బాప్ ఐసా.. బేటా వైసా.. క్యా కమాల్ హై!

తండ్రి మాటలను ఓ పదినిమిషాలపాటు విన్నామంటే.. ఒక బలమైన అభిప్రాయం ఏర్పడుతుంది. అదే సమయంలో.. కొడుకు మాటలను మరొక పది నిమిషాలు విన్నామంటే.. మరొక అభిప్రాయం ఏర్పడుతుంది. ఈ రెండు అభిప్రాయాల మధ్య బోల్డంత…

తండ్రి మాటలను ఓ పదినిమిషాలపాటు విన్నామంటే.. ఒక బలమైన అభిప్రాయం ఏర్పడుతుంది. అదే సమయంలో.. కొడుకు మాటలను మరొక పది నిమిషాలు విన్నామంటే.. మరొక అభిప్రాయం ఏర్పడుతుంది. ఈ రెండు అభిప్రాయాల మధ్య బోల్డంత కాంట్రాస్ట్ ఉంటుంది. ఎక్కడా మ్యాచ్ కావు! విన్నవాళ్లు రెండింటినీ కలగలిపి చూసుకుంటే.. బోలెడంత కన్ఫ్యూజన్ తప్పదు! తమ అభిమానులైన ప్రజలను ఇలా గందరగోళంలోకి నెడుతున్న తల్లీదండ్రులు మరెవ్వరో కాదు.. గులాబీ దళపతి కేసీఆర్, చిన్న దళపతి కేటీఆర్!

కేసీఆర్ ఇటీవలి కాలంలో ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా.. జాతీయ రాజకీయాల గురించి, బిజెపిని మట్టి కరిపించడం గురించి మాత్రమే మాట్లాడుతుంటారు. బిజెపిని ఓడించడం తమ రాష్ట్రంలో సంగతి కాదు.. దేశంలో ఓడించి, మోడీనుంచి దేశానికి విముక్తి కల్పించడం గురించి మాత్రమే మాట్లాడుతుంటారు. అందుకోసం దేశంలోని అన్ని పార్టీలనూ తాను ఒక్క తాటికి మీదికి తెచ్చేస్తానని అంటూ ఉంటారు. అక్కడితో ఆగరు.. జాతీయ రాజకీయాల గురించి విలేకరులు అడిగితే.. ఎదురు ప్రశ్నలతో కొత్త ఊహలను పుట్టిస్తారు. 

‘ప్రధాని పదవి ఆశిస్తున్నారా?’ అని అడిగితే.. ‘తెలంగాణకు ఒక మంచిపాలన అందించాం, గాడిలో పెట్టాం…. దేశాన్ని గాడిలో పెట్టొద్దా’ అని ఎదురడుగుతారు? ‘జాతీయ పార్టీ పెడతారా?’ అంటే.. ‘పెట్టొద్దంటావా?’ అంటారు. ఇలా కొత్త సందేహాలకు తావిస్తుంటారు. జాతీయ పార్టీ పెట్టి.. దేశమంతా తన బిజెపి వ్యతిరేకతను ప్రదర్శించాలనేది కేసీఆర్ ప్రణాళిక అనే విషయం ఇప్పటికే బయటకు వచ్చింది. 

ఈ పరిణామాలను అన్నింటినీ గమనించినప్పుడు.. వచ్చే ఎన్నికల నాటికి కేసీఆర్ పూర్తిగా జాతీయ రాజకీయాలకు మాత్రమే పరిమితం అవుతారని, ఎంపీగా బరిలోకి దిగి.. మోడీకి చెమటలు పట్టిస్తారని ఆయన అభిమానులు అనుకోవడం సహజం. 

కానీ కొడుకు కేటీఆర్ మాటలను గమనిస్తే.. తద్భిన్నంగా కనిపిస్తాయి! ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. కేసీఆర్.. ఈసారి తెలంగాణ ముఖ్యమంత్రిగా హ్యాట్రిక్ కొట్టబోతున్నారంటూ ఢంకా బజాయించి చెప్పేశారు. మామూలు పరిస్థితుల్లో అయితే.. ఈ మాటలు.. తాము మళ్లీ గెలవబోతున్నాం అనే ఆత్మవిశ్వాసానికి ప్రతీకలుగా మాత్రమే కనిపించేవి. కానీ.. కేసీఆర్ కొన్నాళ్లుగా ఏర్పాటుచేసిన వాతావరణంలో ఈ మాటలు.. కేసీఆర్ జాతీయ రాజకీయాల మీద ఆశ వదలుకున్నారా? దానికి సంబంధించి కేటీఆర్ ద్వారా లీకులు ఇప్పిస్తున్నారా? అనే అనుమానం కూడా కలుగుతుంది.

తెలంగాణ సీఎం కుర్చీకి అప్రకటిత వారసుడిగా కేటీఆర్ అధికారం చెలాయిస్తూనే ఉన్నారు. ప్రతి వ్యవహారమూ ఆయన కనుసన్నల్లోనే జరుగుతోంది. ‘సీఎంగా కేసీఆర్ హ్యాట్రిక్’ అనే మాట చెప్పకుండా.. కేటీఆర్ మౌనం పాటించి ఉంటే ఇంకో రకంగా ఉండేది. అలా అనడం వల్లనే.. సీఎం పీఠం కేటీఆర్ కు ఇప్పట్లో దక్కబోవడం లేదా అనే సందేహాలు కలుగుతున్నాయి. ఇలాంటి సస్పెన్స్ ను తేల్చకుండా.. తన ప్రయోజనాలు నెరవేర్చుకోవడంలో కేసీఆర్ దిట్ట. 

ఈ దఫా కూడా ఆయన అలాగే వ్యవహరించవచ్చు. ఎన్నికలు వస్తే.. కేసీఆర్ ఫోకస్ తెలంగాణపైనా? హస్తినపైనా? క్లారిటీ వచ్చేస్తుందనే అభిప్రాయం మనకు ఉండొచ్చు గానీ.. కేసీఆర్ అటు ఎమ్మెల్యేగానూ, ఎంపీగానూ కూడా పోటీచేసి.. ఫలితాల తర్వాత.. ఖరారుకాగల బలాబలాలను బట్టి.. ఎటువైపు మొగ్గాలో తేల్చుకునేలా.. ఇదే సస్పెన్స్ ను కొనసాగించినా ఆశ్చర్యం లేదు.