తిరుపతి జిల్లా సూళ్లూరుపేట సిట్టింగ్ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యను రానున్న ఎన్నికల్లో వైసీపీ అధిష్టానం మార్చనుందా? అంటే ఔననే సమాధానం వస్తోంది. రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన సంజీవయ్య తనలోని అసలు రూపాన్ని బయట పెట్టుకున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎన్నికల ముంగిట నియోజకవర్గంలో ఆయన ఎక్కడికెళ్లినా సొంత పార్టీ నేతల నుంచే తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. సంజీవయ్యను ఇటీవల వైసీపీ మహిళా ఎంపీటీసీ నేరుగానే కడిగి పారేయడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఈ నేపథ్యంలో వివిధ సర్వే నివేదికల్లో సంజీవయ్యపై తీవ్ర వ్యతిరేకత ఉన్నట్టు తేలింది. దీంతో ఆయన్ను పక్కన పెట్టకపోతే టీడీపీని తమ నాయకులే గెలిపించేట్టు ఉన్నారని అధికార పార్టీ భయపడుతోంది. ఇందులో భాగంగా వైసీపీ నాయకుడు, ప్రముఖ నేత్ర వైద్యుడు డాక్టర్ ఎన్.గోపినాథ్ పేరును వైసీపీ అధిష్టానం పరిశీలిస్తోందని సమాచారం. ఈయనకు సూళ్లూరుపేట నియోజకవర్గంతో పాటు సమీప నియోజకవర్గాలైన శ్రీకాళహస్తి, వెంకటగిరిలో కూడా సేవా వైద్యుడిగా మంచి పేరు వుంది.
గత 20 ఏళ్లుగా తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో డాక్టర్ గోపినాథ్ 25 వేల కంటి ఆపరేషన్లను ఉచితంగా చేశారు. పేదల వైద్యుడిగా, నెమ్మదస్తుడిగా ఆయనకు పేరుంది. దళిత సామాజిక వర్గానికి చెందిన ఈయనపై సూళ్లూరుపేట నియోజకవర్గంలోని వైసీపీ నాయకులంతా సానుకూలంగా ఉండడం కలిసొచ్చే అంశంగా చెబుతున్నారు. సర్వే నివేదికల్లో డాక్టర్ గోపినాథ్‌కు సానుకూలంగా ఉన్నట్టు తెలిసింది.
ఎమ్మెల్యే సంజీవయ్యకు మరోసారి టికెట్ ఇస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ చేసేది లేదని ఇప్పటికే సీఎం వైఎస్ జగన్‌కు వైసీపీ నేతలు తేల్చి చెప్పారు. మరోవైపు సంజీవయ్యకు వ్యతిరేకంగా నివేదికలుండడంతో ఆయన్ను పక్కన పెట్టేందుకే సీఎం సిద్ధమయ్యారు. డాక్టర్ గోపినాథ్ వద్దకు ఆ నియోజకవర్గంలోని వైసీపీ నాయకుల రాక పెరిగినట్టు సమాచారం. డాక్టర్ గోపినాథే తమ అభ్యర్థి అని వైసీపీ నేతలు ప్రచారం చేస్తుండడం గమనార్హం.