రీల్ స్టోరీని మించిన రియ‌ల్ ల‌వ్ స్టోరీ

ఇది క‌థ కాని క‌థ‌. ఇదో వింత ప్రేమ క‌థ‌. రీల్ స్టోరీని మించిన రియ‌ల్ ల‌వ్ స్టోరీ. కేర‌ళ‌లోని పాల‌క్క‌డ్ జిల్లా నెమ్మ‌ర పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలోని అయిరూర్ గ్రామం కేంద్రంగా ఈ ప్రేమ…

ఇది క‌థ కాని క‌థ‌. ఇదో వింత ప్రేమ క‌థ‌. రీల్ స్టోరీని మించిన రియ‌ల్ ల‌వ్ స్టోరీ. కేర‌ళ‌లోని పాల‌క్క‌డ్ జిల్లా నెమ్మ‌ర పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలోని అయిరూర్ గ్రామం కేంద్రంగా ఈ ప్రేమ క‌థ న‌డిచింది. ఈ ప్రేమ క‌థ గురించి తెలుసుకోవాలంటే ఓ 11 ఏళ్లు వెన‌క్కి వెళ్లాలి. ఆ గ్రామానికి చెందిన 18 ఏళ్ల యువ‌తి, త‌న ఇంటికి స‌మీపంలోని ఓ అబ్బాయి మ‌న‌సులు క‌లిశాయి. క‌లిసి జీవితాన్ని పంచుకోవాల‌ని అనుకున్నారు. అయితే కుటుంబ స‌భ్యులు ఒప్పుకోర‌ని భ‌య‌ప‌డ్డారు.

ఓ రోజు ఆ అమ్మాయి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. ఎక్క‌డికి పోయిందో, ఏమైందో తెలియ‌లేదు. అస‌లు బ‌తికే ఉందనే ఆశ‌ను కూడా వ‌దులుకున్నారు. అయితే ఆ అమ్మాయి స‌ద‌రు ప్రేమికుడికి చెందిన ఒక గ‌దిలో గ‌త 11 ఏళ్లుగా ఉంటోంది. మూడో కంటికి ఈ విష‌యం తెలియ‌దు. ఇంటి వాకిలికి బ‌య‌ట తాళాలు వేసే ఉంటాయి. అమ్మాయి ఇంటికి స‌మీపంలోనే అబ్బాయికి చెందిన ఆ గ‌ది ఉండ‌డం ఇక్క‌డ ప్ర‌త్యేకంగా చెప్పుకోవాలి.

ఆ సింగిల్ రూంలో అమ్మాయి ఉన్న విష‌యం ఆ ప్రేమికుడి కుటుంబ స‌భ్యుల‌కు కూడా తెలియ‌క‌పోవ‌డం విచిత్రంగా తోస్తోంది. అమ్మాయి యోగ‌క్షేమాల‌న్నీ గ‌త 11 ఏళ్లుగా అత‌నే చూసుకుంటున్నాడు. ఆహారం, ఇత‌ర‌త్రా సౌక‌ర్యాల‌ను ఎలాంటి ఇబ్బంది లేకుండా స‌మ‌కూర్చుతున్నాడు. ఆ గ‌దికి అటాచ్డ్ బాత్‌రూం లేక‌పోవ‌డం ఒకింత వింత‌ల్లో కెల్లా వింత‌. గ‌దికి ఉన్న కిటికీ ద్వారా రాత్రివేళ‌ ఆరుబ‌య‌టికి వెళ్లి కాల‌కృత్యాలు తీర్చుకునేది. ప‌గ‌టి వేళ కిటికీ మూసేసేవాళ్లు.

మూడు నెల‌ల క్రితం ఆ ప్రేమికుడు కూడా అదృశ్య‌మ‌య్యాడు. దీంతో కుటుంబ స‌భ్యులు నెమ్మ‌ర పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. పోలీసులు వెతుకులాట మొద‌లు పెట్టారు. చివ‌రికి అదృశ్య‌మైంది యువ‌కుడు మాత్ర‌మే కాదు, యువ‌తి కూడా అని పోలీసులు గుర్తించారు. 11 ఏళ్ల క్రితం క‌నిపించ‌కుండా పోయిన అమ్మాయితో స‌ద‌రు యువ‌కుడు నెమ్మ‌ర స‌మీపంలోని విథాన్‌న్సెనీ అనే కుగ్రామంలో అద్దె ఇంట్లో కాపురం పెట్టిన‌ట్టు క‌నిపెట్టారు.

ఆ జంట‌ను అదుపులోకి తీసుకుని కోర్టుకు హాజ‌రుప‌రిచారు. గ‌త ప‌దేళ్ల‌లో ఏం జ‌రిగిందో ఆ జంట వెల్ల‌డించారు. దీంతో ఆ ఊరే కాదు, యావ‌త్ లోక‌మే ఆశ్చ‌ర్య‌పోతోంది. తాము క‌లిసి జీవించాల‌ని అనుకుంటున్న‌ట్టు యువ‌తి కోర్టుకు తెలిపింది. దీంతో వాళ్లిద్ద‌రు క‌లిసి జీవ‌న ప్ర‌స్థానం సాగించేందుకు కోర్టు పచ్చ జెండా ఊపింది. కొంగొత్త ఆశ‌ల‌తో ప్రేమ జీవితాన్ని పండించుకు నేందుకు ఆ జంట ముందుకు క‌దిలింది.