ఎన్నికలకు ముందేమో.. బీభత్సమైన రేంజ్ లో, దుమ్మురేపుతామనే స్థాయిలో హంగామా చేసిన పశ్చిమ బెంగాల్ బీజేపీ, తీరా ఎన్నికల తర్వాత కామెడీ అయిపోతోంది. బెంగాల్ లో ప్రభంజనం సృష్టిస్తుందనే అంచనాలను, భక్తుల భజన సంకీర్తనలను అందుకున్న కమలం పార్టీ, తీరా ఎన్నికలు కాగానే అక్కడ వాడిపోయింది.
ఏ చేరికలను అయితే చూపి బీజేపీ .. అక్కడ భూకంపం పుట్టిస్తుందని అని చెప్పుకుందో, ఇప్పుడు అవే ఇప్పుడు ఆ పార్టీలో ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. వచ్చినప్పుడు ఎంతో కీలకమైన నేతలుగా చెప్పుకున్న వారు ఎన్నికల్లో చిత్తయ్యారు. ఇప్పుడు వారంతా తిరిగి టీఎంసీ బాట పడుతూ ఉండటంతో బెంగాల్ లో బీజేపీ పరిస్థితి మరింత ప్రహసనంగా మారుతూ ఉంది.
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు చాలా ముందుగానే.. ముకుల్ రాయ్ ను బీజేపీ చేర్చుకుంది. టీఎంసీలో నంబర్ టూ గా పేరు పొందిన ముకుల్ రాయ్ కమలం తీర్థం పుచ్చుకోవడాన్ని జాతీయ మీడియా ఒక రేంజ్ లో హైలెట్ చేసింది. రాయ్ వీడటంతోనే మమత పని అయిపోయిందనేంత రీతిలో అప్పట్లో విశ్లేషణలు సాగాయి.
ఈ అంశం గురించి లెక్కకు మించి కథనాలు, విశ్లేషణలు అప్పట్లో వినిపించాయి. ఆయనను చేర్చుకున్న బీజేపీ తన సిద్ధాంతాలను కూడా పక్కన పెట్టి.. వెంటనే ఆయనను బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడిని చేసేసింది! ముకుల్ రాయ్ తర్వాత మరెంతో మంది టీఎంసీ నేతలు వరస పెట్టి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పుడు వారంతా బోరుమంటున్నారు. దీదీ..దీదీ.. అంటూ కలవరిస్తున్నారు. కొందరైతే మళ్లీ బీజేపీని బహిరంగంగా తిట్టడం ప్రారంభించారు.
నారద స్కామ్ లో ఇటీవలి స్పందిస్తూ.. టీఎంసీపై బీజేపీ కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడుతూ ఉందని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ పరిణామాలతో తాము బీజేపీకి దూరం అవుతున్నట్టుగా కూడా కొందరు ప్రకటించేశారు. ఇప్పుడు ముకుల్ రాయ్ మీద కూడా అలాంటి కథనాలే వస్తున్నాయి. చేర్చుకున్నప్పుడు అహా..ఓహో..ల మధ్యన ఆయనను చేర్చుకున్న బీజేపీ, ఈ పరిస్థితుల్లో ఆయన తిరిగి టీఎంసీలోకి వెళ్లిపోకుండా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
ముకుల్ రాయ్, ఆయన భార్య కరోనాకు గురి కావడంతో.. వారిని అభిషేక్ బెనర్జీ పరామర్శించినట్టుగా వార్తలు వచ్చిన నేపథ్యంలో కమలదళంలో కదలిక మొదలైంది. వెంటనే బీజేపీ నాయకులు వరస పెట్టి ముకుల్ రాయ్ ను పరామర్శిస్తున్నారట. బెంగాల్ బీజేపీ విభాగం అధ్యక్షుడుతో సహా ప్రధానమంత్రి నరేంద్రమోడీ కూడా రాయ్ ను ఫోన్లో పరామర్శించారట. మరోవైపు రాయ్ త్వరలోనే తిరిగి టీఎంసీ తీర్థం పుచ్చుకుంటారనే ఊహాగానాలు మాత్రం గట్టిగా సాగుతున్నాయి.