ఆయుర్వేదం మందుతో ఆనందయ్యకు వచ్చిన పేరుని క్యాష్ చేసుకోడానికి చాలామంది వ్యక్తులు, సంస్థలు ప్రయత్నిస్తూనే ఉన్నాయి. ఆయనకు జరుగుతున్న వరుస సన్మానాలే దీనికి నిదర్శనం. చోటా మోటా నాయకులు సైతం ఓ శాలువా, దండ తీసుకెళ్లి ఆనందయ్యకు ఇచ్చేసి హడావిడి చేసి, ఫొటోలు తీసుకొని ఫ్లెక్సీలు కట్టుకుంటున్నారు.
ఆనందయ్య అడగకపోయినా.. మందు తయారీకి అవసరమైన సరకులిస్తామంటూ దాతలు క్యూ కడుతున్నారు. మిక్సీలు, గ్రైండర్లు, ఇతర సామగ్రి స్పాన్సర్ చేస్తూ ఫొటోలు దిగుతూ ఉచిత ప్రచారం చేసుకుంటున్నారు. తాజాగా ఓ సంస్థ ఆయనకి డాక్టరేట్ ఇచ్చేసింది. ఈ డాక్టరేట్ ని ఆనందయ్య ఏంచేసుకుంటారో తెలియదు కానీ, ఇప్పుడిదో సెన్సేషన్ అయింది.
ఆయుర్వేద శిఖామని, ఆయుర్వేద రత్న అంటూ ఇప్పటికే పలు సంస్థలు ఆనందయ్యకు బిరుదులిచ్చేసి, సన్మాన కార్యక్రమాలు ప్లాన్ చేస్తున్నాయి. ఆనందయ్యకు సత్కారం అనే పేరుతో ఫండ్ రైజింగ్ కూడా నెల్లూరులో భారీగా జరుగుతోంది. ఆయుర్వేదం మందు తయారు చేయడంలో ఆయన బిజీగా ఉంటే.. సన్మానాలతో చాలామంది ఆయన పని చెడగొడుతున్నారనడంలో అతిశయోక్తి లేదు.
ఇక కులసంఘాల హడావిడి చెప్పక్కర్లేదు. ఆనందయ్య మావాడే, మనవాడేనంటూ ఆల్రడీ ప్రచారం హోరెత్తిపోయింది. ఆయన పేరుతో ఫేస్ బుక్ పేజీలు, ఫ్యాన్ పేజీలు బాగా పాపులర్ అవుతున్నాయి. అన్నిటికంటే హైలెట్ ఏంటంటే.. సదరు సోషల్ మీడియా పేజీల్లో ఆయనకు భారతరత్న ఇవ్వాలనే డిమాండ్ ఊపందుకోవడం. దీని కోసం మద్దతు కూడగడుతున్నారు ఆయా పేజీల నిర్వాహకులు.
ఆనందయ్య పేరుకి ఆయన ఫొటోకి ఇప్పుడు బాగా డిమాండ్ పెరిగిపోయింది. ఆనందయ్య పేరుతో పంపిణీ అవుతున్న మందుపై తమ ఫొటోలు కూడా ముద్రించుకోడానికి పోటీ పడుతున్నారు చాలామంది. ఆనందయ్య మందు, ఫలానావారి సౌజన్యంతో.. ఇలా ప్లాస్టిక్ కవర్లు, గిఫ్ట్ ప్యాక్ ల ఆర్డర్ బాగా పెరిగిపోయింది.
వాడుకున్నోళ్లకి వాడుకున్నంత..
ఆనందయ్య పేరుని సోషల్ మీడియా కూడా బాగానే వాడుకుంది. ఆ పేరుతో గూగుల్ లో సెర్చ్ చేస్తే వేలాది వీడియోలు, ఆర్టికల్స్ కనపడుతున్నాయి. అందులో అసరు మేటర్ కంటే.. కల్పితమే వాటిలో ఎక్కువగా కనిపిస్తుంది. మొత్తానికి నెల్లూరు జిల్లాలో ఆనందయ్య పేరు వాడుకున్నోళ్లకి వాడుకున్నంతగా తయారైంది.