Advertisement

Advertisement


Home > Politics - Analysis

ముస్లింల ప్రసన్నానికి ప్రయత్నమే వద్దనుకున్నారా?

ముస్లింల ప్రసన్నానికి ప్రయత్నమే వద్దనుకున్నారా?

కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండగా.. దేశంలోని ముస్లింలలో సామూహికంగా ఆందోళన పెరిగిందన్న మాట వాస్తవం. కారణాలు ఏమైనా కావొచ్చు.. కేంద్రప్రభుత్వం తీసుకువచ్చిన కొన్ని కొత్త చట్టాలు, అమలు చేస్తున్న విధానాలు అచ్చంగా ముస్లిం సమాజాన్ని అణచివేయడానికి ఉద్దేశించినవి కానేకాదని వారు ఎన్నిరకాలుగా అయినా తమ చర్యలను సమర్థించుకోవచ్చు. కానీ.. ముస్లిం సమాజంలో ఒక భయవిహ్వల వాతావరణం నెలకొని ఉంది. ఆ భయానికి తోడు, బిజెపి పట్ల, కేంద్ర ప్రభుత్వం పట్ల ఒక రకమైన ద్వేషభావం కూడా వారిలో ప్రబలుతోంది. 

అయితే ముస్లింలలో బిజెపి పట్ల ఉండే ద్వేషాన్ని రూపుమాపడం సాధ్యం కాకపోయినా.. ముస్లిం సమాజంలో కొంత సానుకూలతను పెంపొందింపజేసుకోవడానికి బిజెపి ఉపరాష్ట్రపతి ఎన్నికలను ఒక మార్గంగా వాడుకుంటుందనే ప్రచారం ఇటీవల కొన్ని వారాల నుంచి ముమ్మరంగా జరుగుతోంది. వెంకయ్యనాయుడు పదవీకాలం పూర్తి కానున్న నేపథ్యంలో ఖాళీ కానున్న ఉపరాష్ట్రపతి స్థానంలో ముస్లింను కూర్చోబెట్టడం ద్వారా.. తమలో ముస్లింల పట్ల ద్వేషం లేదని.. తాము వారిని సరిగానే ఆదరిస్తున్నామనే సంకేతాలు ప్రజల్లోకి పంపడానికి బిజెపి భావిస్తున్నట్లు తొలుత వార్తలు వచ్చాయి. 

దానికి తగ్గట్టుగానే.. కేంద్రమంత్రి ముఖ్తార్ అబ్బాస్ నక్వీని రాజీనామా చేయించారు. ఆయన రాజ్యసభ పదవీకాలం పూర్తవుతున్న నేపథ్యంలోనే రాజీనామా చేయించినా.. ఆయనను వైస్ ప్రెసిడెంట్ చేస్తారని అంతా అనుకున్నారు. హిందూ వర్గాల్లో కూడా సానుకూలత ఉన్న ముస్లిం నేతగా నక్వీకి పేరుంది. ఆయన కాకపోయినా సరే.. ఉపరాష్ట్రపతి స్థానానికి బిజెపి పరిశీలించిన పేర్లుగా మరిన్ని ముస్లిం నేతలు తెరపైకి వచ్చారు. కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ పేరు కూడా వినిపించింది. నక్వీకి అవకాశం ఎక్కువని అంతా అనుకున్నారు. 

అయితే చివరకు పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్ ఖడ్ పేరును ఉఫరాష్ట్రపతికి ఎన్డీయే ప్రకటించింది. ఆయన రైతు బిడ్డ అని పేర్కొంది. ఇది రాజకీయ వర్గాల్లో అనూహ్య పరిణామం. ముస్లింలను దువ్వడానికి బిజెపి ఫోకస్ పెడుతోందని అనుకుంటున్న తరుణంలో ఇలా జరగడం చిత్రమే. 

అయితే.. దీనిపై రకరకాల విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ముస్లిం నేతకు ఉపరాష్ట్రపతి పదవి ఇచ్చినంత మాత్రాన ఆ వర్గం వారంతా తమ పార్టీని నెత్తిన పెట్టుకుంటారా? అనే సందేహం వారికి కలిగినట్లుంది. దానికి తోడు, ముస్లింకు ఇంత కీలక పదవి ఇస్తే.. తమ పార్టీని పిచ్చిగా ఆరాధించే హిందూ అతివాదులు దూరమయ్యే ప్రమాదం కూడా ఉందని వారు భయపడ్డట్లున్నారు. ఈ కారణాల నేపథ్యంలోనే.. ముఖ్తార్ అబ్బాస్ నక్వీకి ఆకుదాకా వచ్చిన అవకాశం నోటికి అందకుండా పోయిందనే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?