైనా అర్ధమవాల్సింది ఏంటంటే అట్ట మీద బొమ్మ చూసి, పుస్తకం కొనడం కుదరదు అని. ఆ విషయం పవన్ కళ్యాణ్ కు ఎప్పుడు అర్ధం అవుతుందో తెలియక, ఆయన రాజకీయాభిమానులు జుట్లు పీక్కుంటున్నారు.

అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట లో ఆయన, తనను చూడడానికి పోటెత్తిన సినీ, రాజకీయాభిమానులను ఉద్దేశించి ప్రసంగిస్తూ, 'నా అభ్యర్థులు ఎవరు అని చూడకండి. నన్ను మాత్రమే చూడండి. 'అన్నారు.

అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేసేవారు ఆ మాట అంటే చెల్లుతుంది. అక్కడ అధ్యక్షుడిని మాత్రమే అమెరికన్ ఓటర్లు ఎన్నుకుంటారు. గెలిచిన వారు, మిగిలిన సవాలక్ష పదవులకు సవా లక్ష మందిని నియమించుకుంటారు. ఇండియా లో కుదరదు. ఎంఎల్ఏ అభ్యర్థులకే జనం ఓట్లు వేస్తారు. వారు ఎవరు అని చూడొద్దు అనడం లోనే పవన్ రాజకీయ డొల్లతనం బయటపడి పోతున్నది. అంటే, వారు ఎవరో ఇప్పటికీ ఆయనకు తెలియదు అన్న మాట. 

అందుకే, తను మాత్రమే సత్యం…. తన అభ్యర్థులు మిధ్యః అని జనాన్ని నమ్మమని ఆయన చెబుతున్నారు. పైపెచ్చు తనను నమ్మితే ఓటు వేయండి అని కూడా పవన్ కళ్యాణ్ అన్నారు. ఆయన పార్టీ తరఫున గెలిచిన వారు, పరిస్థితులను బట్టి అటు వైస్సార్సీపీ లోకో, ఇటు టీడీపీ లోకో వెళ్ళిపోతే ఆయన ఒక్కరే రాష్ట్రాన్ని బాగు చేస్తారా?

పైపెచ్చు, తనకు అధికారం పై ఆశ లేదని, ఓట్లు వేసి గెలిపిస్తే అధికారం లోకి వస్తానని రేపు గాక పోతే, 2029 లో అయినా వస్తానని పవన్ కళ్యాణ్ అన్నారు. ఆశ లేని వారు రాజకీయాలలోకి అసలు అడుగు పెట్టరు. కనీసం కన్నెత్తి అయినా చూడరు.

పని మాలా ఉత్తర ప్రదేశ్ వెళ్లి, బీ ఎస్ పీ అధినేత్రి మాయావతి ని రాష్ట్రానికి ఆహ్వానించి, బహిరంగ సభలో ఆమెకు సాష్టాంగ నమస్కారం చెయ్యరు. ఇంకా…. చాలా చాలా చెయ్యరు. అందని ద్రాక్ష పుల్లన అంటే ఎలా?

ఆయన అధికారానికి దగ్గరగా రావాలని భావిస్తూ ఉంటే షార్ట్ కట్ రూట్ ఏమీ లేదు. 'వన్ లైన్ స్టోరీ' కుదరదు. పదేళ్లు అయినా, పవన్ కు ఇది కొత్త జోనర్. ప్రతి మాటలో, ప్రతి చేతలో, ప్రతి కదలికలో ప్రతి అడుగు లో జనానికి నిజాయతీ కనిపించాలి. హిపోక్రసీ తో చప్పట్లు మోగుతాయి గానీ, ఓట్లు రావు.' ఓట్ల కోసం కాదు. అభిమానుల కోసం…'అంటే ఆయన ఇష్టం.

భోగాది వేంకట రాయుడు