కరోనా విపత్తును ఎదుర్కొనడానికి భారీ విరాళాన్ని ప్రకటించాడు విప్రో ఫౌండర్ అజీమ్ ప్రేమ్ జీ. తన సంస్థల తరఫు నుంచి ఏకంగా 1,125 కోట్ల రూపాయల మొత్తాన్ని ఆయన విరాళంగా ప్రకటించారు. ఇందులో వెయ్యి కోట్ల రూపాయల మొత్తాన్ని అజీమ్ ప్రేమ్ జీ ఫౌండేషన్ తరఫు నుంచి ప్రకటించారు. మరో వంద కోట్ల రూపాయల మొత్తాన్ని విప్రో లిమిటెడ్ తరఫు నుంచి ప్రకటించారు. 25 కోట్ల రూపాయల మొత్తాన్ని విప్రో ఎంటర్ ప్రైజెస్ తరఫు నుంచి ప్రకటించారు.
అయితే ఈ మొత్తాన్ని ఎలా ఖర్చు చేస్తారనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. ఇండియాలో కోవిడ్ 19 విపత్తును ఎదుర్కొనడానికి ఈ విరాళాన్ని వెచ్చిస్తున్నట్టుగా విప్రో సంస్థలు ప్రకటించాయి. అయితే ఈ సొమ్మును భారత ప్రభుత్వ సహాయ నిధులకు ఇస్తారా? లేక డైరెక్టుగా విప్రోనే ఈ డబ్బును ఖర్చు చేస్తుందా? అనే విషయాలపై ఇంకా స్పష్టత లేదు.
1,125 కోట్ల రూపాయల విరాళం మాత్రం రికార్డు స్థాయి దాతృత్వమే అని చెప్పవచ్చు. ఇప్పటికే విప్రో ఫౌండర్ ప్రేమ్ జీ తన దాతృత్వంతో ప్రఖ్యాతిని పొందారు. అజీమ్ ప్రేమ్ జీ ఫౌండేషన్ కు దాదాపు 50 వేల కోట్ల రూపాయల నిధిని సమకూర్చారు ఆయన. తాము చేపట్టే యథాతథ దాతృత్వ కార్యక్రమాలకు తోడు.. ఈ విరాళ మొత్తాలను ఖర్చు చేస్తున్నట్టుగా విప్రో ప్రకటించింది.