వరద బాధితులను పరామర్శించేందుకు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సిద్ధమయ్యారు. ఆమె వరద బాధితులను నేరుగా కలిసి కష్టసుఖాలను తెలుసుకోనున్నారు.
ఇదే సందర్భంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఏరియల్ సర్వే చేపట్టేందుకు నిర్ణయించారు. ఇద్దరూ ఒకే రోజు వరద బాధితులకు సంబంధించి కార్యక్రమం చేపట్టడం గమనార్హం. అయితే సీఎం కేసీఆర్ ఆకాశంలో విహరిస్తుండగా, గవర్నర్ మాత్రం భూమార్గంలో వెళ్లడానికి నిర్ణయించుకోవడం చర్చనీయాంశమైంది.
గత కొంత కాలంగా కేసీఆర్ సర్కార్, గవర్నర్ మధ్య వ్యవహారం ఉప్పునిప్పులా వుంది. దాదాపు 8 నెలల తర్వాత సీఎం కేసీఆర్ రాజభవన్కు వెళ్లారు. అది కూడా హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రమాణ స్వీకారానికి వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంలో ఇద్దరూ పరస్పరం ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఆ తర్వాత కేసీఆర్ ప్రభుత్వంపై గవర్నర్ నుంచి ఘాటు వ్యాఖ్యలు రాలేదు.
ఈ నేపథ్యంలో వరద బాధితులను పరామర్శించేందుకు గవర్నర్ ఆదివారం భద్రాచలం వెళ్లనున్నారు. అక్కడి ముంపు ప్రాంతాలను పరిశీలించనున్నారు. ఇప్పటికే తమను ప్రభుత్వం పట్టించుకోలేదని భద్రాచలంలో కొన్ని కాలనీవాసులు రోడ్డెక్కారు. దీంతో గవర్నర్ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.
శనివారం రాత్రి సికింద్రాబాద్ నుంచి రైలులో బయల్దేరి ఆదివారం ఉదయానికి గవర్నర్ భద్రాచలం చేరుకుంటారు. ముంపు ప్రాంత బాధితుల గోడుపై గవర్నర్ ఎలా స్పందిస్తారోననే ఉత్కంఠ నెలకుంది.