మెగాస్టార్, పవర్ స్టార్, మాస్ మహారాజా, నందమూరి నటసింహం, కింగ్…వీళ్లంతా టాలీవుడ్ సీనియర్ హీరోలు. ఈ జనరేషన్ హీరోలతో చూసుకుంటే చాలా బిజీగా సినిమాలు చేస్తున్నారు. వీరిలో ఒక్క పవన్ తప్ప మిగిలిన వారంతా చకచకా సినిమాలు చేస్తున్నవారే. ఒక సినిమా సెట్ మీద.. మరో సినిమా ప్రీ ప్రొడక్షన్ లో.. ఇంకో సినిమా ప్లానింగ్ లో, ఆపై సినిమా డిస్కషన్ లో వుంచుతున్నవారే.
వీళ్లలో మెగాస్టార్, పవర్ స్టార్, నందమూరి బాలయ్య సినిమాలు అన్నీ 100 కోట్ల థియేటర్ రేంజ్ లో మార్కెట్ చేస్తున్నారు. ఆంధ్ర, సీడెడ్, నైజాం, ఓవర్ సీస్ అన్నీ కలిపి 100 కోట్లకు పైగా వస్తోంది. రవితేజ మార్కెట్ 60 కోట్ల వరకు వుంది. నాగార్జున మార్కెట్ గురించి పెద్దగా మాట్లాడుకునే పని లేదు ఇక్కడ.
కానీ రెమ్యూనిరేషన్ల దగ్గరకు వచ్చేసరికి చాలా తేడా కనిపిస్తోంది. పైకి అధికారికంగా ఎవరూ చెప్పకపోయినా టాలీవుడ్ లో అంకెలు వినిపిస్తూనే వుంటాయి. అది బహిరంగ రహస్యం. కింగ్ నాగార్జున రెమ్యూనిరేషన్ పది కోట్లకు అటు ఇటుగానే వుంది.
రవితేజ రెమ్యూనిరేషన్ 20 కోట్ల నుంచి 22 కోట్ల వరకు వుంది.
పవన్ కళ్యాణ్ తన లేటెస్ట్ బ్రో సినిమాకు 60-65 కోట్ల మధ్యలో తీసుకుని, పాతిక శాతం లాభాల్లో వాటా పెట్టుకున్నారని వార్తలు వున్నాయి. సరే, లాభాలు రాలేదు అనుకున్నా 65 కోట్ల రెమ్యూనిరేషన్ అయితే ఫిక్స్.
మెగాస్టార్ తన వాల్తేర్ వీరయ్య సినిమాకు 55 కోట్ల రెమ్యూనిరేషన్ తీసుకున్నారని టాక్ వుంది. బోళాశంకర్ సినిమాకు దాన్ని 65 కోట్లు చేసారని టాలీవుడ్ లో వినిపిస్తోంది. ఈ 65 కోట్లకు ఇంకా చిన్న చిన్న ఖర్చులు అదనంగా వుంటాయి. అంటే 70 కోట్ల రెమ్యూనిరేషన్ అన్నమాట.
కానీ వీళ్లందరితో పోల్చుకుంటే, మార్కెట్ ను బేరీజు వేసుకుంటే నందమూరి నటసింహం బాలయ్య చాలా అంటే చాలా.. చాలా రీజనబుల్ గా రెమ్యూనిరేషన్ తీసుకుంటున్నట్లు. ఆయన ఇప్పటి వరకు తీసుకుంటున్న హయ్యస్ట్ రెమ్యూనిరేషన్ 18 కోట్లు మాత్రమే. ఇకపై చేసే సినిమాలకు మహా అయితే 20 నుంచి 22 కోట్లు వుండొచ్చు. కానీ థియేటర్ మార్కెట్ మాత్రం మెగా బ్రదర్స్ సినిమాలతో సమానంగా వుంది. అందుకే సినిమా యావరేజ్ అయినా బాలయ్య నిర్మాతలు హ్యాపీగా వుంటారు.