రాహుల్ గాంధీకి సన్నిహితుడుగా పేరు పొందిన మరో నేత కాంగ్రెస్ ను వీడారు. కాంగ్రెస్ హయాంలో కేంద్రంలో మంత్రి పదవిని అనుభవించిన ఇంకో నేత బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనే యూపీకి చెందిన జితిన్ ప్రసాద. రాహుల్ కోటరీలో మాజీ సభ్యుడు. బీజేపీ తీర్థం పుచ్చుకుని ఆ పార్టీ ముఖ్య నేతలతో సమావేశాలు నిర్వహించిన జితిన్, తన రాజకీయ జీవితంలో నూతన అధ్యాయం మొదలైందని అంటున్నాడు.
యూపీ వ్యవహారాలను ప్రియాంక చేపట్టాకా జితిన్ కు అక్కడ బాగా ప్రాధాన్యత తగ్గిందని, రాహుల్ కు సన్నిహితుడు అయిన జితిన్ ప్రియాంక ఆధ్వర్యంలో పని చేయలేకపోయాడని.. ఎలాగూ యూపీలో కాంగ్రెస్ కోలుకునేది లేదనే లెక్కలతో ఆయన కాంగ్రెస్ ను వీడాడనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
యూపీ ఎన్నికల నేపథ్యంలో ఇలాంటి చేరికలను చూపడానికి బీజేపీ కూడా ఉత్సాహంగా ఉండవచ్చు. అందుకే ఆయనకు లైన్ క్లియర్ అయి ఉండవచ్చు. ఈ జితిన్ ప్రసాద 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ఎంపీగా పోటీ చేసి, ఓడిపోయారు.
ఇక ఈ పరిణామంపై కొందరు విశ్లేషిస్తూ కాంగ్రెస్ పోకడను, రాహుల్ తీరును మరొకసారి విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ కు పూర్తి స్థాయి నాయకత్వం అవసరమని లేఖ రాసిన వారిలో జితిన్ కూడా ఒకరని, అలా పార్టీ కోసం పనిచేసే ఉద్దేశం ఉన్న నేతలను కాంగ్రెస్ దూరం చేసుకుందనే విశ్లేషణ వినిపిస్తూ ఉంది. అయినా కాంగ్రెస్ తీరును విశ్లేషించడం అంటే.. కందకు లేని దురద కత్తి పీటకు ఉండటం లాంటిది! ప్రతిపక్ష పాత్ర అంటే కేవలం ట్వీట్లు చేయడం మాత్రమే అనే దుస్థితికి చేరింది కాంగ్రెస్ పార్టీ.
జాతీయాధ్యక్షురాలు హోదాను తాత్కాలికం పేరుతో మళ్లీ తన దగ్గరే అట్టిపెట్టుకున్న సోనియా పార్టీని ఏరోజుకారోజు నాశనం చేస్తూ పోతున్నారు. ఇక రాహుల్ నిర్వేదంలో ఉన్నాడో, తనకెందుకని అనుకుంటున్నాడో చెప్పగలిగేవారు ఎవరూ లేరు.
ఇలాంటి నేపథ్యంలో ఇంకొకరు రాజీనామా చేసి వెళ్లారు. అయినా.. నిండా మునిగాకా ఇలాంటి రాజీనామాలు చలిపుట్టిస్తాయనుకోవడం మీడియా అపోహ. కప్పల్లాంటి నేతలను చేర్చుకోవడానికి బీజేపీ ఆలోచించుకోవాలి కానీ, ఇలాంటి పరిణామాలతో కాంగ్రెస్ కు కొత్తగా పోయేందుకు ఏమీ లేదు, అది కూడా యూపీలో కాబట్టి.