సమ్మర్ సినిమాలపై గంపెడు ఆశలు

సమ్మర్ సినిమాల సీజన్ మొదలవబోతోంది. వస్తున్న సినిమాల మీద ఆయా హీరోలంతా చాలా ఆశలే పెట్టుకున్నారు. దీనికి కారణం మరేంలేదు. సరైన ట్రాక్ రికార్డు లేకపోవడం తప్ప వేరుకాదు. మార్చి నెలాఖరున నిఖిల్ సిద్దార్థ…

సమ్మర్ సినిమాల సీజన్ మొదలవబోతోంది. వస్తున్న సినిమాల మీద ఆయా హీరోలంతా చాలా ఆశలే పెట్టుకున్నారు. దీనికి కారణం మరేంలేదు. సరైన ట్రాక్ రికార్డు లేకపోవడం తప్ప వేరుకాదు. మార్చి నెలాఖరున నిఖిల్ సిద్దార్థ 'అర్జున్ సురవరం' విడుదల కాబోతోంది. నిఖిల్ ఓ హిట్ కోసం చాన్నాళ్లుగా ఎదురుచూస్తున్నాడు. ఆ కోరికను ఈ సినిమా తీరుస్తుందన్న ఆశతో వున్నారు.

ఏప్రియల్ 5న మజిలీ వస్తోంది. ఈ సినిమా మీద హీరో నాగచైతన్య చాలా ఆశగా వున్నాడు. భార్య, హీరోయిన్ సమంత అదృష్టం తనకు కాస్తయినా అంటుకుని, హిట్ కళ్ల చూస్తానని భావిస్తున్నాడు. ఇప్పటికే చైతన్య చాలా ఫ్లాపుల్లో వున్నాడు. ఈ సినిమా హిట్ కావడం చైతన్యకు చాలా అవసరం.

12న చిత్రలహరి సినిమాతో వస్తున్నాడు సాయితేజ్ గా పేరు మార్చుకున్న సాయిధరమ్ తేజ్. అతని పరిస్థితి ఏమిటో అందరికీ తెలిసిందే. ఈ సినిమా మళ్లీ హిట్ కళ తేవాలని ఏడో ఫ్లాపుగా మిగలకూడదని సాయితేజ్ ఆశపడుతున్నాడు. నిర్మాణ సంస్థ మైత్రీమూవీస్ కూడా అదే ఆశతో వుంది. ఇటీవలే రెండుఫ్లాపులు ఇచ్చిందా సంస్థ.

19న నాని జెర్సీ వస్తోంది. నాని ట్రాక్ కూడా మరీ గొప్పగాలేదు. కృష్ణార్జున యుద్దం, దేవదాస్ తరువాత ఈ సినిమా వస్తోంది. ఆ రెండు సినిమాలు గొప్పగా ఆడలేదు. ఈ సినిమా మీద నానికి మంచి ఆశలు వున్నాయి. పైగా ఈ సినిమాలో నిర్మాణ భాగస్వామిగా వున్నాడు. ఈ సినిమా మంచి పేరు తెస్తుందని ఆశిస్తున్నాడు. ఏమవుతుందో చూడాలి.

మే నెల ఫస్ట్ వీక్ లో వస్తున్నాడు మహేష్ బాబు తన మహర్షి సినిమాతో. బ్రహ్మోత్సవం, స్పైడర్ సినిమాల తరువాత భరత్ అనే నేను కాస్త ఊరట. అయితే ఆ సినిమా హిట్ నే కానీ, బయ్యర్లకు మాత్రం లాస్ నే. ఇప్పడు మహర్షి సినిమా వస్తోంది. ఈ సినిమా ఇటు మహేష్ కు, అటు బయ్యర్లకు కూడా కలిసిరావాలి. అప్పుడే ట్రాక్ రికార్డు బాగుంటుంది.

మే రెండోవారంలో వస్తున్నాడు హీరో రామ్ తన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో. రామ్ పరిస్థితి తెలిసిందే. ఒక హిట్ కోసం ఆశగా చూస్తున్నాడు. ఈ సినిమా డైరక్టర్ పూరి జగన్నాధ్ ది కూడా అదే పరిస్థితి. మరి ఈ ఇద్దరి కోరికను ఇస్మార్ట్ శంకర్ తీరుస్తుందో లేదో?

ఆ తరువాత వస్తోంది విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్. టాక్సీవాలా సినిమా తరువాత విజయ్ సినిమా ఇది. అంతకుముందు నోటా ఓ చేదు ఫలితం ఇచ్చింది. టాక్సీవాలా ఫరావాలేదు అనిపించుకుంది. ఇప్పుడు వున్న క్రేజ్ బాగా పెరిగాలి, నిలబెట్టుకోవాలి అంటే డియర్ కామ్రేడ్ విజయం సాధించి తీరాలి.

ఈ విధంగా సమ్మర్ సినిమాలు అన్నీ హిట్ అయి తీరాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. మరి ఫలితాలు ఎలా వుంటాయో చూడాలి.

పరిటాల కుటుంబం గెలిస్తే.. వీళ్లంతా పారిపోవాల్సిందే

యాత్ర సినిమా సగటు విజయం ఏం చెప్తోంది?