ఉపరాష్ట్రపతి పదవికి ‘నాన్ నాయుడు’ అభ్యర్థిని ఎంపిక చేసేసారు. రాష్ట్రపతి అభ్యర్థి పేరు వెల్లడి కాకముందు ‘నాయుడు’ కే చాన్స్ అంటూ కథనాలు వండివార్చారు. ఆ ముచ్చట అయిపోయంది.
ఉపరాష్ట్రపతిగా కనీసం ఎక్స్ టెన్షన్ ఇస్తే బాగుండును అని వెంకయ్య నాయుడు అనుకున్నారో లేదో కానీ ఆయనను అభిమానించే వర్గం మాత్రం కాస్త దింపుడు కళ్లం ఆశలు పెంచుకుంది. ఆ మేరకు గడచిన రెండు మూడు రోజుల్లో మళ్లీ అదే టైపు కథనాలు వండి వార్చారు.
మోడీ-జగన్ బంధం క్లియర్ గా తెలిసిన తరువాత, ఇటీవలే క్లారిటీ వచ్చిన తరవాత కూడా ఇలాంటి ఆశలు ఎలా పెట్టుకున్నారో వారికే తెలియాలి. ఆగస్టు తరువాత చూడండి అసలు సినిమా అని వైకాపా నాయకులు తమ తమ అంతర్గత చర్చల్లో చెబుతూనే వున్నారు.
ఆగస్టు తరువాత పరిస్థితులు ఎలా అనుకూలం అవుతాయో వారికే తెలియాలి. ఎందుకంటే వెంకయ్య నాయుడు ఉపరాష్ట్రపతిగా వున్నంత మాత్రాన కేంద్రంలో భాజపా నిర్ణయాలను ప్రభావితం చేసే ప్రయత్నం అయితే చేసినట్లు కనిపించలేదు.
అలా చేసి వుంటే మోడీ-జగన్ బంధం ఇంతలా వికసించి వుండేది కాదు. అందువల్ల మరో దఫా ఆయనకు అవకాశం ఇచ్చి వున్నా జగన్ కు ఏమంత ఇబ్బంది వుండదు. కానీ ఢిల్లీ స్థాయిలో తనకు ఏ అడ్డంకులు, ఏ మాత్రం లేకుండా వుండాలని జగన్ భావిస్తున్నట్లుంది. అందుకే తన పార్టీ మద్దతు కావాలంటే తనకు ఎవరు ఎవరు పనికి రారో జగన్ ముందే భాజపా అధిష్టానం ముందు జాబితా వుంచేసినట్లు బోగట్టా.
ఇవన్నీ రాజకీయ వర్గాల్లో గత ఆరు నెలలుగా వినిపిస్తున్న వార్తలే. ఈ వార్తల సంగతి తెలిసీ వెంకయ్య నాయడు కు ఎక్స్ టెన్షన్ దొరుకుతుందని ఏ రేంజ్ లో ఆశపెట్టుకున్నట్లో? పైగా ఇటీవలే దక్షిణాది రాష్ట్రాలకు చెందిన నలుగురికి రాజ్యసభ సభ్యత్వాలు కట్టబెట్టినపుడే క్లారిటీ వచ్చేసింది. ఇక అలాంటి చాన్స్ మరి వుండదని. ఇప్పుడు అదే నిజమైంది.
ఇంతకీ వైకాపా అనుకుంటున్న ఆగస్టు టార్గెట్ పూర్తయినట్లేనా? ఇంకా ఏమైనా మిగిలి వుందా?