నాటకీయ పరిణామాల మధ్యన మహారాష్ట్రలో నూతన ప్రభుత్వం కొలువుదీరింది. బీజేపీ వెనుక ఉండి నడిపిన మంత్రాంగంతో ఏక్ నాథ్ షిండే ప్రభుత్వం ఏర్పడింది.
ఈ తిరుగుబాటు వ్యవహారంలో ప్రజల్లో ఏదైనా వ్యతిరేకత ఉంటే దాన్ని సమసిపోయేలా చేసుకోవడానికి కొత్త ప్రభుత్వం తన వంతు ప్రయత్నాలన్నీ చేస్తోంది. ఆ సంగతలా ఉంటే.. పార్టీపై తన పట్టు పూర్తిగా జారుతున్న వేళ శివసేన అధిపతిగా, మహారాష్ట్ర సీఎంగా ఉద్ధవ్ ఠాక్రే భారతీయ జనతా పార్టీతో రాజీ ప్రయత్నాలు చేసినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి.
ఏక్ నాథ్ షిండే నాయకత్వంలో చెలరేగిన తిరుగుబాటును చల్లార్చే యత్నంలో విఫలం అవుతున్న దశలో ఉద్ధవ్ ఠాక్రే బీజేపీ అధినాయకత్వంలోనూ, మరాఠా బీజేపీ నేతలతోనూ ఫోన్లో రాజీ కుదుర్చుకునే ప్రయత్నం చేశారనే విషయం ప్రపచారంలోకి వస్తోంది.
ఏక్ నాథ్ షిండే తిరుగుబాటుకు బీజేపీ అండదండలున్న నేపథ్యంలో.. వారి వెనుక నిలవద్దని.. తనే అందరినీ తీసుకుని బీజేపీకి బాసటగా నిలిచేందుకు సిద్ధమంటూ సంకేతాలను పంపారట ఉద్ధవ్. ముందుగా ఈ వ్యవహారంపై మహారాష్ట్ర మాజీ సీఎం, ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తో ఉద్ధవ్ చర్చలు జరిపారట.
ఫడ్నవీస్ కు ఉద్ధవ్ ఫోన్ చేసి.. తిరుగుబాటు కూటమికి మద్దతు ఉపసంహరించుకోవాలని, తనతో చేతులు కలపాలని.. తిరిగి బీజేపీ- శివసేన కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు తనది హామీ అంటూ ఉద్ధవ్ అన్నారట. అయితే అప్పటికే షిండేను ఎగదోసిన ఫడ్నవీస్ ఆ దశలో వెనక్కు తగ్గదలుచుకోలేదట.
అదే సమయంలో ప్రధానమంత్రి మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కూడా చర్చలకు ఉద్ధవ్ ప్రయత్నించారట. బీజేపీ- శివసేనల మైత్రి తన నాయకత్వంలో మళ్లీ వికసింపజేసే ప్రయత్నం చేస్తానన్నారట ఉద్ధవ్. అయితే వారు మోడీ, షాలు ఉద్ధవ్ తో మాట్లాడటానికి కూడా పెద్ద ఆసక్తి చూపలేదట.
గతంలో కాంగ్రెస్- ఎన్సీపీలతో శివసేన చేతులు కలిపినప్పుడు.. వారించడానికి మోడీ, షా లు ప్రయత్నించారట. అప్పుడు ఉద్ధవ్ వారి ఫోన్లను ఖాతరు చేయలేదట. ఫలితంగానే ఇప్పుడు ఉద్ధవ్ ప్రయత్నాలను బీజేపీ ముఖ్య నేతలు లైట్ తీసుకున్నారని టాక్!