అప్పుడూ ఏడుపే.. ఇప్పుడూ ఏడుపేనా పచ్చ మీడియా?

బాధ కలిగినప్పుడు, కష్టం వచ్చినప్పుడు ఏడిచేవాళ్లని ఊరడించవచ్చు. కానీ.. ఏ కష్టమూ రాకపోయినా, ఏ బాధా లేకపోయినా.. సాధారణంగా జీవితం గడిచిపోతున్నా సరే.. అందులో ఏదో ఒక పాయింటు పట్టుకుని.. దాని గురించి అదేపనిగా…

బాధ కలిగినప్పుడు, కష్టం వచ్చినప్పుడు ఏడిచేవాళ్లని ఊరడించవచ్చు. కానీ.. ఏ కష్టమూ రాకపోయినా, ఏ బాధా లేకపోయినా.. సాధారణంగా జీవితం గడిచిపోతున్నా సరే.. అందులో ఏదో ఒక పాయింటు పట్టుకుని.. దాని గురించి అదేపనిగా ఏడ్చేవారిని ఏం చేయగలం? వారిని ఊరడించనూ లేం! వారి ఖర్మ అంతే అని వదిలేయాల్సిందే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పచ్చమీడియా పరిస్థితి కూడా అచ్చంగా అలాగే కనిపిస్తోంది. మద్యం షాపుల నిర్వహణ వ్యవహారాన్ని గతంలో ఉన్న మాదిరిగానే మళ్లీ ప్రెవేటు వాళ్లకు కేటాయించాలని ప్రభుత్వం ఆలోచన చేస్తుండగా దానిపై పచ్చ మీడియా ముందస్తుగానే నానా యాగీ చేయడం మొదలుపెట్టింది. ఆరున్నొక్క శోకాలు పెడుతోంది.

తమాషా ఏమిటంటే.. ఇదే పచ్చ మీడియా.. మద్యం దుకాణాల నిర్వహణను ప్రభుత్వం తమ చేతిలోకి తీసుకున్నప్పుడు ఇంతకంటె ఎక్కువగా శోకాలు పెట్టింది. 

మద్యం వ్యాపారం అనేది ఖచ్చితంగా ఏ ప్రభుత్వానికైనా అతిపెద్ద ఆదాయ వనరు! ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతి నాయకుడూ.. జనాలను తాగించడం ద్వారా ప్రభుత్వం డబ్బు సంపాదించాలనుకుంటోంది అంటూ సుద్దులు వల్లించేవాళ్లే. తాము అధికారంలోకి వచ్చారంటే ఆ సుద్దులన్నీ మరచిపోతారు. యథారీతిగా మద్యం వ్యాపారంలోనే నిమగ్నం అయిపోతారు. అయితే.. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇతరుల కంటె చాలా బెటర్. సంపూర్ణంగా కాకపోయినా,  మద్యనిషేధానికి ప్రజలకు హామీ ఇచ్చిన జగన్.. అధికారంలోకి రాగానే.. ఆ దిశగా ఒక అడుగు వేశారు. రాష్ట్రంలో దుకాణాల సంఖ్యను బాగా తగ్గించారు. దుకాణాల నిర్వహణను ప్రభుత్వమే చేపట్టింది. ఇదంతా ఒక పద్ధతిలో జరుగుతోంది. 

ఇదిలా ఉండగా.. మద్యం దుకాణాల్ని తిరిగి ప్రెవేటు వ్యక్తులకే అప్పగించడానికి ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇవి నిజమే కావొచ్చు కూడా. ప్రభుత్వమే నిర్వహించినా, ప్రెవేటు వారికి అప్పగించినా.. ప్రభుత్వ ఖజానాకు ఆదాయమార్గాలను అన్వేషించడం మాత్రమే వారి లక్ష్యంగా ఉంటుంది. అలాంటి నేపథ్యంలో దీనిని తప్పుపట్టాల్సిన అవసరం లేదు. ఆ మాటకొస్తే.. నిన్న మొన్నటిదాకా జగన్ మీద బురద చల్లడానికి ప్రయత్నించే వాళ్లంతా.. ప్రభుత్వం అంటే రాష్ట్ర అభివృద్ధికి సరైన పరిపాలన అందించాలిగానీ.. ఈ లిక్కరు వ్యాపారాల వంటివి ఎందుకు చేయాలి? శ్రద్ధ మొత్తం పాలన మీద పెట్టాలి కదా అని వాదించిన వాళ్లే. ఇప్పుడు లిక్కరు వ్యాపారాన్ని ప్రెవేటుకు అప్పగిస్తుండగా.. రివర్సులో మాట్లాడుతున్నారు. 

కానీ.. జగన్ ప్రభుత్వం.. మూడేళ్ల పాటూ ప్రభుత్వం ద్వారా లిక్కర్ వ్యాపారాన్ని నిర్వహించి.. ఇప్పుడు ప్రెవేటు వారికి అప్పగించడం వలన ఒక మేలు జరుగుతుంది. లిక్కర్ వ్యాపారంలో దొంగలెక్కలు చూపించి.. ప్రభుత్వానికి రాబడిని ఎగ్గొట్టే మాయోపాయాలు అనేకం నడుస్తూ ఉంటాయి. సిండికేటెడ్ గా ఉండే వ్యాపారులు ఈ రకమైన అక్రమమార్గాల ద్వారా.. ప్రభుత్వానికి రాబడిగా రావాల్సిన సొమ్మును ఎగ్గొట్టే మార్గాలు అనేకం అన్వేషిస్తుంటారు. జరిగిన వ్యాపారాన్ని తక్కువ చేసి చూపిస్తుంటారు. అయితే.. ఇప్పుడు మూడేళ్లు ప్రభుత్వమే నిర్వహించడం వలన.. ఎంత మోతాదులో వ్యాపారం ఉంటుందో ప్రభుత్వానికి ఒక అవగాహన ఏర్పడి ఉంటుంది. ప్రెవేటు వ్యాపారులు ఇక ప్రభుత్వాన్ని మోసం చేయడం కష్టం అవుతుంది. ఆ రకంగా ప్రభుత్వానికి లాభమే జరుగుతుంది. 

బురద చల్లడమే ధ్యేయంగా జీవించేవాళ్లు.. ప్రభుత్వం ఏం చేసినా సరే.. ఏదో ఒక రకమైన రంగు పులమడానికే ప్రయత్నిస్తుంటారనేది వింతేమీ కాదు. ఈ విషయం కూడా అలాంటిదే!!