ఏలూరు ఎంపీ, వైసీపీ నాయకుడు కోటగిరి శ్రీధర్ రాజకీయంగా తీవ్ర నిరాశలో ఉన్నట్టు సమాచారం. రానున్న ఎన్నికలకు దూరంగా ఉండాలని కూడా శ్రీధర్ ఆలోచిస్తున్నట్టు ఆయన వర్గీయులు చెబుతున్నారు. వైసీపీలో తాను అనుకున్నట్టుగా ఏవీ జరగకపోవడమే నిరాశకు కారణమని సమాచారం.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ హయాంలో శ్రీధర్ తండ్రి విద్యాధరరావు మంత్రిగా పని చేశారు. ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఘనత విద్యాధరరావుది. 2008లో చిరంజీవి నేతృత్వంలోని ప్రజారాజ్యం పార్టీలో విద్యాధరరావు చేరారు. పీఆర్పీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన తర్వాత చిరంజీవి వెంటనే విద్యాధరరావు నడిచారు. చనిపోయే నాటికి కాంగ్రెస్‌లోనే ఆయన ఉన్నారు. తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకుని శ్రీధర్ రాజకీయాల్లోకి వచ్చారు.
2017లో వైఎస్ జగన్ సమక్షంలో శ్రీధర్ వైసీపీలో చేరారు. 2019లో ఏలూరు ఎంపీ టికెట్ దక్కించుకున్నారు. టీడీపీ సీనియర్ నేత మాగంటి బాబుపై శ్రీధర్ గెలుపొందారు. అన్నీ ఎమ్మెల్యేలు చూసుకుంటున్నారని, తన లోక్‌సభ పరిధిలో ఎంపీగా ఉనికే లేదనే ఆవేదన కోటగిరి శ్రీధర్‌లో ఉన్నట్టు సమాచారం. కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి గెలుపొందినా ఎలాంటి అధికారం లేనప్పుడు రాజకీయాల్లో ఎవరి కోసం, ఎందుకోసం ఉండాలనే నిరాశ, నిస్పృహ శ్రీధర్‌లో ఉన్నట్టు ఆయన వర్గీయులు చెబుతున్నారు.
చిన్నచిన్న విషయాల్లో కూడా ఎంపీగా ఏమీ చేసుకోలేని పరిస్థితి ఉందని ఆయన ఆవేదన చెందుతున్నట్టు సమాచారం. దీంతో రాజకీయాలకు దూరంగా ఉండాలనే దిశగా ఆయన ఆలోచనలు సాగుతున్నాయి. రానున్న రోజుల్లో ఆయన అడుగులు ఎటు వైపు పడనున్నాయో కాలమే జవాబు చెప్పాల్సి వుంది.