బుర్రలేనోళ్లకంతా శ్రీలంకే ఆదర్శం!

పొరుగుదేశం శ్రీలంక అతి భయంకరమైన సంక్షోభంలో ఉంది. ఆర్థికంగా ఆదేశం సర్వనాశనం అయిపోయి ఉంది. దేశ అధ్యక్షుడు.. దేశం విడిచి పారిపోయాడు. ఆయన కుటుంబ సభ్యులు కూడా ఇప్పుడు అక్కడ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…

పొరుగుదేశం శ్రీలంక అతి భయంకరమైన సంక్షోభంలో ఉంది. ఆర్థికంగా ఆదేశం సర్వనాశనం అయిపోయి ఉంది. దేశ అధ్యక్షుడు.. దేశం విడిచి పారిపోయాడు. ఆయన కుటుంబ సభ్యులు కూడా ఇప్పుడు అక్కడ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంతా నానా గందరగోళంగా ఉంది. పాలకుల స్థానంలో ఉన్నవారు.. పరారయ్యే దుస్థితి! ప్రజల్లో పెల్లుబుకుతున్న ఆగ్రహావేశాలు ఏ క్షణాన ఎలాంటి మలుపులు తీసుకుంటాయో ఎవ్వరికీ అర్థం కాకుండా ఉంది. అయితే శ్రీలంకలో చోటు చేసుకున్న పరిణామాలు మన తెలుగు రాష్ట్రాల్లో కొందరికి మాత్రం పండగ వాతావరణాన్ని కల్పిస్తున్నాయి. ప్రధానంగా విపక్ష నాయకులు.. శ్రీలంక పరిణామాలను ఆదర్శంగా తీసుకుని, రాజకీయ విమర్శల్లో చెలరేగిపోతున్నారు. 

శ్రీలంక పరిణామాలు విషమించిన తొలినాటినుంచి.. ఏపీలో విపక్ష నాయకుల నుంచి ఒక మాట చాలా తరచుగా వినిపిస్తూనే ఉంది. జగన్ పాలన ఇలాగే కొనసాగితే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా శ్రీలంక పరిస్థితి తప్పదు అనేదే ఆ మాట! తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడినా, జనసేన నాయకులు మాట్లాడినా.. ఆంద్రప్రదేశ్ రాష్ట్రం మరో శ్రీలంక అయిపోతోంది.. అనే మాట ఇటీవల తరచుగా వినిపిస్తోంది. 

వీరు మాత్రమే కాదు. పొరుగురాష్ట్రం తెలంగాణలో కూడా పరిస్థితి ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. అక్కడ బీజెపీ నాయకులూ, కాంగ్రెస్ నాయకులూ కూడా ఇదే పాట. తెలంగాణను మరో శ్రీలంకగా మార్చేస్తున్నాడు కేసీఆర్ అంటూ!

ఇంతకూ వీళ్లు ఎందుకిలా అంటున్నారంటే.. ఈ రెండు తెలుగు రాష్ట్రాలు.. విపరీతంగా అప్పులు చేస్తున్నాయని! దేశం మొత్తం మీద అప్పులు చేయకుండా ఏ రాష్ట్రం మనగలుగుతోంది..? ఈ ప్రశ్నకు వారివద్ద సమాధానం ఉందా? అంటే ఎవరూ చెప్పలేరేమో. అప్పులు అనే ఒక్క మాట పట్టుకుని.. రాష్ట్రాలు శ్రీలంకలా మారిపోతాయని అనేవాళ్లకి అసలు బుర్ర ఉన్నదా అనే సందేహం ప్రజలకు కలుగుతోంది. 

ఏపీ సర్కారు మీద కిట్టనివాళ్లు ఎన్ని నిందలు వేసినప్పటికీ.. జగన్ ప్రభుత్వం లక్షన్నర కోట్ల రూపాయలకు పైగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూనే.. చేసినదెల్లా ఎనిమిది లక్షల కోట్ల రూపాయల అప్పు! జరుగుతున్న సంక్షేమంతో పోలిస్తే.. ఈ అప్పు ఒక లెక్కలోనిది కాదు. తెలంగాణ కూడా పీకల్దాకా మునిగిపోనంత అప్పులు మాత్రమే చేస్తోంది. 

అయినా ఇక్కడ మరో సంగతి గమనించాల్సి ఉంది. ఒక రాష్ట్రం అప్పులు చేస్తే.. ఆ రాష్ట్రం మాత్రం శ్రీలంకలా మారిపోవడానికి అవకాశం ఉంటుందా? అనేది. ద్రవ్యోల్బణం, విదేశీ మారక నిలవలు పడిపోవడం, డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ దారుణంగా పడిపోవడం వంటి అనేక విషయాలు శ్రీలంక వంటి పరిస్థితికి కారణం అవుతాయి. అయితే అవన్నీ కూడా.. కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉండే విషయాలు.

కేంద్ర ప్రభుత్వం లక్ష కోట్ల రూపాయలకు పైగా అప్పులు తెచ్చి పాలన సాగిస్తోందంటూ ఒకవైపు విమర్శలు వస్తుండగా.. ప్రమాదం వస్తే గిస్తే.. యావత్ దేశానికి మొత్తం వస్తుంది గానీ.. ఒక్క రాష్ట్రం మాత్రం శ్రీలంక పరిస్థితికి చేరుకుంటుందా? ఎంత రాజకీయ కువిమర్శలు చేసినా సరే.. అంతగా బుర్ర లేకుండా చేస్తే ఎలా అని ప్రజలు అనుకుటున్నారు. ఏదో ఒకరకంగా బురద చల్లడానికి వీరికి శ్రీలంక ఆదర్శంగా కనిపిస్తోందని అంటున్నారు.