చిత్తూరు జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిపై సొంత పార్టీ ప్రజాప్రతినిధులు గుడ్లురుముతున్నారు. దీనికంతటికి ఆనందయ్య మందు పంపిణీనే కారణం. నెల్లూరు జిల్లా కృష్ణపట్నం నివాసి ఆనందయ్య తయారు చేస్తున్న ఆయుర్వేద మందు కరోనా నివారణకు ఎంతో బాగా పనిచేస్తోందని బాధితుల అభిప్రాయాలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి.
అసలే ప్రైవేట్, కార్పొరేట్ వైద్యానికి ఖర్చులు భరించలేకపోవడంతో పాటు లక్షలాది రూపాయలు ధారపోసినా ఫలితం లేని పరిస్థితిలో ఆనందయ్య ఔషదం భరోసా కల్పించింది. ఈ నేపథ్యంలో ఆనందయ్య మందు జనానికి ఓ సంజీవనిలా కనిపించింది.
వివిధ కారణాలతో ఆనందయ్య మందు పంపిణీని ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది. అయితే మందు తయారీ, దాని ప్రయోజనాల గురించి తెలుసుకునేందుకు చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆసక్తి చూపారు. అంతేకాదు, ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే, టీటీడీ తరపున తయారు చేయించి పంపిణీ చేస్తామని ఆయన ప్రకటించారు. కానీ ప్రభుత్వం నుంచి అనుమతి లభించినా, ప్రభుత్వం పంపిణీ చేయడానికి ముందుకు రాలేదు.
జనాల్లో మందుపై ఉన్న నమ్మకాన్ని, విశ్వాసాన్ని పరిగణలోకి తీసుకున్న చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి సొంత చొరవతో తన నియోజక వర్గ ప్రజలకు పంపిణీ చేసేందుకు ముందుకొచ్చారు. ఈ నేపథ్యంతో ఆనందయ్య కుమారుడు, శిష్య బృందంతో తన నియోజక వర్గంలో మందు తయారీ చేపట్టారు.
కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో ఆనందయ్య మందు పంపిణీ చేసే వాళ్ల పట్ల సహజంగానే జనంలో సానుకూల అభిప్రాయ ఏర్పడుతుంది. ఒక రాజకీయ నాయకుడిగా, భవిష్యత్‌లో మరింతగా ఎదగాలనే పట్టుదల, ఆకాంక్ష ఉన్న చెవిరెడ్డి, జనాభిప్రాయం మేరకు అడుగులు ముందుకేశారు.
అయితే ఆంధ్రప్రదేశ్‌లో 151 ఎమ్మెల్యేలు, 22 మంది పార్లమెంట్ సభ్యులున్న అధికార పార్టీలో చెవిరెడ్డి మాదిరిగా చొరవ చూపు తున్న వాళ్లు దాదాపు లేరనే చెప్పాలి. ఇదే అధికార పార్టీ ప్రజాప్రతినిధులపై జనంలో అసంతృప్తికి కారణమవుతోంది. ఇది చిత్తూరు జిల్లాలో మరింత ఎక్కువ కనిపిస్తోంది. ఎందుకంటే పొరుగునే ఉన్న ఎమ్మెల్యే చేస్తున్న మంచి పని, తమ ఎమ్మెల్యే ఎందుకు చేయలేదనే ప్రశ్న తలెత్తుతోంది.
దీంతో చెవిరెడ్డిపై సొంత పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు లోలోపల ఆగ్రహంగా ఉన్నారు. అనవసర తలనొప్పులు తీసుకొస్తున్నారనే అభిప్రాయాలు అధికార పార్టీ ఎమ్మెల్యేల నుంచి వ్యక్తమవుతున్నాయి. ఈ పరంపరలో కొందరు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు తాము కూడా ఆనందయ్య మందు తయారీకి ముందుకొస్తున్నట్టు తెలుస్తోంది. కరోనాకు మందు సంగతేమో గానీ, తమపై జనంలో నెలకున్న అసంతృప్తి పోగొట్టేందుకు మందు ఎలా? అనేది ఇప్పుడు చిక్కు ప్రశ్నగా మిగిలింది.