కరోనా మహమ్మారి చేస్తున్న విధ్వంసం నుంచి ప్రజలను కాపాడేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చేయూతనిచ్చేందుకు సినీ సెలబ్రిటీలు, పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు…ఇలా అనేక మంది పెద్ద ఎత్తున విరాళాలు అందిస్తున్నారు. వీళ్లనే కాదు ప్రతి ఒక్కరూ తమకు తోచిన రీతిలో, శక్తి మేరకు ఆపదలో ఉన్న వాళ్లకు అండగా నిలుస్తున్నారు.
ఈ నేపథ్యంలో విరాళాలు అందివ్వని సెలబ్రిటీలను నెటిజన్లతో పాటు ఇతరత్రా ప్రజలు టార్గెట్ చేస్తున్నారు. ముఖ్యంగా సినిమాకు సంబంధించి సెలబ్రిటీలను సోషల్ మీడియాలో బాగా ట్రోల్ చేస్తున్నారు. ఈ పరంపరలో ఇప్పటి వరకు ఎలాంటి విరాళాన్ని ప్రకటించని బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హాను నెటిజన్లు టార్గెట్ చేశారు.
సోనాక్షి సహ నటులంతా పీఎం సహాయనిధికి, మహారాష్ట్ర ప్రభుత్వానికి సహాయం చేస్తూంటే.. ఆమె మాత్రం అసలు పట్టనట్లు వ్యవహరిస్తున్నారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్ చేయసాగారు. తనకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై సోనాక్షి సీరియస్ అయ్యారు.
దీంతో ఆమె కూడా రంగంలోకి దిగారు. నెటిజన్ల ట్రోల్స్‌కు సోనాక్షి గట్టి కౌంటర్ ఇచ్చారు. నెటిజన్లకు దిమ్మ తిరిగేలా ఆమె ట్వీట్ చేశారు. ఆమె ట్వీట్లో ఏముందంటే….‘ కొంతమంది మంచి పని చేసి చెప్పుకుంటారు. మరికొంత మంది చెప్పుకోడానికి ఇష్టపడరు. నేను రెండో రకం. నన్ను ట్రోల్స్ చేసే వారికి ఒక నిమిషం మౌనం పాటిస్తున్నా. కష్ట కాలంలో ఇలాంటి ట్రోల్స్ చేయడం కంటే.. మీ సమయాన్ని మంచి పని చేయడం కోసం ఉపయోగించండి. విరాళం ప్రకటించడం అనే అంశం నా వ్యక్తిగత విషయం’ అంటూ సోనాక్షి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. సోనాక్షి ట్వీట్‌పై నెటిజన్లు ఎలా స్పందిస్తారో చూడాలి మరి!