ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శ్రేయోభిలాషిగా టీడీపీ యువ నేత, ఎమ్మెల్సీ నారా లోకేశ్ ఓ సూచన చేశారు. సాక్షి రాతల మాయా ప్రపంచం నుంచి జగన్ బయటికి వస్తే వాస్తవాలు తెలుస్తాయని లోకేశ్ చెబుతున్నారు. నిజంగా జగన్‌కు వాస్తవాలు తెలియనంతగా సాక్షి రాతలు రాస్తోందా? అనే అనుమానం కలగకుండా ఉండదు.
ఇదంతా రాష్ట్రంలో విషజ్వరాల గురించి జగన్ దృష్టికి తీసుకెళ్లే క్రమంలో లోకేశ్ ఘాటు వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. కృష్ణా జిల్లా తేంపల్లిలో విష జ్వరాలు ప్రబలి వారంలో ఆరుగురు మృత్యువాత పడగా, 70 మంది వాంతులు, విరేచనాలతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిలో 20 మందిని పిన్నమనేని ఆస్పత్రికి తరలించారు. గ్రామంలో గుడివాడ ఆర్డీవో పర్యటించి పరిస్థితిని చక్కదిద్దే చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో లోకేశ్ సీరియస్‌గా స్పందించారు.
‘జగన్ రెడ్డి గారు మీరు పంపే ఫ్యామిలీ డాక్టర్ వచ్చేలోగా జనాలు బతికేలా లేరు. సాక్షి రాతల మాయా ప్రపంచం నుంచి బయటికొచ్చి వాస్తవం చూస్తే తేంపల్లిలో మరణ మృదంగం కనిపిస్తుంది. విషజ్వరాలతో వారం రోజుల్లో ఆరుగురు మృతి చెందారు. వాంతులు, విరేచనాలతో 70 మంది తీవ్ర అస్వస్థతకి గురై ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మాటల ముఖ్యమంత్రి, ప్రకటనల ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏంటి? బటన్ నొక్కి డయేరియా, విషజ్వరాలు తగ్గించేస్తారా?’ అంటూ లోకేశ్ మండిపడ్డారు.
సంక్షేమ పథకాల లబ్ధిదారులకు బటన్ నొక్కి నేరుగా వారి ఖాతాల్లో డబ్బు జమ చేస్తున్న వైనాన్ని లోకేశ్ పరోక్షంగా వెటకరించారు. అలాగే గ్రామాలకు ఫ్యామిలీ డాక్టర్ పంపేలా చర్యలు తీసుకున్నట్టు సీఎం జగన్ చేసిన ప్రకటనను ఈ సందర్భంగా లోకేశ్ తప్పు పట్టారు.
వైఎస్ జగన్ ప్రకటించినట్టు ఫ్యామిలీ వైద్యుడు వెళ్లే లోపు జనం బతికేలా లేరని లోకేశ్ ఆందోళన వ్యక్తం చేయడం వరకూ బాగానే ఉంది.
మరి టీడీపీ ప్రభుత్వంలో కనీస వైద్య సౌకర్యాలు ఎందుకు కల్పించలేకపోయారో అని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఆపద సమయాల్లో ప్రజల్ని ఆదుకోడానికి రాజకీయాలకు అతీతంగా ముందుకు రావాల్సింది పోయి, వారి అనారోగ్యాలను కూడా తమ ప్రయోజనాలకు వాడుకోవడం తండ్రీతనయులకే చెల్లిందని ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు.